
సాక్షి, హైదరాబాద్: కొత్త సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు అవసరమనుకుంటే ఒక కమిటీ వేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్నవాళ్లు ఏదనుకుంటే అది చేయడం సరైంది కాదని, తాము అధికారంలోకి వచ్చాక మరో సెక్రటేరియట్ కడతామంటే పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. సోమవారం అసెంబ్లీ హాల్‌లో ఆయ న మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ, కొత్త నిర్మాణాల ద్వారా అయ్యే అప్పు తీర్చేది కేసీఆర్ కుటుంబం కాదని, ప్రజలు తీర్చాల్సి వస్తుందని చెప్పారు. కేసీఆర్ చేసిన తప్పుకు ప్రజలు శిక్ష అనుభవించాలా అని ప్రశ్నించారు. కాగజ్‌నగర్ ఘటన అక్కడి ప్రజల తిరుగుబాటుకు సంకేతమ న్నారు. ఆ భూమి విషయంలో వారిది బతుకు పోరాటమని, అయితే మహిళా అధికారిణిపై దాడి చేయడాన్ని తాము సమర్థించడం లేదన్నారు.
కాగజ్‌నగర్ దాడిపై నిజనిర్ధారణ కమిటీ
ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ పరిధిలో మహిళా అటవీ అధికారిపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, పొడెం వీరయ్య, జగ్గారెడ్డిలను సభ్యులుగా నియమిస్తున్నట్లు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.