
ఎస్‌బీఐలో ఖాతాలు తెరిచేందుకు ఏర్పాట్లు చేయండి
వలస కార్మికుల విషయంలో ఉభయ రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలస కార్మికుల వేతనాలను బ్యాంకు ఖాతాల ద్వారానే చెల్లించాలని, ఇందుకు వారి పేర్ల మీద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లో ఖాతాలు తెరిచేందుకు ఏర్పాట్లు చేయాలని తెలుగు రాష్ట్రాల కార్మిక శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. శాశ్వత చిరునామా లేకపోయినా ఖాతాలు తెరిచేందుకు సహకరించాలని సూచిం చింది. ఇందుకు బ్రాంచ్ మేనేజర్లకు ప్రత్యేక సర్క్యులర్లు జారీ చేయాలని ఎస్‌బీఐ ఉన్నతాధికారులకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాత చేపడతామంది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటుక బట్టీలో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన ఇద్దరు కార్మికుల చేతులను నరికివేసిన ఘటనపై పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుప్రీంకోర్టు 2014లో సుమోటోగా విచారణ చేపట్టింది. ఇటుక బట్టీల్లో పనిచేసే వలస కార్మికుల దుస్థితిపై అటు ఒడిశా, ఇటు తెలంగాణ ప్రభుత్వాల నుంచి నివేదికలు తెప్పించుకుంది. వాటిని పరిశీలించిన సుప్రీం కోర్టు.. తమ ముందున్న వ్యాజ్యాన్ని అటు ఒడిశా హైకోర్టు, ఇటు ఏపీ, తెలంగాణాల ఉమ్మడి హైకోర్టులకు బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
ఈ నేపథ్యంలో దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎస్‌బీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఏడాది కాలానికి కార్మికుల పేరు మీద ఖాతాలు తెరిచేందుకు నిబంధనలు అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో అన్ని బ్రాంచ్ మేనేజర్లకు తగిన సర్క్యులర్లు జారీ చేసినట్లు వివరించారు.