అమెరికా చిన్నారికి చైనా యూజర్ల సహకారం
ఆ చిన్నారి అందరిలాగే తానూ ఎంతో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందాలనుకుంది. అదీ... గ్రేట్ వాల్ కలిగిన చైనా దేశంలోనే ప్రసిద్ధిపొందిన వ్యక్తిగా మారాలనుకుంది. అయితే దురదృష్టం ఆమెను వెంటాడింది. ఓ మాయదారి రోగంతో బాధపడుతున్న ఆ ఎనిమిదేళ్ళ బాలిక జీవితానికి అంత సమయం లేకపోయింది. అందుకే తల్లిదండ్రులు ఆమె కోరిక తీర్చేందుకు సామాజిక మాధ్యమాల సహాయం కోరారు. ఫేస్ బుక్ లో తమకు సహకరించమని వేడుకున్నారు. దీనికి చైనా నెట్ వినియోగదారులు భారీగా స్పందించారు.
అమెరికాలోని రోడే ఐల్యాండ్ వెస్లీ ప్రాంతానికి చెందిన డోరియన్ కు నాలుగేళ్ళ వయసులోనే చిన్నపిల్లల్లో చాలా అరుదుగా కనిపించే క్యాన్సర్ (ర్యాబ్డోమియోసర్కోమా) సోకింది. పసి వయసులోనే శరీరమంతా పాకిన ఆ జబ్బుకు వైద్యం లేదని ఇంటికి వెళ్ళిపొమ్మని వైద్యులు చెప్పేశారు. పది రోజుల తర్వాత బాధితురాలి తల్లి తన గారాలపట్టి కోరికతోపాటు... చిన్నారి డోరియన్ గురించి ప్రార్థనలు చేయమంటూ.. ఫేస్ బుక్ లో తన విన్నపాన్ని పోస్ట్ చేసింది. దీంతో చైనా ఇంటర్నెట్ యూజర్లు మరణానికి దగ్గరలో ఉన్న ఆ పసిప్రాణం కల నిజం చేసేందుకు నడుం బిగించారు.
ముందుగా స్పందించిన జు జింగ్ అనే మహిళ స్వయంగా బీజింగ్ దగ్గరలోని గ్రేట్ వాల్ ప్రాంతానికి వెళ్ళి, తనతోపాటు ఇతరులను కూడా 'డి స్ట్రాంగ్' బోర్డుతో ఫోటోలు తీసి ఆ సందేశాన్ని ప్రపంచవ్యాప్తం చేసేందుకు ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ వీబోలో పోస్ట్ చేసింది. గ్రేట్ వాల్ ఎక్కినందుకు ఆమె ఓ మెడల్ ను కూడా పొందింది. మెడల్ తో పాటు ఆ ఫోటోలను డోరియన్ కుటుంబానికి పంపించింది. దీంతో గ్రేట్ వాల్ తో పాటు ఇతర చైనాలోని ప్రముఖ స్థలాల్లో 'డి స్ట్రాంగ్' అంటూ తీసుకున్న అనేక ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తాయి. అంతేకాదు చైనా ప్రభుత్వ వార్తా పత్రిక సిబ్బంది కూడా ఈ ప్రచారంలో పాలుపంచుకున్నారు. ఇంకేముందీ డి స్ట్రాంగ్ వీబోలో టాప్ టెన్ టాపిక్స్ లో ముందు నిలిచింది. దీంతో ఐదువేలకు పైగా లైక్ లు, 2,500 పైగా షేర్లు వచ్చిన కొన్ని ఫోటోలు, వీడియోలను వీబో అధికారికంగా వెల్లడించింది.
తమకు అందిన సహకారానికి డోరియన్ తల్లి మెలీసా ఆశ్చర్యపోయింది. డోరియన్ ప్రపంచ ప్రజలనుంచి ఎంతో స్ఫూర్తిని పొందిందని, అందరికీ తమ కృతజ్ఞతలు తెలుపుతూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. పలువురు ప్రముఖులు కూడా ట్విట్టర్, ఫేస్ బుక్ లలో డోరియన్ కు ప్రోత్పాహాన్నిచ్చారు. వారికి మాత్రమే అనుమతి ఉండే హాలీడే రిసార్ట్ లో వీఐపీ ట్రీట్ మెంట్ తో ఆనందంగా గడిపేందుకు ఒకరోజు అవకాశం కల్పించారు. స్థానిక రోడే ఐల్యాండ్ గవర్నర్, ఆయన సెనేటర్లు కూడా డి స్ట్రాంగ్ ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.