ముదిగొండ: ‘వంద మంది కేసీఆర్‌లు వచ్చినా, మీటింగ్ పెట్టినా మధిరలో నన్నేం చేయలేరు.. మధిర ప్రజలను కొనలేరు.. కేసీఆర్ అనే ఓ బండరాయిని రత్నం అనుకొని పదేళ్లు నెత్తిన పెట్టుకున్న ప్రజలు బండకేసి బాదడానికి రెడీగా ఉన్నారు’అని సీఎల్పీ నేత, మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
కేసీఆర్, ఆయన కొడుకు, అల్లుడు, బిడ్డ ఎందరు వచ్చి కుట్రలు పన్నినా తననేం చేయలేరని చెప్పారు. రాష్ట్రానికి దశాదిశా నిర్దేశించే వ్యక్తిగా తనను గెలిపించాలని మధిర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లే వస్తాయని కేసీఆర్ భావిస్తే కాకిలా రాష్ట్రమంతా ఎందుకు తిరుగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
గజ్వేల్‌లో గెలుపుపై నమ్మకం లేకే కామారెడ్డిలోనూ సీఎం కేసీఆర్ పోటీ చేస్తుంటే ఆయన మధిరలో నిలబెట్టిన అభ్యర్థి ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ 75కుపైగా స్థానాల్లో గెలుస్తుందని.. ఆ తర్వాత సీఎం ఎవరో తమ అధిష్టానం నిర్ణయిస్తుందని భట్టి చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, ఉపాధి హామీ, పింఛన్లు, బ్యాంకుల జాతీయీకరణ, బహుళార్థక సాధక ప్రాజెక్టులు ఇలా ఎన్నో ఉన్నాయని తెలిపారు.
సీఎంగా ఉండి కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితమైతే, తాను సీఎల్పీ నేతగా మధిర నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి పాటుపడ్డానని చెప్పారు. దళితబంధు పథకం అమలు విషయంలో తాను సూచనలు చేస్తే కేసీఆర్ మాత్రం ఓట్ల కోణంలో చూసి తనకు భయపడి మధిర అంతటా అమలు చేస్తానని ప్రకటించారని తెలిపారు.
భట్టికి వైఎస్సార్ మాదిరి పదవి రాబోతోంది
కల్వకుంట్ల రమ్యారావు
ముదిగొండ: రాబోయే కాంగ్రెస్ పాలనలో భట్టి విక్రమార్కకు వైఎస్ లాంటి గొప్ప పదవి రాబోతోందని, ప్రజలే ప్రాణమని పాదయాత్ర చేసిన గొప్పవ్యక్తి అని కల్వకుంట్ల రమ్యారావు (సీఎం కేసీఆర్ అన్న కూతురు) వ్యాఖ్యానించారు. మధిర ప్రజలు ఆయన్ను గెలిపించి చరిత్రకెక్కుతారని పేర్కొన్నారు. మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలం బాణాపురంలో మంగళవారం జరిగిన ప్రచార ర్యాలీలో ఆమె పాల్గొని భట్టికి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలని వైఎస్సార్ మాదిరిగా మండుటెండలో భట్టి విక్రమార్క పాదయాత్ర చేశారని తెలిపారు. అభిమానులు భట్టి విక్రమార్కపై పూల వర్షం కురిపించినట్లుగానే ఓట్ల వర్షం కురిపించాలని కోరారు. కారు పార్టీ నేతలవి కారు కూతలని, ప్రజలను మభ్యపెట్టే మాటలని రమ్యారావు మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment