న్యూఢిల్లీ: ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వార్షిక వడ్డీరేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) యథాతథంగా 8.5 శాతంగా కొనసాగనుంది. రిటైర్‌మెంట్ ఫండ్ వ్యవహారాలను నిర్వహించే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ ఆర్గనైజేషన్స్ (ఈపీఎఫ్‌ఓ) అత్యున్నత నిర్ణాయక విభాగం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) ఈ కీలక నిర్ణయం తీసుకుందని కార్మిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2019–20లో కూడా ఈపీఎఫ్‌ఓ 8.5 శాతం వడ్డీని తన చందాదారులకు అందించింది. ప్రకటన ప్రకారం జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో గురువారం కార్మిక, ఉపాధి శాఖల సహాయంత్రి (ఇండిపెండెంట్ చార్జ్) సంతోష్ కుమార్ నేతృత్వంలో సీబీటీ సమావేశం జరిగింది. వడ్డీరేటుపై తన నిర్ణయాన్ని సీబీటీ ఆర్థిక శాఖ ఆమోదం కోసం నివేదిస్తుంది. ఆర్థిక శాఖ ఆమోదం అనంతరం ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ జారీ అవుతుంది. అనంతరం తన క్రియాశీల చందాదారుల అకౌంట్లలో 8.5 శాతం వడ్డీని ఈపీఎఫ్‌ఓ జమ చేస్తుంది.
ఐదు కోట్లకుపైగా చందాదారులు
ప్రకటన ప్రకారం, ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ ఐదు కోట్లకుపైగా చందాదారులను కలిగిఉంది. డెట్ ఇన్వెస్ట్‌మెంట్ నుంచి పొందిన వడ్డీ అలాగే ఈక్విటీ పెట్టుబడుల నుంచి వచ్చిన ఆదాయ అంశాలను పరిగణనలోకి తీసుకుని సీబీటీ తాజా నిర్ణయం తీసుకుంది. 2015–16లో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులను ఈపీఎఫ్‌ఓ ప్రారంభించింది. ఈక్విటీ అసెట్స్‌లో తన మొత్తం నిధుల్లో 5%తో ప్రారంభమైన ఈపీఎఫ్‌ఓ పెట్టుబడులు ప్రస్తుతం 15%కి చేరాయి. 2018–19లో ఈపీఎఫ్‌ఓ చందాదారులకు లభించిన వడ్డీ 8.65%. దీన్ని 8.5%కి తగ్గిస్తూ, గతేడాది మార్చిలో నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావం, భారీ ఉపసంహరణల నేపథ్యంలో వడ్డీరేటు మరింత తగ్గుతుందన్న అంచనాలకు భిన్నం గా ట్రస్టీల బోర్డ్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ యథాతథం
Published Fri, Mar 5 2021 5:41 AM | Last Updated on Fri, Mar 5 2021 5:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment