
డ్రైవరన్నా.. బీమా చేయించుకో
♦ ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షల బీమా
♦ సహజ మరణానికి రూ.30వేల పరిహారం
♦ ట్రాన్స్‌పోర్టు, బ్యాడ్జీ నంబర్ ఉన్న డ్రైవర్లకు వర్తింపు
♦ 30తో దరఖాస్తు గడువు ముగింపు
కార్మిక శక్తి పోరాట ఫలితంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బీమా భద్రత పథకం డ్రైవర్లకు ప్రయోజనకరంగా మారింది. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు డ్రైవర్ మరణిస్తే ఆయన కుటుంబం రోడ్డున పడకుండా భరోసా దక్కుతోంది. సహజంగా మరణిస్తే చేయూత అందుతోంది. ఇదంతా డ్రైవర్ల సామాజిక భద్రతా పథకం-2015 కింద అమలవుతోంది. ఈ పథకం దరఖాస్తుకు గడువు సమీపిస్తోంది.
- కర్నూలు(రాజ్‌విహార్)
నిత్యం ప్రమాదపుటంచుల్లో జీవించే ట్రాన్స్‌పోర్టు డ్రైవర్ల కోసం ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌పోర్టు డ్రైవర్ల సామాజిక భద్రతా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ ఏడాది మే 1 నుంచే ఆచరణలోకి తీసుకొచ్చి లెసైన్స్ పొందిన (బ్యాడ్జ్ నంబరు ఉన్న) ట్రాన్స్‌పోర్టు డ్రైవర్ల ఈ పథకం వర్తింపజేశారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు డ్రైవర్ మరణిస్తే రూ.5లక్షల బీమా సొమ్మును కుటుంబ సభ్యులకు ఇస్తున్నారు. సహజంగా మరణిస్తే రూ.30 వేలు ఇస్తా రు.
శాశ్వత అంగ వైకల్యం కలిగితే రూ.75వేలు, శాశ్వత రీతిలో సగం అంగ వైకల్యతకు రూ.37,500 అందిస్తారు. మృతుడి పిల్లలకు 9వ తరగతితోపాటు 10, ఇంటర్, ఐటీఐ చదువుతున్న ఇద్దరు పిల్లలకు సంవత్సరానికి రూ. 1,200 స్కాలర్‌షిప్ మంజూరు చేస్తారు. నందికొట్కూరు పట్టణంలోని శేషశయనా రెడ్డి నగర్‌కు చెందిన డ్రైవర్ పి. శాలిమియ్య ఈ ఏడాది మే15న ప్రమాదవశాత్తు మరణించాడు. డ్రైవర్ల భద్రతా పథకం ఆ కుటుంబానికి కార్మిక శాఖ రూ.5లక్షలు ఇచ్చి ఆదుకుంది. కోవెలకుంట్ల మండ లం వెలగటూరు గ్రామానికి చెందిన డ్రైవర్ పి. బాలరాజు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5లక్షలు అందించారు. వీరితోపాటు వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో మృత్యువాత పడిన 21 మంది డ్రైవర్ కుటుంబీకులకు పరిహారం అందించేందుకు ప్రతిపాదనలు పంపించారు.
రిజిస్ట్రేషన్ ఇలా
కార్మిక శాఖ వెబ్‌సైట్ ఠీఠీఠీ.్చఛౌఠట.్చఞ.జౌఠి.జీ లో రిజిస్ట్రేషన్ ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. ఒక పాస్‌పోర్టు సైజు ఫొటో, ట్రాన్స్‌పోర్టు లెసైన్సు వివరాలు, ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబరు ఇవ్వాలి. కంప్యూటర్ ద్వారా ఆన్‌లైన్‌లో లేదా ఏదైనా ఇంటర్నెట్ సెంటర్, మీసేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే ఐడీ కార్డు జనరేట్ కావడంతో పథకం అమలులోకి వస్తారు. జిల్లాలో మొత్తం 32,224 మంది డ్రైవర్లు ఉండగా 20,207 మంది డ్రైవర్లు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.
30 లోపు దరఖాస్తు చేసుకోండి
డ్రైవర్ల సామాజిక భద్రత పథకం కింద ఇద్దరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అప్పగించారు. మరో 21 మందికి పరిహారం కోసం ప్రతిపాదనలు పంపాం. బ్యాడ్జీ నంబరు కలిగిన ట్రాన్స్‌పోర్టు డ్రైవర్లు దీని ద్వారా లబ్ధి పొందేందుకు ఈనెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలి. - అబ్దుల్ సయీద్, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్