
వాషింగ్టన్: అమెరికా ద్రవ్యోల్బణం సెగ చూస్తోంది. కరోనా మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు ఫెడ్ పెద్ద చేత్తో మార్కెట్లోకి నిధులు కుమ్మరించింది. దీంతో గడిచిన ఏడాది కాలంలో ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతూ నాలుగు దశాబ్దాల్లోనే గరిష్ట స్థాయి అయిన 7.5 శాతాన్ని తాకింది. 2022 జనవరి నెలకు వినియోగ ధరల ద్రవ్యోల్బణం 7.5 శాతానికి చేరినట్టు అమెరికా కార్మిక శాఖ గురువారం ప్రకటించింది.
ఇలా ద్రవ్యోల్బణం ఏడాది కాలంలో కట్టలు తెంచుకోవడం అమెరికా చరిత్రలో చివరిగా 1982లో చోటు చేసుకుంది. ఆహారం, ఇంధనం, అపార్ట్‌మెంట్ అద్దెలు, విద్యుత్ చార్జీలు పెరగడం ద్రవ్యోల్బణం సెగలకు కారణాలు. 2021 డిసెంబర్ చివరి నుంచి చూస్తే ఒక నెలలో ద్రవ్యోల్బణం 0.6% పెరిగింది. గత సెప్టెంబర్ నుంచి అక్టోబర్‌కు 0.9%, అక్టోబర్ నుంచి నవంబర్‌కు 0.7% చొప్పున ధరలు పెరిగాయి. ఫెడ్ పెద్ద ఎత్తున నిధులు జొప్పించడం, వడ్డీ రేట్లు అత్యంత కనిష్ట స్థాయిలో ఉండడం, బలమైన వినియోగ డిమాండ్ ద్రవ్యోల్బణం రెక్కలు విప్పుకోవడానికి తోడ్పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment