
ఏసీబీకి పెద్ద చేపలు కనిపించవా?
కేంద్రమంత్రి దత్తాత్రేయ ప్రశ్న
♦ కార్మికులకు సత్వర న్యాయం అందించేందుకు కొత్త చట్టం
♦ ఈపీఎఫ్‌కు ఫేస్‌బుక్, ట్వీటర్ ఖాతాలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ)కి కేవలం వీఆర్వో వంటి చిన్నస్థాయి ఉద్యోగులు తప్ప పెద్ద, పెద్ద అవి నీతి చేపలు కనపడవని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. అవినీతిని అంతమొందిస్తేనే సుపరిపాలనకు సార్థకత లభిస్తుందన్నారు. సుపరిపాలన దినోత్సవం సందర్భంగా శుక్రవారమిక్కడ ‘సామాజిక భద్రత- సుపరిపాలన’ అనే అంశంపై జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో మంత్రి మాట్లాడారు. నీరు పల్లం ఎరుగునట్లు.. అవినీతి కూడా పైస్థాయి నుంచి కిందకు పాకుతుందన్నారు. కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర పరిధిలోని 44 చట్టాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి నాలుగు విభాగాల ద్వారా సేవలందిస్తామన్నారు.
దేశంలోని 40 కోట్ల మంది అసంఘటితరంగ కార్మికులకు ‘యూ విన్’ స్మార్ట్ కార్డులు అందజేసి సామాజిక భద్రత కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈఎస్‌ఐ కార్డు కలిగిన కార్మికులందరికీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో చికిత్స అందజేస్తామన్నారు. సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ మెడికల్ కాలేజిలో 40 శాతం సీట్లను కార్మికుల పిల్లలకే కేటాయించామన్నారు. ప్రభుత్వం స్థలం కేటాయిస్తే ఈఎస్‌ఐ తరఫున ఆరు బెడ్ల ఆస్పత్రులను నిర్మిస్తామన్నారు. కార్మికశాఖలో టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం వల్ల రూ.1,700 కోట్లు ఆదా చేసినట్లు వివరించారు.
సామాజిక మాధ్యమంలోకి ఈపీఎఫ్
కార్మికులకు మరింత చేరువయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా సామాజిక మాధ్యమంలోకి ప్రవేశించింది. పీఎఫ్‌కు సార్వత్రిక గుర్తింపు సంఖ్య(యూఏఎన్)తోపాటు ఆన్‌లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. సుపరిపాలన దినోత్సవం సందర్భంగా కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఈఫీఎఫ్‌కు ఫేస్‌బుక్, ట్వీటర్ ఖాతాలను ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం, ఈపీఎఫ్ కమిషనర్ కె.కె.జాలన్, ఈపీఎఫ్ అదనపు కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ త్రిపురాన వెంకటరత్నం, ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, బీఎంఎస్ అధ్యక్షుడు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.