కార్మిక శాఖలో ఫైళ్లు మాయం
విచారణ ఫైళ్లకు తిలోదకాలు
విజిలెన్స్ విభాగంలో అవినీతి తిష్ట
ఉన్నతాధికారుల ప్రేక్షక పాత్ర
కమిషనరేట్ అవినీతి మయం
సిటీబ్యూరో: కార్మిక శాఖ కమిషనరేట్‌లో ఫైళ్ల మాయమవడం కలకలం రేపుతోంది. సాక్షాత్తూ పరిపాలన, విజిలెన్స్ విభాగాలకు అధికారికంగా అందుతున్న ఫైళ్లే మాయమవుతున్నాయి. మరోవైపు అవినీతి ఆరోపణలకు సంబంధించిన విచారణ ఫైళ్లు ఏళ్ల తరబడి పెండింగ్‌లో మగ్గుతున్నాయి. అధికారులు వాటిపై నివేదికలు తెప్పించుకోవడంలోనూ నిర్లక్ష్యం వహించడం విస్మయానికి గురిచేస్తోంది. విజిలెన్స్ విభాగంలో దీర్ఘకాలంగా తిష్టవేసిన అవినీతి తిమింగలంపై అభియోగాలు వచ్చినా స్థాన చలనం కలుగడం లేదు. కొత్తగా కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఈ వ్యవహారాలపై ప్రేక్షక పాత్ర పోషించడం కార్మిక శాఖ కమిషనరేట్‌లో చర్చనీయాంశంగా మారింది.
లేదని చెబుతూ...
కార్మిక శాఖలోని అంతర్గత అవినీతి ఆరోపణలపై రెండేళ్ల క్రితం పరిపాలన, విజిలెన్స్ విభాగానికి అధికారికంగా (లెటర్ నంబర్ ఏ/5002/2013/ తేది. 07-11-2013) ఒక ఫైలు చేరింది. అందులో ‘కార్మిక శాఖలో పోస్టింగ్ ఉత్తర్వులు లేకుండా ఒక అధికారి హైదరాబాద్-2 డీసీఎల్‌గా విధుల్లో చేరి 13 నెలల పాటు జీతాన్ని అక్రమంగా డ్రా చేసుకున్నారు’ అనే అభియోగాలకు సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలతో అధికారికంగా పరిపాలన, విజిలెన్స్ విభాగానికి ఫైలు అందింది. కానీ రెండేళ్లు గడిచినా దానిపై విచారణ జరుగలేదు. తాజాగా ఆ ఫైలు పురోగతిపై ఆరా తీస్తే .. కొం దరి చేతివాటంతో మాయమైనట్లు తెలిసింది. సంబంధిత అధికారులు సైతం ఆ దస్త్రం పరిపాలన, విజిలెన్స్ విభాగాలల్లో లేదని స్పష్టం చేయడం గమనార్హం.
నిండా నిర్లక్ష్యమే..
కార్మిక శాఖలో అంతర్గత అవినీతి, అక్రమాలకు సంబంధించిన విచారణ ఫైళ్లు ఏళ్ల తరబడి పెండింగ్‌లో మగ్గుతూనే ఉన్నాయి. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, సంబంధిత విభాగాల పర్యవేక్షకుల అవినీతి, అక్రమాలతో ఇవి కదలడం లేదు. ఉదాహరణకు మూడేళ్ల క్రితం పరిపాలన, విజిలెన్స్ విభాగాలకు (లెటర్ నంబర్ ఏ/ఓపీ1/2012 తేది.25-08-2012) అధికారికంగా ఒక ఫైలు చేరింది. అందులో ‘రంగారెడ్డి జిల్లా డీసీఎల్ అధికారి ఒకరు ఆఫీస్ రికార్డులను ట్యాంపరింగ్ చేసి అక్రమాలకు పాల్పడ్డాడు’ అనే అభియోగాలకు సంబంధించి పూర్తి ఆధారాలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఫైల్ అందిన 15 నెలల తర్వాత సంబంధిత విభాగం నుంచి రంగారెడ్డి జిల్లా జాయింట్ లేబర్ కమిషనర్‌కు ఆఫీస్ మెమో నంబర్ ఏ1/11679/2011. తేదీ 12/11/2013 ద్వారా ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని మెమో జారీ అయింది. ఇప్పటి వరకు దానికి సంబంధించి నివేదిక ఆ విభాగానికి చేరలేదు. దాని కోసం వేచిచూస్తున్నామని సంబంధిత అధికారులు చెబుతుండడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.