మధిర: సీఎం కేసీఆర్ కావాలనే రైతులకు రైతుబంధు నిధులు జమ కాకుండా చేశారని సీఎల్పీ నేత, మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఖమ్మం జిల్లా మధిర మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. కేసీఆర్ ఎన్నికల వేళ ఓట్లు రాబట్టుకునేందుకు కుట్ర చేశారని, రైతులపై శ్రద్ధ ఉంటే వైన్స్ టెండర్ల మాదిరిగా రైతుబంధు కూడా ముందే ఇచ్చేవారని చెప్పారు.
అయితే, ఇప్పుడు కాంగ్రెస్ నేతలు అడ్డుపడ్డారని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. కాగా, కాంగ్రెస్ హయాంలో ఏర్పాటు చేసిన పవర్ ప్రాజెక్టులతోనే నిత్యం విద్యుత్ ఇవ్వగలుగుతున్నారని, కేసీఆర్ రాకముందే రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత తమ పా ర్టీదని భట్టి తెలిపారు. రైతుల రుణమాఫీ, పంటలకు నష్టపరిహారం, సబ్సిడీలపై ఎరువులు, విత్తనాలు, సబ్సిడీపై విద్యుత్ మోటార్లు తాము ఇవ్వగా, కేసీఆర్ వాటన్నిటినీ నిలిపేశారని విమర్శించారు.
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఏమీలేదని ఆరోపించారు. ఈ నెల 30 తర్వాత బీఆర్‌ఎస్ రాష్ట్రంలో కనిపించదని, కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో మధిర ఎమ్మెల్యేగా తాను ప్రముఖ పాత్ర పోషిస్తానని భట్టి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment