ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికలకు రంగం సిద్ధం
సోమవారం నోటిఫికేషన్ జారీ చేయనున్న కార్మిక శాఖ
ఫిబ్రవరి చివర్లో ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం కార్మిక శాఖకు లిఖితపూర్వకంగా తెలిపిన నేపథ్యంలో ఆ శాఖ అధికారులు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం తొలి నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నారు. కార్మిక సంఘాలనుంచి కొన్ని వివరాలను కార్మిక శాఖ ఆ నోటిఫికేషన్‌లో కోరనుంది. అనంతరం రెండో నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఇందులో ఓటర్ల జాబితాను ప్రకటించి అభ్యంతరాలను స్వీకరిస్తారు. అభ్యంతరాల ప్రకారం చర్యలు తీసుకుంటారు. అలాగే ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాలతో సంయుక్తంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎన్నికల తేదీని ఖరారు చేస్తారు. ఆ తేదీని ప్రకటిస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేస్తారు. తొలి నోటిఫికేషన్ జారీ చేసిన 45 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో ఎన్నికల ప్రక్రియ ముగిసే అవకాశం ఉంది.
ఏపీలో కదలికతో...
పాలనాపరంగా ఆర్టీసీ విభజన జరిగినా సాంకేతికంగా ఇంకా ఉమ్మడిగానే కొనసాగుతోంది. ఆస్తులు, అప్పుల పంపకం తర్వాతనే ఆర్టీసీ విభజన పూర్తిగా జరిగినట్టు పరిగణిస్తారు. ఆస్తులు, అప్పుల పంపకం, తుది విభజన కేంద్రప్రభుత్వం చేతిలో ఉంది. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీలకు విడివిడిగా ఎన్నికలు నిర్వహించటం ఎలా అన్న విషయంలో కార్మిక శాఖ తర్జనభర్జన పడుతూ వస్తోంది. అయితే... పాలనాపరంగా విభజన పూర్తయి ఎవరి కార్యకలాపాలు వారికే ఉన్నందున ఎన్నికలు నిర్వహించాలంటూ రెండు రాష్ట్రాల కార్మిక సంఘాలు కార్మిక శాఖల దృష్టికి తెచ్చాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ తాజాగా ఏపీఎస్ ఆర్టీసీలో ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో తెలంగాణ కార్మిక శాఖ కూడా ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది.