
‘స్థానికత‘కు చుక్కెదురు
♦ ఏపీ నుంచి 21 మంది ఉద్యోగుల కేటాయింపు
♦ ఉద్యోగులను చేర్చుకోని కార్మిక శాఖ కమిషనర్
♦ బోర్డుల విభజనతో ముడిపెడుతూ ప్రభుత్వానికి లేఖ
♦ కమిషన్‌కు నోటీసులు ఇచ్చిన ఉద్యోగ సంఘాలు
♦ చేర్చుకోకుంటే 12న సమ్మెకు సై..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖలో ‘స్థానికత’కు చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి స్థానికత ఆధారంగా రాష్ట్రానికి కేటాయించి, రిలీవ్ అయిన ఉద్యోగులను చేర్చుకునేందుకు కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్ నిరాకరించారు. కార్మిక బోర్డు విభజనతో స్థానికతను ముడిపెడుతూ ఉద్యోగులను చేర్చుకునే అంశంపై స్పష్టత కోసం ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో ఏపీ నుంచి రిలీవ్ అయిన ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో టీఎన్‌జీవో కార్మిక శాఖ విభాగం.. కమిషనర్‌కు నోటీసులు అందజేసింది. ఈ నెల 11 వరకు ఉద్యోగులను చేర్చుకోకుంటే 12న సమ్మెకు దిగుతామని ఆ విభాగం అధ్యక్షుడు ఎన్. చంద్రశేఖర్ గౌడ్ అల్టిమేటం ఇచ్చారు.
21 మంది కేటాయింపు
కమలనాథన్ కమిటీ నిర్ణయం మేరకు ఏపీ కార్మిక శాఖలో పనిచేస్తున్న 21 మంది ఉద్యోగులను స్థానికత ఆధారంగా తెలంగాణకు కేటాయించారు. వారిని అక్కడి నుంచి రిలీవ్ చేసి తెలంగాణ రాష్ట్ర కమిషనరేట్‌లోరిపోర్టు చేయాల్సిందిగా గత నెల 30న ఏపీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అదేరోజు రిపోర్టు చేసేందుకు వచ్చిన ఉద్యోగులను చేర్చుకునేందుకు తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ కమిషనరేట్ వర్గాలు అంగీకరించలేదు. కమిషనర్ వర్గాలు గత వారం రోజులుగా తెల్లకాగితంపై పేర్లు రాసి సంతకాలు పెట్టించుకుంటూ ఉండటంతో ఉద్యోగుల పరిస్థితి అయోమయంగా మారింది.
బోర్డులతో స్థానికత ముడి
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం స్థానికత ఆధారంగా ఉద్యోగుల కేటాయింపులు... రాష్ట్ర భవన నిర్మాణ, కార్మిక సంక్షేమ బోర్డు, కార్మిక సంక్షేమ నిధి బోర్డులతో కలిపి విభజన చేయాలని తెలంగాణ కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్ ముందస్తుగానే కమలనాథన్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే కమలనాథన్ పరిధిలోకి కార్మిక బోర్డులు, మండలిలు రాని కారణంగా స్థానికత ఆధారంగా ఉద్యోగుల జాబితాలో అభ్యంతరాలు లేని వారిని తెలంగాణకు కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బోర్డు సమస్యలుంటే ఇరు రాష్ట్రాల కమిషనర్లు సంబంధిత ప్రభుత్వ కార్యదర్శులతో చర్చించి తేల్చుకోవాలని సూచించింది.
స్పష్టత కోసం..
బోర్డుల విభజన జరగక ముందే స్థానికత ఆధారంగా వచ్చిన ఉద్యోగులను చేర్చుకునే అంశంపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ ఈ నెల 4న లేఖ రాశారు. మరోపక్క స్థానికత ఆధారంగా వచ్చిన ఉద్యోగులను చేర్చుకోకపోవడం విభజన చట్టం ఉల్లంఘనే అవుతుందని, వెంటనే చేర్చుకోకుంటే సమ్మెకు దిగుతామని ఉద్యోగ సంఘాలు నోటీసులు అందజేశాయి.