సాక్షి, అమరావతి: టీడీపీ పాలనలో జరుగుతున్న అవినీతిపై న్యాయపరంగా పోరాటం చేయాలని బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో నిర్ణయించారు. అవినీతి కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు ప్రజాచైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా కన్నా లక్ష్మీనారాయణ బాధ్యత చేపట్టాక ఆదివారం తొలిసారి రాష్ట్ర పార్టీ పదాధికారులు, జిల్లా పార్టీ అధ్యక్షుల సమావేశం విజయవాడలో జరిగింది. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన, జరుగుతున్న అవినీతిపై ప్రధానంగా చర్చించారు.
రాష్ట్రంలో పట్టణ ప్రాంత పేదలకు కేంద్ర ప్రభుత్వం 7.87 లక్షల ఇళ్లను మంజూరు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఈ పథకంలో భారీగా అవినీతి మొదలు పెట్టారని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు, బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి ప్రస్తావించారు. తెలంగాణలో కేంద్రం నిధులతో చదరపు అడుగుకు రూ. 1,000తో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇస్తుంటే.. ఏపీలో మాత్రం చదరపు అడుగుకు రూ. 2400 దాకా ఖర్చవుతుందంటూ లెక్కలు చెబుతున్నారని.. కేంద్రమిచ్చే సాయానికి తోడు పేదల నుంచి రూ. 6–7 లక్షల దాకా వసూలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడంపై సమావేశంలో చర్చించారు.
షేర్‌వాల్ టెక్నాలజీ పేరుతో ఇళ్లనిర్మాణ పనులు కేవలం రెండు మూడు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించి నిరుపేదల నుంచి ప్రభుత్వ పెద్దలు వందల కోట్లు దోచుకునే పరిస్థితి ఉందని అభిప్రాయపడ్డారు. దీనిపై సాక్ష్యాధారాలతో కేంద్ర విజిలెన్స్ సంస్థలను ఆశ్రయించడంతో పాటు న్యాయపరంగా పోరాటం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రంలో మరుగుదొడ్ల నిర్మాణాల్లో జరుగుతున్న అవినీతిపై మండలాల వారీగా, జిల్లాల వారీగా ఆధారాలతో విజిలెన్స్‌కు ఫిర్యాదు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర నిధులతో చేపడుతున్న నీరు–చెట్టు పనులు, రాజధాని నిర్మాణంలో చోటుచేసుకుంటున్న అవినీతి అంశాలపై న్యాయ, చట్టపరమైన పోరాటాలకు అవకాశాలను పరిశీలించాలని.. అవసరమైన సాక్ష్యాధారాలు సేకరించాలని సమావేశంలో తీర్మానించారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల వారీగా ప్రభుత్వ అవినీతిపై పోరాటం సాగించనున్నారు.
అమిత్‌షా రాష్ట్ర పర్యటన...
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా జూలై ప్రథమార్థంలో రాష్ట్ర పర్యటనకు రానున్నారు. కనీసం రెండు రోజులు ఆయన రాష్ట్ర పర్యటన సాగే అవకాశం ఉంటుందని అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీ నేతలకు వివరించారు. వచ్చే సాధారణ ఎన్నికల విషయంలో పార్టీ నేతలకు అమిత్‌షా దిశానిర్దేశం చేసే అవకాశం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీకి పార్టీని సన్నద్ధం చేసేందుకు జిల్లా అధ్యక్షులు ప్రణాళికలు సిద్ధం చేయాలని కన్నా సూచించారు.
12 నుంచి 21 వరకు విశేష సంపర్క్ అభియాన్
కేంద్ర ప్రభుత్వ కార్యక్రమలను మేధావులకు, విద్యావంతులకు తెలియజేప్పేందుకు ఈ నెల 12 నుంచి 21వ తేదీ వరకు విశేష సంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహించనున్నట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి సురేశ్‌రెడ్డి తెలిపారు. పదాధికారుల భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పార్టీ ముఖ్యనేతలు ఒక్కొక్కరు కనీసం 25 మంది ప్రముఖలను కలిసి కేంద్ర పథకాలను వివరిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి ముఖ్యనేతలు జిల్లాల వారీగా పర్యటిస్తారని తెలిపారు.
బీజేపీకి వ్యతిరేకంగా మహా న్యూస్ చానల్ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ, ఆ చానల్‌ను పార్టీ బహిష్కరించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. యువతను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తున్న విధానాలను తెలిపేందుకు జూన్ 23న యువమోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు జరపాలని నిర్ణయించామన్నారు. జూన్ 21, 22, 23వ తేదీల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పర్యటిస్తారని సురేష్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment