కార్మికశాఖ విజిలెన్స్‌లో అవినీతి తిష్ట..!
- మూడుస్లారు తప్పించినా అదే స్థానంలో ‘పర్యవేక్షకుడు’
- ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ‘విచారణ’ ఫైళ్లు
సాక్షి,సిటీబ్యూరో: కార్మికశాఖ కమిషనరేట్‌లోని విజిలెన్స్ విభాగానికి అవినీతి చెద పట్టింది. కార్మికశాఖ నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై వచ్చే ఫిర్యాదులపై విచారణ జరిపించి చర్యలకు సిఫార్సు చేయాల్సిన విజిలెన్స్ విభాగం అవినీతిమయంగా మారింది. దీర్ఘకాలికంగా ఇక్కడ తిష్ట వేసిన ‘పర్యవేక్షకుడు’ పై అవినీతి ఆరోపణలు రావడంతో అతడిని ఈ విభాగం నుంచి ముచ్చటగా మూడుసార్లు తప్పించినప్పటికీ మళ్లీ అదే స్థానానికి రావడం విస్మయం కలిగిస్తోంది. సాక్షాత్తు సీఎం పేషీ నుంచి వచ్చిన ఆదేశాల అమలు సైతం మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. కార్మిక శాఖ కమిషనర్‌గా డాక్టర్ అశోక్ ఉన్నప్పుడు విజిలెన్స్ విభాగం పర్యవేక్షకుడిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో అతడిని అక్కడి నుంచి తప్పించారు. కమిషనర్ డాక్టర్ అశోక్ బదిలీ కావడంతో తిరిగి పాతస్థానం చేజిక్కించుకోవడంలో సదరు పర్యవేక్షకుడు సఫలీకృతమయ్యాడు. మళ్లీ అవినీతి ఆరోపణలు రావడంతో కొత్త కమిషనర్ అతడ్ని అక్కడి నుంచి తప్పించారు. తాజాగా రాజకీయ పైరవీలతో మళ్లీ ఆయన అదే స్థానంలో చేరడం కార్మిక శాఖలో చర్చనీయంశంగా మారింది.
తొక్కి పెట్టుడు...
కార్మికశాఖ విజిలెన్స్ విభాగానికి విచారణ కోసం ఫైల్‌ను తొక్కి పెట్టడం ఆనవాయితీగా మారింది. ఉదాహరణకు రెండేళ్ల క్రితం ‘ పోస్టింగ్ ఉత్తర్వులు లేకుండా ఒక అధికారి హైదరాబాద్-2 డీసీఎల్‌గా విధుల్లో చేరి 13 నెలల జీతాన్ని అక్రమంగా తీసుకున్నారు’ అనేఅభియోగాలపై విజిలెన్స్ విభాగానికి (లెటర్ నంబర్ ఏ/5002/2013, తేదీ 7-11-2013) అధికారికంగా ఒక ఫైల్ చేరింది. కానీ ఇప్పటి వరకు ఆ ఫైల్ విచారణకు నోచుకోకుండా పెండింగ్‌లోనే ఉంది.
సదరు అధికారి పదవీ విరమణ కూడా జరిగిపోయింది. అలాగే, రంగారెడ్డి జిల్లా డీసీఎల్ ఒకరు ఆఫీస్ రికార్డును ట్యాంపరింగ్ చేసి అక్రమాలకు పాల్పడిన అభియోగంపై విజిలెన్స్ విభాగానికి (లెటర్ నంబర్ ఏ/ఓపీ1/2012.తేదీ 25-08-2012) మరో ఫైల్ చేరింది. ఏళ్లు గడుస్తున్నా ఆ ఫైల్ కూడా విచారణకు నోచుకోలేదు. అసలు ఫైల్ ఉందా? అదృశ్యమైందా..? తెలియని పరిస్థితి నెలకొంది. సదరు డీసీఎల్ సైతం ఇప్పటికే పదవీ విరమణ చేశారు.
ఏసీబీ విచారణ జరిపించండి: రిటైర్డ్ డీసీఎల్
కార్మిక శాఖ విజిలెన్స్ విభాగం అవినీతిపై ఏసీబీ విచారణ జరిపించాలని అదే శాఖకు చెందిన రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ ఎస్. రాజేందర్ కమిషనర్ అహ్మద్ నదీమ్‌కు లేఖ రాశారు. కమిషనర్ కార్యాలయంలోని విజిలెన్స్ విభాగంలో జరుగుతున్న అవినీతిపై ఆ లేఖలో వివరించారు.