5 నుంచి గోల్డ్ బాండ్ల స్కీమ్
* 20 వరకూ ఆఫర్
* 26న బాండ్ల జారీ
* వడ్డీ 2.75 శాతం
న్యూఢిల్లీ: పసిడి బాండ్ పథకాన్ని నవంబర్ 5వ తేదీన ప్రభుత్వం ప్రారంభిస్తోంది.
పెట్టుబడి తొలి విలువ ప్రాతిపదికన బాండ్లపై 2.75 శాతం వార్షిక వడ్డీరేటును ప్రకటించింది.
ఈ మేరకు ఆర్థికమంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యాంశాలు ...
* నవంబర్ 5 నుంచి 20వ తేదీ వరకూ ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు
* బ్యాంకులు, నోటిఫై చేసిన నిర్దిష్ట పోస్టాఫీసుల ద్వారా గోల్డ్ బాండ్ల అమ్మకం జరుగుతుంది. బాండ్లను కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది.
* కొనుగోళ్లకు సంబంధించిన బాండ్లు 26న జారీ అవుతాయి.
* బాండ్ల జారీ ఇది మొదటి విడత. తదుపరి దశల్లో మళ్లీ బాండ్ల జారీ జరుగుతుంది.
* కనిష్టం 2 గ్రాముల విలువ నుంచి గరిష్టంగా 500 గ్రా. వరకూ బాండ్లను కొనొచ్చు.
* ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి 500 గ్రా. పసిడి బాండ్లను మాత్రమే కొనుగోలు చేసే వీ లుంది. జాయింట్ హోల్డర్ల విషయంలో తొలి వ్యక్తికి ఈ పరిమితి వర్తిస్తుంది.
* బాండ్ల కాలపరిమితి 8 ఏళ్లు. ఐదేళ్ల నుంచీ ‘ఎగ్జిట్’ ఆఫర్ ఉంటుంది.
* బాండ్ల విలువ భారత రూపాయిల్లో ఉంటుంది. బాండ్ల జారీకి ముందు వారం (సోమవారం నుంచి శుక్రవారం వరకూ) భారత బులియన్ అండ్ జువెల్లర్స్ అసోసియేషన్ ప్రకటించిన 99.9 ప్యూరిటీ పసిడి ధర సగటు విలువను ధరగా నిర్ణయిస్తారు. రిడంప్షన్(తిరిగి బాండ్లను నగదుగా మార్చుకోవడం) విషయంలోనూ ధర లెక్కింపు ఇదే ప్రాతిపదికన జరుగుతుంది.
* ఐదేళ్లకు ముందే బాండ్లను నగదుగా మార్చుకోవాలనుకునేవారి సౌలభ్యం కోసం కమోడిటీ ఎక్స్ఛేంజీలలో ఈ బాండ్ల ట్రేడింగ్ జరుగుతుంది.
* భారతీయులుసహా భారతీయ సంస్థలు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, ట్రస్టీలు, యూనివర్సిటీలు, దాతృత్వ సంస్థలు మాత్రమే బాండ్లు కొనుగోలు చేయడానికి ఆర్హత కలిగి ఉంటాయి.
* రుణాలకు హామీగా బాండ్లను వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం పసిడిపై ఇస్తున్న రుణానికి సంబంధించి ఆర్‌బీఐ నిబంధనలే దీనికీ వర్తిస్తాయి.
* గోల్డ్ బాండ్ల వడ్డీపై పన్ను, కేపిటల్ గెయిన్ ట్యాక్స్ అమలవుతుంది. బాండ్ల పంపిణీపై కమిషన్ ‘సబ్‌స్క్రిప్షన్ విలువ’పై 1%గా ఉంటుంది.