
సాక్షి, అమరావతి: పోలీసులు రైతులకు చెందిన ఖాళీ ఇసుక ట్రాక్టర్లు పట్టుకుంటే వదిలేయండని చెప్పిన మాట వాస్తవమని, తాను చెప్పిన దాంట్లో ఎక్కడైనా దౌర్జన్యంగా, తప్పుగా మాట్లాడింది లేదని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. రాష్ట్రం అభివృద్ధిలోను, సంక్షేమంలోను దూసుకెళుతుండటంతో ఎల్లో మీడియాకు వార్తలు కరువై తనలాంటి వారిపై బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డా రు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన లోకేశ్‌కు తన గురించి మాట్లాడే యోగ్యతే లేదన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. లోకేశ్ అడ్డదారుల్లో రాజకీయాల్లోకి వచ్చి పదవులు వెలగబెట్టిన నేత అని దుయ్యబట్టారు. మాటకొస్తే టీడీపీ నేతలు దందాలు దందాలు అంటారని, దందాగిరీ చేసేందుకు తానేమీ అంతర్‌రాష్ట్ర స్మగ్లర్ వీరప్పన్‌ని కాదని చెప్పారు. నిజంగా పోలీసులతో దౌర్జన్యంగా మాట్లాడితే అది తప్పవుతుందన్నారు. రైతులపై అభిమానంతో వారి ఖాళీ ట్రాక్టర్లు వదలండి అని మాత్రమే చెప్పానన్నారు.
ఖాకీ యూనిఫాం నిఖార్సుగా పనిచేస్తున్నది సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలోనేనని పేర్కొన్నారు. రామరాజ్యం స్థాపన కోసం ప్రయత్నించే సీఎం జగన్ ఇలాంటివి ప్రోత్సహించరని చెప్పారు. తనపై బురదజల్లే కార్యక్రమం పెట్టుకోవద్దని టీడీపీ నేతలను కోరుతున్నానన్నారు. బుధవారం సీఎం జగన్‌ను కలుసుకున్నానని, నియోజకవర్గ సమస్యలపైన మాత్రమే మాట్లాడానని చెప్పారు. సీఎంతో సమావేశంలో ఇతర అంశాలు ప్రస్తావనకు రాలేదన్నారు. ఆవగింజ అంత సిగ్గు కూడా లోకేశ్‌కు లేదని విమర్శించారు. తన నియోజకవర్గం కర్ణాటక సరిహద్దున ఉంటుందని చెప్పారు.
అర కిలోమీటరు దూరంలోనే పక్క రాష్ట్రంలో మద్యం దొరుకుతుంటే కొందరు వెళ్లి తాగి వస్తుంటారని, ఇది తన దురదృష్టమని పేర్కొన్నారు. ట్విట్టర్ ద్వారా అవాకులు చెవాకులు మాట్లాడుతున్న లోకేశ్.. బహిరంగంగా వస్తే తాను మాట్లాడతానని చెప్పారు. అక్కడ తాగి ఇక్కడికి వచ్చేవారిని చూసి మద్యం ఏరులై పారుతోందంటే తానేం చేయగలనన్నారు. తనపై ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా సీఎంగా జగన్ ఉన్నంతవరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని పేర్కొన్నారు. రాజ్యాంగం చెప్పినదానికి మించి రాష్ట్రంలో సామాజిక న్యాయం జరుగుతోందని చెప్పారు. దీంతో రాష్ట్రంలో ఇక టీడీపీకి భవిష్యత్తు ఉండదని తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేశ్‌లకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ’జామాత దశమ గ్రహం’ అని ఎన్టీఆర్ ఆనాడే సర్టిఫికెట్ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment