U.S.
-
1982 తర్వాత అమెరికాలో మళ్లీ మొదలైన ‘సెగ’
వాషింగ్టన్: అమెరికా ద్రవ్యోల్బణం సెగ చూస్తోంది. కరోనా మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు ఫెడ్ పెద్ద చేత్తో మార్కెట్లోకి నిధులు కుమ్మరించింది. దీంతో గడిచిన ఏడాది కాలంలో ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతూ నాలుగు దశాబ్దాల్లోనే గరిష్ట స్థాయి అయిన 7.5 శాతాన్ని తాకింది. 2022 జనవరి నెలకు వినియోగ ధరల ద్రవ్యోల్బణం 7.5 శాతానికి చేరినట్టు అమెరికా కార్మిక శాఖ గురువారం ప్రకటించింది. ఇలా ద్రవ్యోల్బణం ఏడాది కాలంలో కట్టలు తెంచుకోవడం అమెరికా చరిత్రలో చివరిగా 1982లో చోటు చేసుకుంది. ఆహారం, ఇంధనం, అపార్ట్మెంట్ అద్దెలు, విద్యుత్ చార్జీలు పెరగడం ద్రవ్యోల్బణం సెగలకు కారణాలు. 2021 డిసెంబర్ చివరి నుంచి చూస్తే ఒక నెలలో ద్రవ్యోల్బణం 0.6% పెరిగింది. గత సెప్టెంబర్ నుంచి అక్టోబర్‌కు 0.9%, అక్టోబర్ నుంచి నవంబర్‌కు 0.7% చొప్పున ధరలు పెరిగాయి. ఫెడ్ పెద్ద ఎత్తున నిధులు జొప్పించడం, వడ్డీ రేట్లు అత్యంత కనిష్ట స్థాయిలో ఉండడం, బలమైన వినియోగ డిమాండ్ ద్రవ్యోల్బణం రెక్కలు విప్పుకోవడానికి తోడ్పడ్డాయి. -
ఫ్లాపీలకు అమెరికా ఇంకా టాటా చెప్పలేదంట
ప్రపంచానికే పెద్ద అన్నగా ఉన్న అమెరికాలో టెక్నాలజీ దిగ్గజాలేమి తక్కువ కాదు. ఏ టెక్నాలజీ అయినా మొదట కనుగొన్నేదీ, వాడేది ఆ దేశమే. అయితే అమెరికాలో పాత టెక్నాలజీలకు ఇంకా స్థానం పోవడం లేదట. ఏ న్యూక్లియర్ ప్రొగ్రామ్ రన్ అవ్వాలన్నా ఇంకా ఫ్లాపీ డెస్కులునే వాడుతున్నారని అమెరికా ప్రభుత్వ అకౌంటబిలిటీ ఆఫీస్(జీఏఓ) రిపోర్టు నివేదించింది. 1970 దశాబ్దానికి చెందిన కంప్యూటర్లలో 8 అంగుళాల ఫ్లాపీ డెస్కులనే పెంటాగాన్((అమెరికా డిఫెన్స్ ప్రధాన కార్యాలయం) ఇంకా వాడుతుందని పేర్కొంది. ఆ డెస్కులు దాదాపు అదే దశాబ్దంలోనే కనుమరుగయ్యాయి. 3.5 నుంచి 5.25 అంగుళాల డెస్కులు రావడంతో ఫ్లాపీ డెస్కులకు డిమాండ్ తగ్గిపోయింది. ప్రస్తుతం ఎక్కడో ఓ దగ్గర కనిపిస్తున్నాయి. కానీ అమెరికాలో ఇంకా ఈ డెస్కులనే వాడుతున్నారని రిపోర్టు తెలిపింది. వాషింగ్టన్ మినహా అమెరికా ప్రభుత్వ కార్యాలయాలన్నీ, డేట్ అయిపోయిన, కనుమరుగవుతున్నా పాత టెక్నాలజీలపై 6000 కోట్ల డాలర్ల వరకూ ఖర్చు చేస్తున్నాయని జీఏఓ రిపోర్టు తెలిపింది. ఈ ఖర్చు కొత్త ఐటీ సిస్టమ్ లపై పెట్టే పెట్టుబడుల కంటే మూడురెట్లు అధికంగా ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఈ అవుట్ డేటడ్ టెక్నాలజీ ఫ్లాపీ సిస్టమ్ లపై దృష్టిపెట్టిన పెంటాగాన్ ఈ టెక్నాలజీల స్థానంలో కొత్త టెక్నాలజీలను వాడాలని ప్రయత్నిస్తోందని తెలిపింది. ఖండాతర బాలిస్టిక్ క్షిపణులు, న్యూక్లియర్ బాంబర్లు, ట్యాంకర్ సపోర్టు ఎయిర్ క్రాప్ట్ లను ఈ సిస్టమ్సే ప్రస్తుతం సమన్వయ పరుస్తున్నాయి. 2017 చివరి వరకూ ఈ సిస్టమ్ లను పెంటాగాన్ మార్చనుంది. ఇతర కార్యాలయాలకు కూడా ఈ సిస్టమ్ లను మార్చాలని నోటీసులు అందాయి. అమెరికా ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ పాత తరం నుంచి బయటపడేసి కొత్తగా 21వ శతాబ్దంలోకి తీసుకురావడం అతిపెద్ద సవాల్ అని బోర్డు తెలిపింది. -
అమెరికా చిన్నారికి చైనా యూజర్ల సహకారం
ఆ చిన్నారి అందరిలాగే తానూ ఎంతో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందాలనుకుంది. అదీ... గ్రేట్ వాల్ కలిగిన చైనా దేశంలోనే ప్రసిద్ధిపొందిన వ్యక్తిగా మారాలనుకుంది. అయితే దురదృష్టం ఆమెను వెంటాడింది. ఓ మాయదారి రోగంతో బాధపడుతున్న ఆ ఎనిమిదేళ్ళ బాలిక జీవితానికి అంత సమయం లేకపోయింది. అందుకే తల్లిదండ్రులు ఆమె కోరిక తీర్చేందుకు సామాజిక మాధ్యమాల సహాయం కోరారు. ఫేస్ బుక్ లో తమకు సహకరించమని వేడుకున్నారు. దీనికి చైనా నెట్ వినియోగదారులు భారీగా స్పందించారు. అమెరికాలోని రోడే ఐల్యాండ్ వెస్లీ ప్రాంతానికి చెందిన డోరియన్ కు నాలుగేళ్ళ వయసులోనే చిన్నపిల్లల్లో చాలా అరుదుగా కనిపించే క్యాన్సర్ (ర్యాబ్డోమియోసర్కోమా) సోకింది. పసి వయసులోనే శరీరమంతా పాకిన ఆ జబ్బుకు వైద్యం లేదని ఇంటికి వెళ్ళిపొమ్మని వైద్యులు చెప్పేశారు. పది రోజుల తర్వాత బాధితురాలి తల్లి తన గారాలపట్టి కోరికతోపాటు... చిన్నారి డోరియన్ గురించి ప్రార్థనలు చేయమంటూ.. ఫేస్ బుక్ లో తన విన్నపాన్ని పోస్ట్ చేసింది. దీంతో చైనా ఇంటర్నెట్ యూజర్లు మరణానికి దగ్గరలో ఉన్న ఆ పసిప్రాణం కల నిజం చేసేందుకు నడుం బిగించారు. ముందుగా స్పందించిన జు జింగ్ అనే మహిళ స్వయంగా బీజింగ్ దగ్గరలోని గ్రేట్ వాల్ ప్రాంతానికి వెళ్ళి, తనతోపాటు ఇతరులను కూడా 'డి స్ట్రాంగ్' బోర్డుతో ఫోటోలు తీసి ఆ సందేశాన్ని ప్రపంచవ్యాప్తం చేసేందుకు ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ వీబోలో పోస్ట్ చేసింది. గ్రేట్ వాల్ ఎక్కినందుకు ఆమె ఓ మెడల్ ను కూడా పొందింది. మెడల్ తో పాటు ఆ ఫోటోలను డోరియన్ కుటుంబానికి పంపించింది. దీంతో గ్రేట్ వాల్ తో పాటు ఇతర చైనాలోని ప్రముఖ స్థలాల్లో 'డి స్ట్రాంగ్' అంటూ తీసుకున్న అనేక ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తాయి. అంతేకాదు చైనా ప్రభుత్వ వార్తా పత్రిక సిబ్బంది కూడా ఈ ప్రచారంలో పాలుపంచుకున్నారు. ఇంకేముందీ డి స్ట్రాంగ్ వీబోలో టాప్ టెన్ టాపిక్స్ లో ముందు నిలిచింది. దీంతో ఐదువేలకు పైగా లైక్ లు, 2,500 పైగా షేర్లు వచ్చిన కొన్ని ఫోటోలు, వీడియోలను వీబో అధికారికంగా వెల్లడించింది. తమకు అందిన సహకారానికి డోరియన్ తల్లి మెలీసా ఆశ్చర్యపోయింది. డోరియన్ ప్రపంచ ప్రజలనుంచి ఎంతో స్ఫూర్తిని పొందిందని, అందరికీ తమ కృతజ్ఞతలు తెలుపుతూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. పలువురు ప్రముఖులు కూడా ట్విట్టర్, ఫేస్ బుక్ లలో డోరియన్ కు ప్రోత్పాహాన్నిచ్చారు. వారికి మాత్రమే అనుమతి ఉండే హాలీడే రిసార్ట్ లో వీఐపీ ట్రీట్ మెంట్ తో ఆనందంగా గడిపేందుకు ఒకరోజు అవకాశం కల్పించారు. స్థానిక రోడే ఐల్యాండ్ గవర్నర్, ఆయన సెనేటర్లు కూడా డి స్ట్రాంగ్ ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. -
ఇంటిపై కూలిన విమానం- ముగ్గురి మృతి
వాషింగ్టన్: గాల్లో ఎగరాల్సిన విమానం అకస్మాత్తుగా జనావాసాలమీదికి దూసుకువచ్చింది. బోస్టన్లోని ఒక ఇంటిపై విమానం కూలిపోవడంతో మంటలు చెలరేగాయి. భారీగా ఎగిసిపడిన అగ్నికి విమానంలోని ముగ్గురు సిబ్బంది ఆహుతయ్యారు. ఆదివారం ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అమెరికాలోని పెన్సిల్వేనియా నుండి మసాచుసెట్స్‌కు బయలుదేరిన బీచ్ క్రాఫ్ట్ BE36 విమానం బోస్టన్లోని ప్లెయిన్ విల్లేలోని ఒక ఇంటిపై కూలిపోయింది. దీంతో మంటలు చెలరేగాయి. ఆ ఇంటిని చుట్టుముట్టిన మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక దళాలు దాదాపు మూడుగంటలుపాటు కష్టపడాల్సి వచ్చింది. అయితే ఈ ప్రమాదంనుంచి ఆ ఇంటిలో నివాసం ఉంటున్న వారు అదృష్ట వశాత్తూ తప్పించుకున్నారు. తమ ఇంటివైపు దూసుకువస్తూ కూలిపోతున్నవిమానాన్ని చూశామని, భయభ్రాంతులకు లోనయ్యామని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఇంజిన్‌లోంచి శబ్దాలు గమనించామని, పెద్దశబ్దంతో విమానం కూలిపోయిన తర్వాత భారీ ఎత్తున పొగ వ్యాపించిందని తెలిపారు. మరణించినవారిని గుర్తించేంతవరకు నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు వివరాలను వెల్లడించలేమని ఫెడరల్ ఏవియేషన్ ఎడ్మినిస్ట్రేషన్ అధికారి జిమ్ పీటర్స్ తెలిపారు. -
వెలుగులో ఐటీ, ఎఫ్ఎంసీజీ
ఆసియా స్టాక్ మార్కెట్లు పతనమైనా, భారత్ సూచీలు బుధవారం ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్ల మద్దతుతో పాజిటివ్‌గా ముగిశాయి. చైనా వృద్ధి రేటు మందగించిన ప్రభావంతో జపాన్, హాంకాంగ్, సింగపూర్, కొరియా తదితర ఆసియా మార్కెట్లు 1-2 శాతం మధ్య పడిపోయాయి. యూరప్ మార్కెట్లు కూడా క్షీణతతో ట్రేడవుతున్నా, బీఎస్ఈ సెన్సెక్స్ 30 పాయింట్ల పెరుగుదలతో 21,856 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 5 పాయింట్లు లాభపడి 6,517 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మన మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడే పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాల పట్ల ఆశాభావంతో మార్కెట్ పాజిటివ్‌గా ముగిసిందని బ్రోకింగ్ వర్గాలు తెలిపాయి. తదుపరి వెలువడిన డేటా ప్రకారం మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఫిబ్రవరి నెల ద్రవ్యోల్బణం రేటు 8.1 శాతానికి తగ్గింది. జనవరి నెలలో పారిశ్రామికోత్పత్తి తగ్గొచ్చన్నది మార్కెట్ అంచనా కాగా, ఐఐపీ సూచీ 0.1 శాతం పెరిగింది. లిస్టింగ్‌లోనే శాంకో నీరసం ముంబై: ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్ ద్వారా లిస్టయిన పీవీసీ పైపుల తయారీ సంస్థ శాంకో ఇండస్ట్రీస్ తొలి రోజు 4% నష్టపోయింది. ఈ చిన్న, మధ్యతరహా సంస్థ(ఎస్ఎంఈ) షేరు రూ. 19 వద్ద లిస్టయ్యింది. ఆపై 4.2% క్షీణించి రూ. 17.25 వద్ద ముగిసింది. హిమాచల్ ప్రదేశ్‌లో యూనిట్ కలిగిన శాంకో ఎన్ఎస్ఈ ఎమర్జ్ ద్వారా లిస్టయిన ఐదో కంపెనీగా నిలిచింది. చిన్న సంస్థలు(ఎస్ఎంఈలు) ఐపీవోలను చేపట్టి నిధులు సమీకరించేందుకు వీలుగా ఎన్ఎస్ఈ ఏర్పాటు చేసిన ప్లాట్‌ఫామ్ ఎమర్జ్‌కాగా, శాంకో గత నెల 24న రూ. 18 ధరలో 24 లక్షల షేర్లను విక్రయించింది.