Annual interest rate
-
తయారీ రంగంపై పెరిగిన రుణ వ్యయ భారం
న్యూఢిల్లీ: తయారీదారులు చెల్లించే వార్షిక సగటు వడ్డీ రేటు జనవరి–మార్చి త్రైమాసికంలో 9.38 శాతానికి పెరిగింది. అక్టోబర్–డిసెంబర్ మధ్య ఈ రేటు 8.37 శాతంగా ఉంది. సగటు కాకుండా చూస్తే, ఈ రేటు కొన్ని సంస్థల విషయంలో అత్యధికంగా 15 శాతంగా నమోదయ్యింది. చాలా కంపెనీలు తమ రుణాల వ్యయం పెరిగినట్లు తెలిపాయని తాజాగా విడుదలైన పారిశ్రామిక వేదిక– ఫిక్కీ సర్వే తెలిపింది. అయితే భారత ఎకానమీ పరిస్థితుల పట్ల సర్వేలో ఆశావహ దృక్పధం నెలకొంది. సర్వే ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ♦ కరోనా సవాళ్ల అనంతరం, 2021–22 ఆర్థిక సంవత్సరంలో భారత ఎకానమీ రికవరీ బాట పట్టింది. 2022–23 ఆర్థిక సంవత్సరపు తదుపరి త్రైమాసికాల్లో వృద్ధి ఊపందుకోవడం కొనసాగింది. ♦ ప్రపంచ మందగమన పరిస్థితులు ఉన్నప్పటికీ, ఈ ప్రభావం భారత తయారీ రంగంపై తాత్కాలికంగానే ఉంటుంది. గడచిన కొన్ని నెలలుగా ఈ రంగంలో నెలకొన్న వ్యయ భారాలు తగ్గుముఖం పడతాయన్న విశ్వాసం నెలకొంది. ♦ నియామకాలకు సంబంధించి అవుట్‌లుక్ సానుకూలంగా ఉన్నప్పటికీ, రాబోయే మూడు నెలల్లో అదనపు వర్క్‌ఫోర్స్‌ను నియమించుకోవాలని కేవలం 32 శాతం మంది ప్రతినిధులు మాత్రమే పేర్కొంటున్నారు. ♦ గత కొన్ని నెలల్లో రెపో రేట్లను పెంచడం వల్ల పర్యవసానంగా తమ బ్యాంకులు ఈ భారాన్ని తమకు బదలాయించాయని, ఇది రుణ వ్యయాల పెరుగుదలకు ప్రధాన కారణమని 71 శాతం మంది ప్రతినిధులు తెలిపారు. ♦ తయారీలో ప్రస్తుతం ఉన్న సగటు సామర్థ్య వినియోగం 75%. ఇది ఈ రంగంలో స్థిరమైన ఆర్థిక కార్యకలాపాలను ప్రతిబింబిస్తుంది. క్రితం సర్వే లో ఈ సామర్థ్య వినియోగం 70%గా ఉంది. ♦ భవిష్యత్ పెట్టుబడి ఆశావహ దృక్పథం కూడా మునుపటి త్రైమాసికంతో పోలిస్తే మెరుగుపడింది. రాబోయే ఆరు నెలల్లో పెట్టుబడులు, విస్తరణ ప్రణాళికల్లో ఉన్నట్లు 47 శాతం మంది ప్రతివాదులు తెలిపారు. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో ఇది 40 శాతంగా ఉంది. ♦ అయితే రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఏర్పడిన ప్రపంచ ఆర్థిక అనిశి్చతి, ద్రవ్యోల్బణం సవాళ్లు ఇతర దేశాలలో కోవిడ్ వైరస్ వేరియంట్ల పెరుగుదల, ఆందోళనల వంటి సవాళ్లు తయారీ రంగాన్ని వెంటాడుతున్నాయి. సరఫరాల చైన్, డిమాండ్‌లో అస్థిరతలను పెంచుతున్నట్లు సర్వేలో పాల్గొన్న ప్రతినిధులు పేర్కొన్నారు. ♦ పెరుగుతున్న ఫైనాన్స్ రుణ భారాలు, నిబంధనలు–అనుమతుల్లో గందరగోళ పరిస్థితులు, అధిక ఇంధన ధరలు, మందగమన ప్రపంచ డిమాండ్, భారతదేశంలోకి అధిక చౌక దిగుమతులు, నైపుణ్యం కలిగిన కార్మీకుల కొరత, కొన్ని లోహాల అధిక అస్థిర ధరలు, సరఫరాల చైన్‌లో అనిశ్చితి, లాజిస్టిక్స్ వ్యయాల పెరుగుదల వంటి అంశాలూ సవాళ్లలో ఉన్నాయి. ఇవి తమ విస్తరణ ప్రణాళికకు అవరోధంగా మారే అవకాశం ఉందని తయారీ రంగ సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు. సర్వే సాగింది ఇలా... 11 ప్రధాన రంగాలకు సంబంధించి క్యూ4లో తయారీదారుల అభిప్రాయాలను సర్వే మదింపు చేసింది. మొత్తంగా రూ. 10 లక్షల కోట్లకు పైగా వార్షిక టర్నోవర్‌ను కలిగిన భారీ, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎస్ఎంఈ)ల విభాగాలలోని 400 తయారీ యూనిట్ల నుండి స్పందనలను పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. ఆటోమోటివ్, ఆటో కంపోనెంట్స్, భారీ పెట్టుబడులు–డిమాండ్‌కు సంబంధించిన క్యాపిటల్ గూడ్స్, సిమెంట్, రసాయనాలు, ఔషధాలు, ఎల్రక్టానిక్స్, మిషీన్ టూల్స్, మెటల్ అండ్ మెటల్ ప్రొడక్ట్స్, పేపర్ ప్రొడక్ట్స్, ఎరువులు, జౌళి, దుస్తులు తదితర రంగాలు వీటిలో ఉన్నాయి. -
ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ యథాతథం
న్యూఢిల్లీ: ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వార్షిక వడ్డీరేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) యథాతథంగా 8.5 శాతంగా కొనసాగనుంది. రిటైర్మెంట్ ఫండ్ వ్యవహారాలను నిర్వహించే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ ఆర్గనైజేషన్స్ (ఈపీఎఫ్ఓ) అత్యున్నత నిర్ణాయక విభాగం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) ఈ కీలక నిర్ణయం తీసుకుందని కార్మిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2019–20లో కూడా ఈపీఎఫ్ఓ 8.5 శాతం వడ్డీని తన చందాదారులకు అందించింది. ప్రకటన ప్రకారం జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో గురువారం కార్మిక, ఉపాధి శాఖల సహాయంత్రి (ఇండిపెండెంట్ చార్జ్) సంతోష్ కుమార్ నేతృత్వంలో సీబీటీ సమావేశం జరిగింది. వడ్డీరేటుపై తన నిర్ణయాన్ని సీబీటీ ఆర్థిక శాఖ ఆమోదం కోసం నివేదిస్తుంది. ఆర్థిక శాఖ ఆమోదం అనంతరం ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ జారీ అవుతుంది. అనంతరం తన క్రియాశీల చందాదారుల అకౌంట్లలో 8.5 శాతం వడ్డీని ఈపీఎఫ్ఓ జమ చేస్తుంది. ఐదు కోట్లకుపైగా చందాదారులు ప్రకటన ప్రకారం, ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ఐదు కోట్లకుపైగా చందాదారులను కలిగిఉంది. డెట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి పొందిన వడ్డీ అలాగే ఈక్విటీ పెట్టుబడుల నుంచి వచ్చిన ఆదాయ అంశాలను పరిగణనలోకి తీసుకుని సీబీటీ తాజా నిర్ణయం తీసుకుంది. 2015–16లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఈపీఎఫ్ఓ ప్రారంభించింది. ఈక్విటీ అసెట్స్‌లో తన మొత్తం నిధుల్లో 5%తో ప్రారంభమైన ఈపీఎఫ్ఓ పెట్టుబడులు ప్రస్తుతం 15%కి చేరాయి. 2018–19లో ఈపీఎఫ్ఓ చందాదారులకు లభించిన వడ్డీ 8.65%. దీన్ని 8.5%కి తగ్గిస్తూ, గతేడాది మార్చిలో నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావం, భారీ ఉపసంహరణల నేపథ్యంలో వడ్డీరేటు మరింత తగ్గుతుందన్న అంచనాలకు భిన్నం గా ట్రస్టీల బోర్డ్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
5 నుంచి గోల్డ్ బాండ్ల స్కీమ్
* 20 వరకూ ఆఫర్ * 26న బాండ్ల జారీ * వడ్డీ 2.75 శాతం న్యూఢిల్లీ: పసిడి బాండ్ పథకాన్ని నవంబర్ 5వ తేదీన ప్రభుత్వం ప్రారంభిస్తోంది. పెట్టుబడి తొలి విలువ ప్రాతిపదికన బాండ్లపై 2.75 శాతం వార్షిక వడ్డీరేటును ప్రకటించింది. ఈ మేరకు ఆర్థికమంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యాంశాలు ... * నవంబర్ 5 నుంచి 20వ తేదీ వరకూ ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు * బ్యాంకులు, నోటిఫై చేసిన నిర్దిష్ట పోస్టాఫీసుల ద్వారా గోల్డ్ బాండ్ల అమ్మకం జరుగుతుంది. బాండ్లను కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. * కొనుగోళ్లకు సంబంధించిన బాండ్లు 26న జారీ అవుతాయి. * బాండ్ల జారీ ఇది మొదటి విడత. తదుపరి దశల్లో మళ్లీ బాండ్ల జారీ జరుగుతుంది. * కనిష్టం 2 గ్రాముల విలువ నుంచి గరిష్టంగా 500 గ్రా. వరకూ బాండ్లను కొనొచ్చు. * ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి 500 గ్రా. పసిడి బాండ్లను మాత్రమే కొనుగోలు చేసే వీ లుంది. జాయింట్ హోల్డర్ల విషయంలో తొలి వ్యక్తికి ఈ పరిమితి వర్తిస్తుంది. * బాండ్ల కాలపరిమితి 8 ఏళ్లు. ఐదేళ్ల నుంచీ ‘ఎగ్జిట్’ ఆఫర్ ఉంటుంది. * బాండ్ల విలువ భారత రూపాయిల్లో ఉంటుంది. బాండ్ల జారీకి ముందు వారం (సోమవారం నుంచి శుక్రవారం వరకూ) భారత బులియన్ అండ్ జువెల్లర్స్ అసోసియేషన్ ప్రకటించిన 99.9 ప్యూరిటీ పసిడి ధర సగటు విలువను ధరగా నిర్ణయిస్తారు. రిడంప్షన్(తిరిగి బాండ్లను నగదుగా మార్చుకోవడం) విషయంలోనూ ధర లెక్కింపు ఇదే ప్రాతిపదికన జరుగుతుంది. * ఐదేళ్లకు ముందే బాండ్లను నగదుగా మార్చుకోవాలనుకునేవారి సౌలభ్యం కోసం కమోడిటీ ఎక్స్ఛేంజీలలో ఈ బాండ్ల ట్రేడింగ్ జరుగుతుంది. * భారతీయులుసహా భారతీయ సంస్థలు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, ట్రస్టీలు, యూనివర్సిటీలు, దాతృత్వ సంస్థలు మాత్రమే బాండ్లు కొనుగోలు చేయడానికి ఆర్హత కలిగి ఉంటాయి. * రుణాలకు హామీగా బాండ్లను వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం పసిడిపై ఇస్తున్న రుణానికి సంబంధించి ఆర్బీఐ నిబంధనలే దీనికీ వర్తిస్తాయి. * గోల్డ్ బాండ్ల వడ్డీపై పన్ను, కేపిటల్ గెయిన్ ట్యాక్స్ అమలవుతుంది. బాండ్ల పంపిణీపై కమిషన్ ‘సబ్స్క్రిప్షన్ విలువ’పై 1%గా ఉంటుంది.