లడ్డూ చుట్టూ అవినీతి చీమలు
- దళారులకు ఇంటి దొంగల సహకారం
- పెరిగిన ఔట్‌సోర్సింగ్ సిబ్బంది చేతివాటం
- చర్యలు శూన్యంతో చేతులు మారుతున్న రూ.లక్షలు
సాక్షి, తిరుమల: భక్తి శ్రద్ధలతో భక్తులు స్వీకరించే తిరుమల శ్రీవారి లడ్డూ చుట్టూ అవినీతి చీమలు చుట్టుకున్నాయి. ఇంటి దొంగలు, దళారులు కలసిపోవడంతో లడ్డూ అక్రమ దందా అడ్డూ అదుపూ లేకుండా సాగుతోంది. ప్రసాదాలు విభాగాన్ని పర్యవేక్షించాల్సిన ఉద్యోగే ఏకంగా కార్పొరేట్ కంపెనీతో బేరసారాలు సాగించి గురువారం విజిలెన్స్ విభాగానికి పట్టుబడిన సంఘటనే ఇందుకు నిదర్శనం.
భక్తుల రద్దీతో సంబంధం లేకుండా కొందరు ఉద్యోగులు, సిబ్బంది లడ్డూలను అక్రమంగా తరలించి సొమ్ము చేసుచేసుకోవటంలో ఆరితేరిపోయారు. పై అధికారులను కాకా పట్టుకుని మారు పేర్లతో ఇబ్బడిముబ్బడిగా లడ్డూలు దక్కించుకుంటారు. రూ.25 చిన్న లడ్డూను కనీసం రూ.50కి, రూ.100 కల్యాణోత్సవం లడ్డూ డిమాండ్‌ను ఆధారంగా రూ.200 పైబడి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రద్దీ పెరిగిందంటే వీరికి పంట పండినట్టే. ఆలయ కేంద్రంగా పనిచేసే కొందరు ఉద్యోగులు, ఇతర విభాగాల సిబ్బంది ఈ దందాలో ముందు వరుసలో ఉన్నట్టు ప్రచారంలో ఉంది.
అక్రమ దందాలో ఔట్‌సోర్స్ సిబ్బంది హవా
లడ్డూ దందాలో కొందరు ఔట్‌సోర్స్ సిబ్బంది చేతివాటం పెరిగిపోయింది. బ్యాంకుల నేతృత్వంలో కొందరు నిజాయితిగా జీతాన్ని నమ్ముకుని పనిచేస్తుంటే మరికొందరు మాత్రం అక్రమంగా కాసులు సంపాదించాలనే ఇక్కడ కొలువులో చేరుతున్నారు. అది కూడా రూ.వేల నుంచి రూ.లక్షల్లో అడ్వాన్సులు చెల్లించి విధుల్లోకి చేరుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఇక్కడ పనిచేసే సుమారు వంద మందిలో 20 శాతం మంది వరకు లడ్డూ అక్రమ తరలింపు పాత కేసుల్లో నిందితులుగా ఉన్నారు. అయినా అలాంటివారు దొరల్లా కౌంటర్‌లో లడ్డూ దందా సాగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. లడ్డూతో ముడిపడిన కొన్ని విభాగాలు సిబ్బందికి కాసులు ముట్ట చెప్పి తమ కార్యకలాపాలను యథేచ్ఛగా సాగిస్తుంటం గమనార్హం.
కాసులు కురిపిస్తున్న సబ్సిడీ లడ్డూ టోకెన్లు
ఒక లడ్డూ తయారు చేయడానికి టీటీడీకి ప్రస్తుతం రూ.24 దాకా ఖర్చు అవుతోంది. ధర్మప్రచారం, సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని సర్వదర్శనం భక్తులకు సబ్సిడీ ధరతో రూ.20కే రెండు లడ్డూలు అందజేస్తున్నారు. అయితే, టీటీడీ నిర్ణయం దళారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. సర్వదర్శనం కోసం రోజూ సుమారు 45 వేల టోకెన్లు అంటే 90 వేల లడ్డూలు ఇస్తున్నారు. అయితే, అక్కడి కొందరి సిబ్బంది చేతి వాటంతో నల్లబజారుల్లోకి తరలిస్తున్నారు. మొన్న లడ్డూ టికె ట్ల ముద్రణలో అక్రమాలు చోటు చేసుకుని కొంత తగ్గినట్టు కనిపించినా మళ్లీ ఆ వ్యాపారం పుంజుకుంది.