ప్రపంచానికే పెద్ద అన్నగా ఉన్న అమెరికాలో టెక్నాలజీ దిగ్గజాలేమి తక్కువ కాదు. ఏ టెక్నాలజీ అయినా మొదట కనుగొన్నేదీ, వాడేది ఆ దేశమే. అయితే అమెరికాలో పాత టెక్నాలజీలకు ఇంకా స్థానం పోవడం లేదట. ఏ న్యూక్లియర్ ప్రొగ్రామ్ రన్ అవ్వాలన్నా ఇంకా ఫ్లాపీ డెస్కులునే వాడుతున్నారని అమెరికా ప్రభుత్వ అకౌంటబిలిటీ ఆఫీస్(జీఏఓ) రిపోర్టు నివేదించింది. 1970 దశాబ్దానికి చెందిన కంప్యూటర్లలో 8 అంగుళాల ఫ్లాపీ డెస్కులనే పెంటాగాన్((అమెరికా డిఫెన్స్ ప్రధాన కార్యాలయం) ఇంకా వాడుతుందని పేర్కొంది. ఆ డెస్కులు దాదాపు అదే దశాబ్దంలోనే కనుమరుగయ్యాయి. 3.5 నుంచి 5.25 అంగుళాల డెస్కులు రావడంతో ఫ్లాపీ డెస్కులకు డిమాండ్ తగ్గిపోయింది. ప్రస్తుతం ఎక్కడో ఓ దగ్గర కనిపిస్తున్నాయి. కానీ అమెరికాలో ఇంకా ఈ డెస్కులనే వాడుతున్నారని రిపోర్టు తెలిపింది.
వాషింగ్టన్ మినహా అమెరికా ప్రభుత్వ కార్యాలయాలన్నీ, డేట్ అయిపోయిన, కనుమరుగవుతున్నా పాత టెక్నాలజీలపై 6000 కోట్ల డాలర్ల వరకూ ఖర్చు చేస్తున్నాయని జీఏఓ రిపోర్టు తెలిపింది. ఈ ఖర్చు కొత్త ఐటీ సిస్టమ్ లపై పెట్టే పెట్టుబడుల కంటే మూడురెట్లు అధికంగా ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఈ అవుట్ డేటడ్ టెక్నాలజీ ఫ్లాపీ సిస్టమ్ లపై దృష్టిపెట్టిన పెంటాగాన్ ఈ టెక్నాలజీల స్థానంలో కొత్త టెక్నాలజీలను వాడాలని ప్రయత్నిస్తోందని తెలిపింది. ఖండాతర బాలిస్టిక్ క్షిపణులు, న్యూక్లియర్ బాంబర్లు, ట్యాంకర్ సపోర్టు ఎయిర్ క్రాప్ట్ లను ఈ సిస్టమ్సే ప్రస్తుతం సమన్వయ పరుస్తున్నాయి. 2017 చివరి వరకూ ఈ సిస్టమ్ లను పెంటాగాన్ మార్చనుంది. ఇతర కార్యాలయాలకు కూడా ఈ సిస్టమ్ లను మార్చాలని నోటీసులు అందాయి. అమెరికా ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ పాత తరం నుంచి బయటపడేసి కొత్తగా 21వ శతాబ్దంలోకి తీసుకురావడం అతిపెద్ద సవాల్ అని బోర్డు తెలిపింది.