
దత్తాత్రేయకు కార్మిక శాఖ!
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెరొక సహాయ మంత్రి పదవులు దక్కనున్నాయి. ఆదివారం జరిగే మంత్రి వర్గ విస్తరణంలో తెలంగాణలో బీజేపీకి ఏకైక ఎంపీగా ఉన్న బండారు దత్తాత్రేయ స్థానం లభించనుంది. ఆయనకు కార్మిక శాఖ ఇవ్వనున్నట్లు సమాచారం.
టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి పోర్ట్ ఫోలియో లభించనున్నట్టు తెలుస్తోంది. దత్తాత్రేయ గతంలో 1998-2002లో వాజ్‌పేయి ప్రభుత్వంలో పట్టణాభివృద్ధిశాఖ సహాయ మంత్రిగా... 2002-04 మధ్య రైల్వేశాఖ సహాయ మంత్రిగా చేశారు. ఈ సారి కూడా ఆయనకు సహాయ పదవి దక్కనున్నట్టు తెలిసింది. తాజా మంత్రివర్గ విస్తరణలో చివరి నిమిషంలో దత్తాత్రేయకు చోటు దక్కినట్లు తెలుస్తోంది.
కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొలువుదీరిన సందర్భంలోనే తెలంగాణ నుంచి దత్తాత్రేయకు మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని భావించినా అలా జరగలేదు. అయితే దత్తాత్రేయకు పదవి ఇవ్వకుంటే కేంద్రం తెలంగాణను చిన్నచూపు చూస్తోందన్న టీఆర్‌ఎస్ ఆరోపణ నిజమవుతుందని బీజేపీ శ్రేణులు చెప్పడంతో ఆయనకు మోదీ చోటు కల్పించనున్నారు.