సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు సూచనలు చేస్తూ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కార్మిక శాఖ చర్యలకు ఉపక్రమించింది. కార్మికుల డిమాండ్లు పరిశీలించి 2 వారాల్లో పరిష్కరించాలని, లేకుంటే కార్మిక న్యాయస్థానానికి నివేదిక ఇవ్వాలని కార్మిక శాఖ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కార్మికుల డిమాండ్లు, సమస్యల పరిష్కారం కార్మిక శాఖ పరిధిలో పరిష్కారమవుతాయా? లేక కార్మిక న్యాయస్థానానికి బాధ్యతలు అప్పగించాలా అనేదానిపై ఆ శాఖ తర్జనభర్జన పడుతోంది. కార్మిక శాఖ పరిధిలో సమస్య పరిష్కారమవ్వని పక్షంలో కార్మిక న్యాయస్థానానికి బాధ్యతలు ఇవ్వాల్సి వస్తే.. అందుకుగల కార ణాలను స్పష్టం చేయాలి. దీంతో కార్మిక శాఖ కమిషనరేట్ యంత్రాంగం కార్మిక చట్టాలు, నిబంధనలు తదితరాలను పరిశీలిస్తోంది.
తీర్పు ప్రతి రాగానే..
ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కార్మిక శాఖ కమిషనరేట్ పరిధిలో సాధ్యమయ్యే అవకాశాలు లేవని ఆ శాఖ భావిస్తోంది. కార్మికుల డిమాండ్లన్నీ ఆర్టీసీ యాజమాన్యం పరిధిలోనివి. ఇందులో కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివి. దీంతో వీటి పరిష్కారానికి కార్మిక శాఖ కంటే కార్మిక న్యాయస్థానమే సరైందని అధికారులు భావిస్తున్నారు. దీంతో సమస్య పరిష్కారం కోసం కార్మిక న్యాయస్థానాన్ని కోరేందుకు కార్మిక శాఖ కార్యాచరణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు తీర్పు ఇచ్చి 3 రోజులవుతున్నా.. కోర్టు నుంచి అధికారికంగా తీర్పు ప్రతి రాలేదు. క్రమపద్ధతిలో తీర్పు ప్రతి అందిన వెంటనే తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.
ఆర్టీసీ కార్మికులు సమ్మెకు ముందు నోటీసులు ఇచ్చిన క్రమంలో ఆర్టీసీ యాజమాన్యం, కార్మికుల మధ్య కార్మిక శాఖ సంప్రదింపులు మొదలుపెట్టింది. వాస్తవానికి ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నిర్ణీత గడువు ముగిసినప్పుడే కార్మికులు సమ్మె చేపట్టాలి. కానీ సంప్రదింపుల సమయంలోనే కార్మికులు సమ్మెకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో కార్మికులు చేపట్టిన సమ్మె చట్ట విరుద్ధమా లేదా అనేది కార్మిక న్యాయస్థానం తేల్చాలి. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం 2 వారాల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన క్రమంలో గడువులోగా కార్మిక న్యాయస్థానానికి పూర్తి వివరాలు, ఆధారాలతో నివేదికను సమర్పించేందుకు కార్మిక శాఖ చర్యలు వేగిరం చేసింది. హైకోర్టు తీర్పు ప్రతి అందిన గంటల వ్యవధిలోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కూడా కార్మిక శాఖ భావిస్తోంది.
6 నెలల్లో పరిష్కారం కష్టమే..
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కార అంశం కార్మిక న్యాయస్థానానికి అప్పగించేందుకు సిద్ధమవుతున్న కార్మిక శాఖ.. కార్మిక చట్టాల్లోని క్లాజ్‌ల ప్రకారం 6 నెలల వ్యవధి లో పరిష్కరించేలా సూచన చేయనుంది. వాస్తవానికి చట్టంలో పొందుపర్చిన విధంగా 6 నెలల్లో సమస్యను పరిష్కరించాల్సి ఉన్న ప్పటికీ.. ఆధారాల సమర్పణ, విచారణ అంశం అంత సులువైన ప్రక్రియ కాదని నిపుణులు చెబుతున్నారు. కార్మికుల వాదనలన్నీ కార్మిక న్యాయస్థానం ప్రత్యక్షంగా వినాల్సి ఉంటుంది. ప్రస్తుతం సమ్మెలో 48 వేలకుపైగా కార్మికులు పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్క కార్మికుడి వాదన వినాల్సి ఉండటంతో ఈ వ్యవధి చాలదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీంతో కేసు విచారణకు మరింత సమయం పట్టే అవకాశం లేకపోలేదు.
Comments
Please login to add a commentAdd a comment