ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ను పాలించే కుట్ర అమలు చేస్తారు..
‘సాక్షి’ ఇంటర్వ్యూలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
రిజర్వేషన్ల అమలు బీజేపీకి ఇష్టం లేదు
అందుకే కులగణనకు ఒప్పుకోవట్లేదు.. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లూ తొలగిస్తారు
బీఆర్‌ఎస్ పని అయిపోయింది.. అందుకే కేసీఆర్ దిగజారిపోయారు
కరెంటు ఉందో లేదో వైర్లను పట్టుకుని చూస్తే అర్థమవుతుందని వ్యాఖ్య
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే తెలంగాణ చిన్నాభిన్నం అవుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీకి 400 స్థానాలు వచ్చి అధికారం చేపట్టిన మరుక్షణమే హైదరాబాద్‌ను ఢిల్లీ నుంచి పాలించే కుట్రను అమలు చేస్తారని.. తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా చేస్తారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గమనించి లోక్‌సభ ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకోవాలన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు ఉండటం లేదన్న మాజీ సీఎం కేసీఆర్.. ఒక్కసారి కరెంటు తీగలను పట్టుకుని చూస్తే కరెంటు ఉందో లేదో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు.
ఎవరు అసమర్థులో, దోపిడీదారులో ఓట్లు వేసేటప్పుడు ప్రజలు నిర్ధారిస్తారన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భట్టి విక్రమార్క బుధవారం ప్రజాభవన్‌లో ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ సారాంశం ఆయన మాటల్లోనే..
‘‘ఐదు నెలలుగా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుండటం సంతృప్తికరంగానే కాదు చాలెంజింగ్‌గా ఉంది. రాష్ట్ర ప్రజలకు రూ.500కే సిలిండర్, రూ.10లక్షలకు ఆరోగ్యశ్రీ పెంపు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పేదలకు ఇండ్ల నిర్మాణానికి రూ.5లక్షలు.. ఇలా సంక్షేమ కార్యక్రమాల అమలు సంతోషాన్నిస్తోంది. మరోవైపు అస్తవ్యస్తమైన ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టాల్సి రావడం, ఆదాయాన్ని సమకూర్చుకోలేని పరిస్థితుల్లో ఉండటం చాలెంజింగ్‌గా ఉన్నాయి.
ప్రజాభవన్‌కు ఎప్పుడైనా రావొచ్చు..
గతంలో ఉన్న ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మార్చాం. వాస్తవానికి సీఎంకు కూడా ఇంత పెద్ద భవనం అవసరం లేదు. అందుకే ప్రజాభవన్ ద్వారాలు తెరిచిపెట్టాం. ప్రజలు ఎప్పుడైనా రావచ్చు. సమస్యలపై దరఖాస్తులు ఇవ్వొచ్చు. సీఎం, నేను ఇతర మంత్రివర్గ సహచరులమంతా రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాం. మా ప్రభుత్వ పాలనకు 100కు 100 మార్కులు వేయొచ్చు. ప్రతి మంత్రి కార్యాలయాల డోర్లు తెరిచే ఉంటున్నాయి. ప్రజలు ఎప్పుడైనా వెళ్లి కలవచ్చు.
కేసీఆర్‌వన్నీ అబద్ధాలే..
ఐదు నెలల్లో తెలంగాణ ఇంత ఆగమైతదా అని కేసీఆర్ అంటున్న మాటలు వింటే నవ్వు వస్తోంది. అబద్ధాల పునాదులపై ఆయన బీఆర్‌ఎస్‌ను నడుపుతున్నారు. వాళ్లే కట్క బంద్ చేసుకుని కరెంటు కట్ అయిందంటారు.
ఆ పెద్దమనిషి అంతగా దిగజారిపోయాడు. కరెంటుకు ఏం మాయరోగం వచ్చిందని అంటున్న కేసీఆర్.. ఒక్కసారి కరెంటు తీగలను పట్టుకుని చూస్తే కరెంటు ఉందో లేదో అర్థమవుతుంది. వాస్తవానికి వెలుగును చూడలేని మాయరోగం కేసీఆర్‌కే వచ్చింది. ఆయన ఎక్కువగా చీకట్లో, ఒంటరిగా ఉంటూ.. ప్రజల సొమ్మును ఎలా దోచుకోవాలో ఆలోచిస్తుంటారు.
చక్కదిద్దేందుకు పదేళ్లు పడుతుంది
తెలంగాణ ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల వలయంలోకి నెట్టారు. దీన్నుంచి రాష్ట్రాన్ని బయటపడేయడం ఒక్కరోజులోనో, ఒక్క ఏడాదిలోనో అయ్యేది కాదు. కనీసం పదేళ్లు పడుతుంది. తెచ్చిన అప్పులను కూడా నిరర్థక ఆస్తులపై పెట్టి.. అప్పు చేసి పప్పుకూడు అన్నట్టు వ్యవహరించారు.
అప్పులు చేస్తే సాగర్, శ్రీశైలం, ఎస్సారెస్పీ, జూరాల వంటి ప్రాజెక్టులు కట్టాలి. బీహెచ్ఈఎల్ లాంటి సంస్థలు ఏర్పాటు చేయాలి. ఓఆర్‌ఆర్, మెట్రోరైలు, అంతర్జాతీయ విమానాశ్రయం లాంటి రవాణా వ్యవస్థలను నెలకొల్పాలి. కాళేశ్వరం లాంటి గుదిబండను కట్టడం కాదు.
బీజేపీ రిజర్వేషన్లు ఎత్తేయడం ఖాయం
‘‘దేశంలో రిజర్వేషన్లను అమలు చేయడం బీజేపీకి ఇష్టం లేదు. అందుకే దేశవ్యాప్తంగా కులగణన చేయాలంటూ రాహుల్ గాంధీ పదేళ్లుగా నినదిస్తున్నా పట్టించుకోవడం లేదు. బీసీలకు జనాభా దామాషా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎగ్గొట్టడంతోపాటు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఎత్తివేయాలనేది బీజేపీ వ్యూహం.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే కులగణన చేస్తాం. ఓబీసీలకు రాజ్యాంగపరంగా వాటా ఇస్తాం. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పార్టీ కార్యకర్తలు, అభిమానులు మాత్రమే ఓట్లేశారు. ఇప్పుడు మా గ్రాఫ్ పెరిగింది. గతంలో ఓటేయని వారు కూడా మాకు ఓటేస్తామంటున్నారు.’’
పద్ధతి ప్రకారమే టికెట్లు ఇచ్చాం
బీజేపీ, బీఆర్‌ఎస్‌ల్లాగా నియంతృత్వ ధోరణుల్లో కాంగ్రెస్ టికెట్ల కేటాయింపు ఉండదు. పార్టీ రాజ్యంగంలోని అన్ని పద్ధతులను పాటించి అభ్యర్థులను ఖరారు చేశాం. అందుకే జాప్యం జరిగింది. పార్టీ అధిష్టానం అన్నీ ఆలోచించాకే టికెట్లు ఇస్తుంది.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు
బీఆర్‌ఎస్ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. బీఆర్‌ఎస్‌లో ఇమడలేకపోతున్నాం, ఉండలేకపోతున్నామని అంటున్నారు. చాలా మంది నాతో మాట్లాడారు కూడా. అయితే ఎందరు చేరతారు, ఎప్పుడు చేరతారనేది బయటికి చెప్పలేం. బీఆర్‌ఎస్‌కు ప్రజాదరణ పెరుగుతుందని ఎవరైనా అంటే నవ్వు కోవాల్సిందే. అది అయిపోయిన పార్టీ. ఈ విషయం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా అర్థమై పోయింది. అందుకే బయటకు వచ్చేస్తున్నారు.
కాంగ్రెస్‌కు పట్టం కట్టండి
ప్రజా ప్రభుత్వం మాది. ఇందిరమ్మ రాజ్యం మాది. ప్రజలకోసమే పనిచేస్తాం.. మతతత్వ, నియంతృత్వ ధోరణులతో కూడిన బీఆర్‌ఎస్, బీజేపీలను దూరంగా పెట్టి కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో పట్టం కట్టాలి..’’ అని భట్టి పేర్కొన్నారు.
-(మేకల కల్యాణ్ చక్రవర్తి)
Comments
Please login to add a commentAdd a comment