మాల్యా అరెస్టు కోసం కోర్టుకు ఎస్బీఐ
బెంగళూరు:కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాల ఎగవేత వివాదంలో దాని ప్రమోటరు, వ్యాపారవేత్త విజయ్ మాల్యా అరెస్టుకు ఆదేశించాలంటూ ఎస్‌బీఐ శుక్రవారం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. కుటుంబంతో పాటు బ్రిటన్‌కు వెడుతున్నట్లు మాల్యా ఇటీవలే చేసిన ప్రకటన ప్రాతిపదికగా, ఆయన పాస్‌పోర్టును కూడా స్వాధీనం చేసుకోవాలని పిటీషన్లో పేర్కొన్నట్లు ఎస్‌బీఐ తరఫు న్యాయవాది వివరించారు. దీంతో మాల్యా, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌తో (కేఎఫ్‌ఏ) పాటు మరో 9 మంది ప్రతివాదులకు నోటీసుల జారీకి హైకోర్టు ఆదేశించింది. ఎస్‌బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియంకు కేఎఫ్‌ఏ రూ.7,800 కోట్లు చెల్లించాల్సి ఉంది.
రిలయన్సే పెద్ద డిఫాల్టరు ..
మరోవైపు, మాల్యా అరెస్టు కోరుతూ ఎస్‌బీఐ వేసిన నాలుగు పిటీషన్లలో ఒకదానిపై విచారణ చేపట్టిన డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్‌టీ).. ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచింది. రిలయన్స్ వంటి భారీ ఎగవేతదారులతో పోలిస్తే మాల్యా చిన్న డిఫాల్టరేనని డీఆర్‌టీ ముందు ఆయన తరఫు న్యాయవాది ఉదయ్ హోలా వాదించారు. మాల్యా రాజ్యసభ సభ్యుడు అయినందువల్ల ఆయన్ను అరెస్టు చేస్తే పెద్దల సభ ప్రతిష్టను దెబ్బతీసినట్లే అవుతుందని పేర్కొన్నారు.