కాసులు కురిపిస్తున్న ఉద్యోగాలు | Mid-range employees with Forgery signatures | Sakshi
Sakshi News home page

కాసులు కురిపిస్తున్న ఉద్యోగాలు

Published Tue, Mar 7 2017 10:37 PM | Last Updated on Wed, Oct 3 2018 6:52 PM

కాసులు కురిపిస్తున్న ఉద్యోగాలు - Sakshi

కాసులు కురిపిస్తున్న ఉద్యోగాలు

ఉపాధి కల్పనలో ఆ శాఖ తీరే సెప‘రేటు’

- ఫోర్జరీ సంతకాలతో చక్రం తిప్పుతున్న మధ్యస్థాయి ఉద్యోగులు
- బ్యాంకు ఉద్యోగాలపేరుతో నిరుద్యోగులకు బురిడీ
- మిగులు ఉద్యోగులకు అడ్డగోలు నియామకాలు


తప్పు చేస్తే శిక్ష ఉంటుంది...ఇది సహజ న్యాయసూత్రం...కానీ తప్పు చేస్తే రక్షణ ఉంటుంది...ఇది జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో విచిత్రం... ఫోర్జరీ సంతకాలతో లేని ఉద్యోగాలు కట్టబెట్టినా...ఏకంగా బ్యాంకు ఉద్యోగాలు ఇస్తానంటూ నకిలీ నియామక ఉత్తర్వులు ఇచ్చినా... బేఖాతర్‌...  కార్మిక శాఖలో కీలక నేత అండదండలు ఉంటే చాలు...ఆయన్ను ‘తగినవిధంగా ’ ప్రసన్నం చేసుకుంటే చాలు... జిల్లాలో సరిగ్గా అదే జరుగుతోంది. కుంభకోణాలకు పాల్పడ్డ అధికారులపై ఎలాంటి చర్య లేకపోవడమే ఇందుకు నిదర్శనం.!
– సాక్షి, అమరావతి బ్యూరో

సాక్షి, అమరావతి బ్యూరో : జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఓ మధ్యస్థాయి అధికారి బ్యాంకు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను నిండా ముంచారు. ఉత్తుత్తి ఇంటర్వూలు చేసి ఒక్కొక్కరి నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. నకిలీ నియామక ఉత్తర్వులు ఇచ్చి పంపించారు. నిజమేనని నమ్మి బ్యాంకుకు వెళ్లిన నిరుద్యోగులకు అసలు విషయం తెలిసింది.  నిరుద్యోగులతోపాటు బ్యాంకు అధికారులు కూడా ఫిర్యాదు చేశారు.  దాంతో పోలీసులు ఉపాధి కల్పన కార్యాలయంలోని ఆ అధికారిపై కేసు పెట్టి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అరెస్టు కూడా చేసి రిమాండ్‌ నిమిత్తం రాజమండ్రి జైలుకు పంపారు. అనంతరం ఆయన బెయిల్‌పై విడుదల అయ్యారు.

కీలక నేత అభయహస్తం...
బ్యాంకు ఉద్యోగాల పేరిట మోసం చేసిన ఆ అధికారిపై కార్మిక శాఖ చర్యలు తీసు కోలేదు. సస్పెన్షన్‌ కాదుకదా కనీసం షోకాజ్‌ నోటీసు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఆ అధికారికి కార్మిక శాఖలో ఓ కీలక నేత అభయహస్తం అందించారు. దాంతో ఆ అధికారి మళ్లీ యథావిధిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కార్యాలయంలో ఉన్నతాధికారికి సమాచారం కూడా ఇవ్వకుండా తన సీటులో కూర్చుంటున్నారు. కానీ ఆయన చేస్తున్న సంతకాలను ఆ ఉన్నతాధికారి రౌండప్‌ చేయసాగారు. ఈ విషయాన్ని కార్మిక శాఖ కమిషనర్‌ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. ఎందుకంటే కీలక నేత అండతోనే ఆ అధికారి తన సీటులో కూర్చున్నట్లు గ్రహించారు. దాంతో ఏం చేయాలో పాలుపోక ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

‘మిగులు ఉద్యోగాల’ మాయాజాలం
హైదరాబాద్‌లోని ఇరిగేషన్‌ కార్పొరేషన్‌ను రద్దు చేసి ఉద్యోగులకు అన్ని బెనిఫిట్లు చెల్లించేసి సెటిల్‌ చేసేశారు. కానీ వారిలో 41మందిని మిగులు ఉద్యోగులుగా జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో నియమించారు. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఓ మధ్యస్థాయి అధికారితోపాటు మరో ఉద్యోగ సంఘ నేత దీనికి సూత్రధారులు.  ఒక్కొక్కరి నుంచి రూ.2లక్షలు చొప్పున రూ.80లక్షలు వసూలు చేసినట్లు సమాచారం.  జిల్లా ఉన్నతాధికారి అనుమతిస్తున్నట్లు ఫోర్జరీ సంతకంతో అధికారిక పత్రం చూపించారు. అనంతరం ఆ మిగులు ఉద్యోగులకు జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పోస్టింగులు కూడా ఇచ్చేశారు. దీనిపై ఎన్‌సీసీ విభాగానికి సందేహం వచ్చి విచారించడంతో మొత్తం డొంకంతా కదిలింది. కార్మిక శాఖ కమిషనర్‌ ఆదేశాలతో విచారణ చేపట్టి రికార్డులు సీజ్‌ చేశారు.

ఉద్యోగాల కుంభకోణానికి బాధ్యులని భావిస్తున్న ఇద్దరికి నోటీసులు కూడా జారీ చేశారు. కానీ దాదాపు ఆరునెలలు గడుస్తున్నా ఇంతవరకు ఆ ఇద్దరు ఉద్యోగులపై చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే ... ఉద్యోగాల కుంభకోణంలో పాత్రధారులైన ఇద్దరు అధికారులు జిల్లా ఉన్నతాధికారిని కలిసినట్లు తెలిసింది. ఆయన సంతకమే ఫోర్జరీ చేసి ఉద్యోగాలు ఇచ్చేసినట్లు ప్రధాన ఆరోపణ. తన సంతకం ఫోర్జరీపై ఆయనే తీవ్రంగా స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకునేలా చూడాలి. కానీ  ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అధికారులకు ఆయన అండగా నిలవడం గమనార్హం. ఆయన కూడా  కార్మిక శాఖలోని కీలక నేతను సంప్రదించి ‘అసలు విషయం’ మాట్లాడుకున్నారు. అంతే మిగులు ఉద్యోగుల కుంభకోణం విచారణ ఫైలు అటకెక్కింది. కుంభకోణానికి పాత్రధారులైన వారిలో ఓ అధికారి  బదిలీపై రాయలసీమ వెళ్లిపోగా,  మరో ఉద్యోగ సంఘాల నేత విజయవాడలోనే దర్జాగా విధులు నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement