
ప్రభుత్వ శాఖల్లో కార్మిక చట్టాల ఉల్లంఘన
కేంద్ర చీఫ్ లేబర్ కమిషనర్ అనిల్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ శాఖల్లో కార్మిక చట్టాల ఉల్లంఘన జరుగుతోందని కేంద్ర చీఫ్ లేబర్ కమిషనర్ అనిల్‌కుమార్ నాయక్ అన్నారు. సదరు శాఖలు కూడా నిబంధనలను పటిష్టంగా అమలు చేసేలా చర్యలు తీసుకొంటామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మంచి పరిపాలనా పద్ధతులు, కార్మిక విధానాలను అనుసరించాలని సూచించారు. మెరుగైన పని విధానం, కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్, యాజమాన్యాలు, కార్మిక సంఘాలు, కార్మికుల మధ్య ఆరోగ్యకర వాతావరణం తదితర అంశాలకు సంబంధించి విధానపరమైన మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు వెల్లడించారు.
‘శ్రమ సువిధ’ పోర్టల్‌లో చట్టాల ఉల్లంఘన వంటి అంశాలకు సంబంధించి ఫిర్యాదులు చేయవచ్చునన్నారు. శుక్రవారం సోమాజిగూడలోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థలు, కార్మిక సంఘాలు, కార్మిక, ఇతర శాఖల అధికారులతో అనిల్‌కుమార్ సమీక్ష నిర్వహించారు. కార్మికుల న్యాయపరమైన హక్కులను పరిరక్షించడమే తమ ధ్యేయమని ఆయన ఈ సందర్భంగా అన్నారు. పరిశ్రమల్లో కార్మిక చట్టాల అమలు, కార్మికుల హక్కుల పరిరక్షణకు శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గత ఏడాది కాలంలో మొత్తం 3,500 పారిశ్రామిక వివాదాల్లో 1,700 కేసులను పరిష్కరించామని, సెంట్రల్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్‌లో ఇంకా 700 కేసులున్నాయని తెలిపారు.
కాగా, సమీక్షకు ఉద్దేశపూర్వకంగానే తమకు ఆహ్వానాలు పంపలేదని సీఐటీయూకు చెందిన ఎస్.నరసింహారెడ్డి అరుణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. కార్మిక శాఖ యాజమాన్యాలకే మద్దతు పలుకుతోందన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచడం లేదని వెంకటరావు (సింగరేణి కాలరీస్ సంఘం) చీఫ్ కమిషనర్ దృష్టికి తెచ్చారు. కార్మికుల సమస్యలపై... సీతారామయ్య (సింగరేణి కార్మిక సంఘం), మంత్రి రాజశేఖర్ (విశాఖ స్టీల్స్-ఐఎన్‌టీయూసీ), గట్టయ్య(ఏఐటీయూసీ), తుమ్మల మల్లేష్, జె.ఉపేందర్ (సింగరేణి గనికార్మిక సంఘం), ప్రకాష్ (ఏపీ సీఐటీయూ), సతీష్ (ఓఎన్‌జీసీ), సారంగపాణి, మల్లేశం ఆయనకు వివరించారు. ఏపీ, టీఎస్ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ కేవీ రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పీఎఫ్ కమిషనర్ కేకే జలానా, తెలంగాణ, ఏపీ లేబర్ కమిషనర్లు ఎన్.కృష్ణారావు, ఎస్‌కే మిశ్రా పాల్గొన్నారు.