Assembly Buildings
-
అసెంబ్లీ భవనాల్ని ఖాళీ చేయాలని ఆర్ అండ్ బీ చెప్పిందా?
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ భవనాలు వినియోగానికి యోగ్యంగా లేవని ఆర్అండ్బీ శాఖ ఇచ్చిన నివేదిక గురించి స్వయంగా వివరించేందుకు ఆ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి శుక్రవారం జరిగే విచారణకు హాజరుకావాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఆర్‌ఆండ్‌బీ నివేదిక ఇచ్చి ఉంటే.. అసెంబ్లీ భవనాలు ఎంతకాలం వినియోగానికి యోగ్యంగా ఉన్నాయి, భవనం ఖాళీ చేయాలని నివేదికలో ఉందా, కొత్త అసెంబ్లీ నిర్మాణానికి ఎంత స్థలం కావాలి, నిర్మాణ ప్రణాళిక వంటివి వివరించేందుకు ఆయన స్వయంగా హాజరుకావాలంది. ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చి రాష్ట్ర చట్టసభల భవన సముదాయాన్ని నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం ఎదుట గురువారం వాదనలు జరిగాయి. ఏ నిబంధనల మేరకు ఇప్పుడున్న అసెంబ్లీ భవనాలను వినియోగించరాదని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేబినెట్ ఎజెండాలోని అంశాలు తెలియజేయాలని పేర్కొంది. ఇప్పుడున్న అసెంబ్లీ భవనాలు నిజాం కాలంలో నిర్మించినవని, టౌన్‌హాల్ నిమిత్తం నిర్మించిన వాటిలో అసెంబ్లీ కొనసాగుతోందని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదించారు. ఆర్అండ్బీ అధ్యయనంలో అసెంబ్లీ భవనాలు సురక్షితంగా లేవని తేలిందన్నారు. ‘పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు చేపట్టలేదా’అని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు ఏజీ సమాధానం ఇస్తూ ‘ఇప్పటికే పలుమార్లు మరమ్మతులు చేయడం జరిగింది, అదే మాదిరిగా కొనసాగించడం క్షేమదాయకం కాదు’అని అన్నారు. ఎర్రమంజిల్ పురాతన భవనాల జాబితాలో లేదని, అక్కడ శాసనసభ భవనాల సముదాయాన్ని నిర్మించాలనేది ప్రభుత్వ విధాన నిర్ణయం కాబట్టి న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని గట్టిగా చెప్పారు. విధానపరమైన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం తగదంటూ సుప్రీంకోర్టుతో పాటు, రాజస్తాన్ హైకోర్టు తీర్పులను ఆయన ఉదహరించగా, ఇలాంటి తీర్పును ఉదహరించి మంచిపని చేస్తున్నారని అదనపు ఏజీని ధర్మాసనం అభినందించింది. అసెంబ్లీ నిర్మాణానికి ప్లానింగ్ లేకుండా హెచ్ఎండీఏ నుంచి అనుమతి తీసుకోలేమని అదనపు ఏజీ చెప్పగానే.. ఎవరైనా ఇల్లు నిర్మించుకోవాలంటే ఇంజనీర్ దగ్గరకు వెళ్లి ఫలానా సౌకర్యాలు ఉండేలా ప్లాన్ వేయించుకుంటారని, ఇక్కడేమో ప్లానే లేదని ప్రభుత్వం చెబుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిపై అదనపు ఏజీ కల్పించుకుని.. ప్లాన్ రూపొందించాలని హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి ప్రాంతాలకు చెందిన కన్సల్టెన్సీలకు బాధ్యతలు ఇచ్చామని, దీనిపై ప్రభుత్వానికి కూడా సమాచారం లేదన్నారు. ఎన్ని ఎకరాల భూమి అవసరమని నిర్ణయించారనే ప్రశ్నకు.. 17 ఎకరాల్లో నిర్మించాలని యోచిస్తున్నామని, ఇప్పుడున్న చట్టసభ సభ్యుల సంఖ్య మరో పాతికేళ్లకు రెట్టింపు కావచ్చునని, అప్పటి అవసరాలకు అను గుణంగా, పార్కింగ్, అధికారిక సమావేశాలకు వీలుగా కొత్త చట్టసభల సముదాయాన్ని నిర్మించాలన్నది ప్రభుత్వ విధానమని అదనపు ఏజీ బదులిచ్చారు. కన్సల్టెన్సీల నుంచి ప్లాన్లు వచ్చాక వాటి లో ప్రభుత్వం ఆమోదించే దాని ఆధారంగా హెచ్ఎండీఏ నుంచి అనుమతి తీసుకుంటామని చెప్పా రు. విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. -
అసెంబ్లీ భవనాలు సరిపోవా?
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న శాసనసభ భవనాలు సరిపోతున్నాయో లేదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ శాసనసభ్యుల సంఖ్య 119 మాత్రమే కాబట్టి (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 294 మంది ఉండేవారు) ఇప్పుడున్న భవనం ఎందుకు సరిపోవడం లేదో వివరించాలని సూచించింది. ఇప్పటి అసెంబ్లీ భవనం సరిపోతున్నప్పుడు కొత్త భవన నిర్మాణం అవసరం ఎందుకో కూడా తెలియజేయాలని పేర్కొంది. ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చి రాష్ట్ర చట్టసభల భవన సముదాయాన్ని నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై బుధవారం కూడా హైకోర్టులో వాదనలు కొనసాగాయి. కొత్తగా అసెంబ్లీ భవనాలు నిర్మించాలనే నిర్ణయానికి అనుగుణంగా ప్లాన్ రూపకల్పన చేశారో లేదో, డిజైన్ రూపొందించిందీ లేనిదీ కూడా గురువారం జరిగే విచారణ సమయంలో తెలియజేయాలని స్పష్టంచేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చేందుకు హెచ్ఎండీఏ అనుమతి తీసుకున్నారో లేదో కూడా చెప్పాలని కోరింది. హుడా చట్టం ప్రకారం ఎర్రమంజిల్ భవనాన్ని వారసత్వ భవనాల జాబితా నుంచి తొలగించినా హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లో ఆ నిబంధన కొనసాగుతున్నందున కూల్చివేత విషయమై అనుమతి పొందిందీ లేనిదీ వివరించాలని ఆదేశించింది. అమల్లో ఉండేది కొత్త చట్టమే: ఏఏజీ పాత చట్టం ప్రకారం ఎర్రమంజిల్ భవనాన్ని వారసత్వ భవనాల జాబితా నుంచి తొలగించినందున ఇప్పుడు కొత్త చట్టమే అమల్లో ఉంటుందని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) జె.రామచంద్రరావు వివరించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వస్తుందనేది ఆశాజనక విషయమని, ఆ ఆలయం జాబితాలో చేరిన తర్వాతే రక్షణ లభిస్తుందని పేర్కొంది. ఇక్కడ కూడా హుడా చట్టం కింద వారసత్వ భవనం కాదని చెబుతున్న ప్రభుత్వం.. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం దాని రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే అవుతుందని వ్యాఖ్యానించింది. అయితే, ఒక చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో మరో చట్టాన్ని రూపొందించినప్పుడు కొత్త చట్టమే అమల్లో ఉంటుందని, ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని అదనపు ఏజీ రామచంద్రరావు బదులిచ్చారు. 1960, 2017 చట్టాలు, 13వ నిబంధనలోని విషయాలన్నీ ఒకే అంశానికి చెందినవని, దీనిపై మీమాంస లేదని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రస్తుత అసెంబ్లీ భవనం సరిపోతోందో లేదో, హెచ్ఎండీఏ చట్టం ప్రకారం కొత్త అసెంబ్లీ భవన నిర్మాణానికి అనుమతి తీసుకున్నారో లేదో గురువారం చెప్పాలని ఆదేశించింది. -
పటిష్ట చట్టాలతోనే మెరుగైన సేవలు
సాక్షి, హైదరాబాద్: పటిష్టమైన చట్టాలను రూపొందించి వాటిని పారదర్శకంగా అమలు చేయడం ద్వారానే ప్రభుత్వం పౌరులకు మెరుగైన సేవలందించగలుగుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కాలానుగుణంగా పాత చట్టాల్లో మార్పులు చేసుకున్నప్పుడే గుణాత్మక పాలన అందించగలమన్నారు. శనివారం ప్రగతి భవన్లో నూతన మున్సిపల్ చట్టం రూపకల్పన, నూతన సచివాలయ నిర్మాణం తదితర అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. పౌర సేవలను మెరుగుపరిచేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టే దిశగా రూపొందించనున్న నూతన మున్సిపల్ చట్టంలో చేర్చబోయే అంశాలపై సీఎం చర్చించారు. ఈ దిశగా మరిన్ని అంశాల్లో మార్పుచేర్పుల గురించి కూలంకషంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని పాత భవనాలను తొలగించి కొత్త భవనాలు నిర్మించేందుకు ఎంత సమయం పడుతుందని అధికారులను అడిగారు. నూతన సచివాలయాన్ని అన్ని హంగుల తో ఆదర్శవంతమైన సెక్రటేరియట్‌గా నిర్మించడంపై పలు సూచనలు చేశారు. సమావేశంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ ఎస్.కె. జోషి, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సిం గ్రావు, కార్యదర్శి స్మితా సబర్వాల్, భూపాల్‌రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, అధర్ సిన్షా, సునీల్ శర్మ, గణపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీమాలో రైతులు నమోదయ్యేలా చూడాలి వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి పత్తి పంట బీమా గడువు జూలై 15 న, మిగతా పంటల గడువు జూలై 31 న ముగుస్తున్నందున రైతులు పంట బీమాలో నమోదు చేసుకునేలా చూడాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్య దర్శి సి. పార్థసారథి అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో పార్థసారథి అధ్యక్షతన ఉద్యానవన శాఖలపై జిల్లా, మండల, గ్రామ స్ధాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ రుతుపవనాల ఆలస్యంతో పంటలసాగు కూడా జాప్యమైనందున వ్యవసాయ విస్తరణాధికారులు రైతులకు అందుబాటులో ఉండి వారికి తగు సూచనలు చేయాలని ఆదేశించారు. రైతుబంధు పథకం కింద 60% మంది రైతులకు వారి ఖాతాలకు డబ్బును జమచేశామని, మిగతా వారికి త్వరలోనే జమచేయనున్నట్లు తెలిపారు. బ్యాంకు ఖాతాలను ప్రభుత్వ పోర్టల్ లో నమోదు చేయించుకోని రైతులు తమ గ్రామ వ్యవసాయ విస్తీర్ణాధికారులను సంప్రదించి నమోదు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతు బీమా పథకం కింద 30.65 లక్షల మంది రైతులు నమోదు చేసుకున్నారని, వివిధ కారణాలతో 12,820 మంది మరణించగా వారి కుటుంబీకులకు బీమా వర్తింపజేసి రూ.641 కోట్లు అందజేశామన్నారు. పీఎం కిసాన్ పథకం కింద ఏడాదికి మూడు విడతల్లో రూ.6000 రైతు ఖాతాకు జమ అవుతుందని తెలిపారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా విత్తన, ఎరువుల సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని, సరిపడా ఎరువులను పీఏసీఎస్ కేంద్రాలలో నిల్వ చేయాలని, పీఓస్ మిషన్ల ద్వారా అమ్మకాలు జరపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్‌బొజ్జా, ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
అప్పు తీర్చేది కేసీఆర్ కుటుంబం కాదు: భట్టి
సాక్షి, హైదరాబాద్: కొత్త సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు అవసరమనుకుంటే ఒక కమిటీ వేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్నవాళ్లు ఏదనుకుంటే అది చేయడం సరైంది కాదని, తాము అధికారంలోకి వచ్చాక మరో సెక్రటేరియట్ కడతామంటే పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. సోమవారం అసెంబ్లీ హాల్లో ఆయ న మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ, కొత్త నిర్మాణాల ద్వారా అయ్యే అప్పు తీర్చేది కేసీఆర్ కుటుంబం కాదని, ప్రజలు తీర్చాల్సి వస్తుందని చెప్పారు. కేసీఆర్ చేసిన తప్పుకు ప్రజలు శిక్ష అనుభవించాలా అని ప్రశ్నించారు. కాగజ్‌నగర్ ఘటన అక్కడి ప్రజల తిరుగుబాటుకు సంకేతమ న్నారు. ఆ భూమి విషయంలో వారిది బతుకు పోరాటమని, అయితే మహిళా అధికారిణిపై దాడి చేయడాన్ని తాము సమర్థించడం లేదన్నారు. కాగజ్‌నగర్ దాడిపై నిజనిర్ధారణ కమిటీ ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ పరిధిలో మహిళా అటవీ అధికారిపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, పొడెం వీరయ్య, జగ్గారెడ్డిలను సభ్యులుగా నియమిస్తున్నట్లు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. -
శాసనం కోసం నిర్మితమైన..
హైదరాబాద్ నగర నడిబొడ్డున గల అసెంబ్లీ భవనాలను చూడని వారుండరు. ఈ భవన సముదాయాలు నిజాం హయాంలో టౌన్ హాలుగా ఉండేవి. ఎంతో విశిష్టత ఉన్న ఈ భవనం నిర్మాణంలో ఇండో-ఇస్లామిక్ శైలి కనిపిస్తుంది. రాజస్థానీ-పర్షియన్ ఆర్కిటెక్చర్‌తో రాచఠీవిని కళ్ల ముందుంచుతుంది. ప్రజాసమస్యలపై చర్చించి, వాటిని పరిష్కరించే సమావేశ మందిరంగా ఆనాడు ఈ భవన సముదాయాన్ని నిర్మించారు. ఆరో నిజాం ప్రభువు నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ పాలన కాలంలో దీన్ని నిర్మించారు. నిజాం 40వ జన్మదిన వేడుకల సందర్భంగా 1905లో టౌన్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1911లో ఆరో నిజాం కాలం చేశారు. తర్వాత రెండేళ్లకు అంటే 1913లో దీని నిర్మాణం పూర్తయింది. అనంతరం ఈ భవనాన్ని ప్రజానీకానికి అంకితమిచ్చారు. ఈ భవన నిర్మాణంలో స్థానిక ప్రజలు కూడా తమవంతు విరాళాలు అందజేశారు. అసెంబ్లీగా..భారత స్వాతంత్య్రానంతరం, ఈ భవనాలలో శాసనసభ, శాసన మండలిని ఏర్పాటు చేశారు. కాలనుగుణంగా అసెంబ్లీ భవనాలలో అనేక మరమ్మతులు, మార్పులు, చేర్పులు చేపట్టినా, ప్రధాన భవనం చారిత్రక విశిష్టత వన్నె తగ్గలేదు. శాసనసభ జరుగుతున్న సమయంలో స్థానిక ప్రజానీకానికి ప్రవేశం పరిమితంగా ఉంటుంది. ముందుగా అనుమతి తీసుకుని శాసనసభా వ్యవహారాలు చూడొచ్చు. శాసనసభ నిర్వహణ లేని రోజుల్లో స్థానిక అధికారుల అనుమతితో శాసనసభా ప్రాంగణంలో కలియ తిరగవచ్చు. సిల్వర్ జూబ్లీ భవన్.. పబ్లిక్ గార్డెన్స్ కేంద్ర బిందువుగా జూబ్లీహాలు ఉంది. 1936 నాటికి ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అధికారం చేపట్టి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం కోసం ప్రత్యేకంగా ఈ భవన సముదాయాన్ని నిర్మించారు. సిల్వర్ జూబ్లీ కార్యక్రమాలు నిర్వహణ కోసం నిర్మించిన భవనం కాబట్టి, క్లుప్తంగా జూబ్లీహాల్- జూబ్లీ భవన్‌గా ఈ నిర్మాణం ప్రసిద్ధి చెందింది. నాటి అధికార దర్పానికి ప్రతీకగా జూబ్లీ హాలు కనిపిస్తుంది. జూబ్లీ హాలు ప్రాంగణంలోనే నేడు రాష్ట్ర శాసన మండలిని నిర్వహిస్తున్నారు. ఇండో-పర్షియన్ శైలిలో నిర్మించిన జూబ్లీహాలు. చారిత్రక నిర్మాణ విశిష్టత దృష్ట్యా జంట నగరాలలోని ప్రధాన భవనాలలో అత్యంత ప్రధానమైనదిగా చెప్పొచ్చు. మల్లాది కృష్ణానంద్ malladisukku@gmail.com -
అసెంబ్లీలోకి ఆగంతకుడు
* ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారం ధ్వంసం * సాయుధ పహరా కళ్లుగప్పి.. గేటు దూకి వెళ్లిన అశోక్‌రెడ్డి * ప్రవేశ ద్వారం తలుపులు ముక్కలు ముక్కలు చేసిన వైనం * ఆగంతకుడిని వాచ్మన్లు గుర్తించటంతో అప్రమత్తం.. అరెస్ట్ * అశోక్‌రెడ్డికి మతి స్థిమితం లేదని చెప్తున్న కుటుంబసభ్యులు * ఘటనపై దర్యాప్తు - శాసనసభ భద్రత మరింత కట్టుదిట్టం సాక్షి, హైదరాబాద్: నిరంతరం మూడంచెల సాయుధ పోలీసులు పహరా ఉండే అసెంబ్లీ భవనంలోకి ఒక అగంతకుడు ప్రవేశించి ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. ఘటన అనంతరం స్పందించిన పోలీసులు ఆ అగంతకుడిని పట్టుకుని విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా పస్రకు చెందిన అశోక్‌రెడ్డి అనే వ్యక్తి.. అత్యంత పటిష్టమైన భద్రత మధ్య ఉండే అసెంబ్లీ భవనంలోకి ఆరు అడుగులకు పైగా ఎత్తుండే ఒకటో నంబరు గేటు ఎక్కి ప్రవేశించాడు. ఈ గేటు వద్ద 24 గంటలూ సాయుధ పోలీసులు పహరాకాస్తుంటారు. అక్కడి నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసనసభ కార్యదర్శులు తమ కార్యాలయాల్లోకి ప్రవేశించే ప్రధాన ద్వారం గేటు తెరుచుకుని.. లోపలకు వెళ్లి ఎమ్మెల్యేల ప్రవేశద్వారాన్ని ధ్వంసం చేశాడు. అశోక్‌రెడ్డి దెబ్బకు కలపతో చేసిన ఆ ద్వారంలోని రెండు తలుపుల్లో ఒకటి ముక్కలు ముక్కలై నేలపై పడింది. ఆ ద్వారానికి ఉండే అద్దం కూడా ధ్వంసమైంది. ధ్వంసమైన ద్వారం గుండా సమావేశ మందిరంలోకి ప్రవేశించిన అశోక్‌రెడ్డి కొద్దిసేపు అక్కడి ఉండి ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర మంత్రుల ప్రవేశ ద్వారం వద్దకు వెళ్లి కూర్చున్నాడు. ఈ సమయంలో గమనించిన అసెంబ్లీ వాచ్మన్లు అతడిని ప్రశ్నించే సరికి పొంతన లేని సమాధానాలివ్వడంతో భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. వారు అసెంబ్లీ చీఫ్ మార్షల్ కరుణాకర్‌కు సమాచారం అందించారు. ఆయన హైదరాబాద్ నగర పోలీసులకు సమాచారం అందించారు. సెంట్రల్ జోన్ డీసీపీ వి.బి.కమలాసన్‌రెడ్డి అసెంబ్లీకి చేరుకుని ద్వారం ధ్వంసమైన ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటనకు పాల్పడిన అశోక్‌రెడ్డిని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ గౌరీనగర్‌లో నివాసం ఉంటున్న అశోక్‌రెడ్డి పూర్వాపరాలను ఆయన భార్యను విచారించి తెలుసుకున్నారు. ఆ తరువాత డీసీపీ మీడియాతో మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా అశోక్‌రెడ్డి మానసికస్థితి బాగోలేదని, బుధవారం ఉదయం ఐదు గంటల సమయంలో ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడని కుటుంబసభ్యులు చెప్పారని వివరించారు. అశోక్‌రెడ్డి ఒకటో నంబరు గేటు నుంచి అసెంబ్లీ భవన సముదాయంలోకి ప్రవేశించినట్లు సీసీ టీవీలో రికార్డైందని వివరించారు. అశోక్‌రెడ్డిపై 447, 427 పబ్లిక్ డ్యామేజ్ యాక్ట్ కింద కేసు నమోదుచేసినట్లు సైఫాబాద్ ఇన్స్పెక్టర్ పగడాల అశోక్ చెప్పారు. ఘటన అనంతరం అసెంబ్లీ ఆవరణలో భ ద్రత కట్టుదిట్టం చేశారు. ధ్వంసమైన ద్వారాన్ని పరిశీలించే ందుకు ఎవరినీ అనుమతించలేదు. అసెంబ్లీ సమావేశ మందిరానికి మరమ్మతులు టేకుతో తయారైన ద్వారాన్ని ఎలాంటి పరికర సాయం లేకుండా ధ్వంసం చేయటం సాధ్యమయ్యే పనికాదు. ఒకవేళ అశోక్‌రెడ్డి మానసిక వికలాంగుడై కాళ్లు లేదా చేతులతో తన్ని ద్వారాన్ని ధ్వంసం చేశారని అనుకున్నా ఆయన శరీరంపై ఎలాంటి గాయా లు లేవు. ఆ సమయంలో శబ్దం కూడా రాలేదు. ప్రస్తుతం సమావేశ మందిరంలో మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో అందుకు ఉపయోగించే సామాగ్రిని ఏమైనా ఉపయోగించారా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలావుంటే సంఘటన గురించి అసెంబ్లీ అధికారులు విదేశీ పర్యటనలో ఉన్న స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు వివరించినట్లు సమాచారం. ఆగస్టు 18 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాగా, ఈ ఘటనకు కారకులుగా భావిస్తూ నలుగురు ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. -
అసెంబ్లీ భవనాలపై వివాదం
కొలిక్కిరాని కేటాయింపులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలకు భవనాల కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వుల అమలులో వివాదాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఇరు రాష్ట్రాల అసెంబ్లీ కార్యదర్శులు రాజసదారం, సత్యనారాయణల మధ్య సమన్వయం కుదరకపోవడంతో అసెంబ్లీలో గదుల కేటాయింపు, వాటిలో మరమ్మతులు, సదుపాయాల కల్పన వంటివి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. పాత అసెంబ్లీ భవనాన్ని ఆంధ్రప్రదేశ్‌కు, కొత్త అసెంబ్లీ భవనాన్ని తెలంగాణకు కేటాయించారు. అయితే పాత అసెంబ్లీ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శికి ఇప్పటివరకు అప్పగించకపోవడంతో అక్కడ ఏర్పాట్లు ఆగిపోయాయి. పైగా పాతభవనంలోనే తెలంగాణ డిప్యూటీ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయాలున్నాయి. వాటిని ఖాళీచేస్తేకాని ఆంధ్రప్రదేశ్ నేతలకు, కార్యదర్శికి గదులు సమకూరే అవకాశం లేదు. దాంతోపాటు రెండు అసెంబ్లీ సమావేశ మందిరాల మధ్య రెండువైపుల మంత్రుల చాంబర్ లుగా ఉన్న రెండు అంతస్థుల భవనాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మంత్రులకు చేరొకవైపు కేటాయించాల్సి ఉంది. అయితే దీనిపై రెండు అసెంబ్లీల కార్యదర్శుల మధ్య వివాదం నెలకొంది. ఇటీవల స్పీకర్ మనోహర్ సమక్షంలో దీనిపై చర్చలు జరగ్గా ఎవరికి ఎటువైపు కేటాయించాలన్నది కొలిక్కిరాలేదు. దీంతో స్పీకర్ లాటరీ వేయాల్సి వచ్చింది. ఇలా ఒకవైపు భవనాన్ని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. దాన్ని ఆ రాష్ట్ర కార్యదర్శికి అప్పగిస్తూ తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి లిఖితపూర్వక లేఖను ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు అలాంటి ఉత్తర్వు తమకు రాకపోవడంతో ఏపీ అసెంబ్లీ కార్యదర్శి దానిపై ఉన్నతాధికారులకు మొరపెట్టుకోవాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగే పాతభవనంలో ఉన్న తెలంగాణ కార్యదర్శి కార్యాలయం గదులు తనకు అప్పగిస్తే తమకు విధుల నిర్వహణకు వెసులుబాటుగా ఉంటుందని ఏపీ అసెంబ్లీ కార్యదర్శి అధికారులకు వివరించారు. తెలంగాణ అసెంబ్లీ భవనానికి సమీపంలో పాత అసెంబ్లీ భవనంలోనే ఉన్న డిప్యూటీ స్పీకర్ కార్యాలయ గదులను ఆ రాష్ట్ర కార్యదర్శికి కేటాయిస్తామన్నా అందుకు ఆయన నుంచి స్పందన లేదని ఏపీ అసెంబ్లీ సిబ్బంది వాపోతున్నారు. భవనాలను తమకు అప్పగించకపోవడంతో వివిధ శాసనసభాపక్ష కార్యాలయాలకు, మంత్రుల చాంబర్ల ఏర్పాటుకు కూడా వీలు కలగడం లేదని చెబుతున్నారు.