సాక్షి, హైదరాబాద్: పటిష్టమైన చట్టాలను రూపొందించి వాటిని పారదర్శకంగా అమలు చేయడం ద్వారానే ప్రభుత్వం పౌరులకు మెరుగైన సేవలందించగలుగుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కాలానుగుణంగా పాత చట్టాల్లో మార్పులు చేసుకున్నప్పుడే గుణాత్మక పాలన అందించగలమన్నారు. శనివారం ప్రగతి భవన్‌లో నూతన మున్సిపల్ చట్టం రూపకల్పన, నూతన సచివాలయ నిర్మాణం తదితర అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. పౌర సేవలను మెరుగుపరిచేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టే దిశగా రూపొందించనున్న నూతన మున్సిపల్ చట్టంలో చేర్చబోయే అంశాలపై సీఎం చర్చించారు. ఈ దిశగా మరిన్ని అంశాల్లో మార్పుచేర్పుల గురించి కూలంకషంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని పాత భవనాలను తొలగించి కొత్త భవనాలు నిర్మించేందుకు ఎంత సమయం పడుతుందని అధికారులను అడిగారు. నూతన సచివాలయాన్ని అన్ని హంగుల తో ఆదర్శవంతమైన సెక్రటేరియట్‌గా నిర్మించడంపై పలు సూచనలు చేశారు. సమావేశంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ ఎస్.కె. జోషి, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సిం గ్‌రావు, కార్యదర్శి స్మితా సబర్వాల్, భూపాల్‌రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, అధర్ సిన్షా, సునీల్ శర్మ, గణపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీమాలో రైతులు నమోదయ్యేలా చూడాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి
పత్తి పంట బీమా గడువు జూలై 15 న, మిగతా పంటల గడువు జూలై 31 న ముగుస్తున్నందున రైతులు పంట బీమాలో నమోదు చేసుకునేలా చూడాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్య దర్శి సి. పార్థసారథి అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో పార్థసారథి అధ్యక్షతన ఉద్యానవన శాఖలపై జిల్లా, మండల, గ్రామ స్ధాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ రుతుపవనాల ఆలస్యంతో పంటలసాగు కూడా జాప్యమైనందున వ్యవసాయ విస్తరణాధికారులు రైతులకు అందుబాటులో ఉండి వారికి తగు సూచనలు చేయాలని ఆదేశించారు. రైతుబంధు పథకం కింద 60% మంది రైతులకు వారి ఖాతాలకు డబ్బును జమచేశామని, మిగతా వారికి త్వరలోనే జమచేయనున్నట్లు తెలిపారు. బ్యాంకు ఖాతాలను ప్రభుత్వ పోర్టల్ లో నమోదు చేయించుకోని రైతులు తమ గ్రామ వ్యవసాయ విస్తీర్ణాధికారులను సంప్రదించి నమోదు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతు బీమా పథకం కింద 30.65 లక్షల మంది రైతులు నమోదు చేసుకున్నారని, వివిధ కారణాలతో 12,820 మంది మరణించగా వారి కుటుంబీకులకు బీమా వర్తింపజేసి రూ.641 కోట్లు అందజేశామన్నారు. పీఎం కిసాన్ పథకం కింద ఏడాదికి మూడు విడతల్లో రూ.6000 రైతు ఖాతాకు జమ అవుతుందని తెలిపారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా విత్తన, ఎరువుల సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని, సరిపడా ఎరువులను పీఏసీఎస్ కేంద్రాలలో నిల్వ చేయాలని, పీఓస్ మిషన్ల ద్వారా అమ్మకాలు జరపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్‌బొజ్జా, ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment