మీడియాతో ముఖాముఖిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
బీఆర్‌ఎస్ వాళ్లున్నప్పుడే వర్షాలు పడలేదు.. వచ్చిన వర్షాన్ని ఒడిసి పట్టుకోవడంలో విఫలమయ్యారు..
కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని కిందకు వదిలేసి ఇప్పుడు కరువొచ్చిందంటున్నారు
రూ.43 వేల కోట్ల మిషన్ భగీరథ వ్యవస్థ ఈ కరువులో ఏం చేస్తున్నట్టు?
ఇవన్నీ ఎవరి తప్పులు?
బీఆర్‌ఎస్ తప్పిదాలపై మేం బతకాలనుకోవడం లేదు
సీఎం సహా మేమందరం 24 గంటలూ ఓ తపస్సులా పనిచేస్తున్నాం
రాష్ట్రంలో సంపదను సృష్టించి పేదలందరికీ పంచాలన్నదే మా ఆలోచన
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలపై బతకాలని తాము అనుకోవడం లేదని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ‘బీఆర్‌ఎస్ హయాంలో తలసరి ఆదాయం పెరిగిందని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు పెరిగాయన్న విషయాన్ని మరుగున పెట్టారు. సింగరేణిలో రూ.30 వేల కోట్ల ఆదాయం వచ్చే బొగ్గు గనులకు సంబంధించిన పెండింగ్ అంశాలను పదేళ్లయినా తేల్చలేదు. వర్షాలు వాళ్లున్నప్పుడే పడలేదు. వచ్చిన వర్షాన్ని ఒడి సి పట్టుకోవడంలో విఫలమయ్యారు.
కాళేశ్వ రం ప్రాజెక్టు కుంగిపోయినట్టు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెపితే గోదావరి నీటిని అవసరం లేకపోయినా కిందకు వదిలేశారు. కృష్ణాలో నీటి నిల్వల సంగతి తెలిసి కూడా కేవలం ఓట్ల కోసం, కాల్వల్లో నీటిని చూసి జనం ఓట్లేస్తారనే ఉద్దేశంతో పంటలు లేకపోయినా నీటిని సముద్రంలోకి వదిలేశారు. ఇప్పుడు కరువొచ్చిందని అంటున్నారు. రూ. 43 వేల కోట్లు పెట్టి ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ వ్యవస్థ ఈ కరువులో ఏం చేస్తున్న ట్టు? ఇవన్నీ ఎవరి తప్పులు? తప్పులన్నీ మీవైపే ఉన్నాయి..’అంటూ భట్టి ధ్వజమెత్తా రు. శుక్రవారం హైదరాబాద్‌లోని దేశోద్ధారక భవన్‌లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో ‘విద్యుత్–తాగునీరు–ఆర్థికం’అంశాలపై నిర్వ హించిన మీడియాతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
అప్పులు, వడ్డీల కింద రూ.26,374 కోట్లు చెల్లించాం
‘రైతుబంధు కింద గత ప్రభుత్వం రూ.7 వేల కోట్లు దాచిపెడితే మేమేదో ఖర్చు పెట్టినట్టు గా ప్రచారం చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో మేము అధికారం చేపట్టేనాటికి రూ.3,960 కోట్ల లోటు బడ్జెట్ ఉంది. ఆ పరిస్థితి నుంచి ప్రతి రూపాయి పోగేస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసే ప్రయత్నం చేస్తు న్నాం. సీఎం రేవంత్‌రెడ్డితో సహా మంత్రులందరం 24 గంటలూ కష్టపడుతూ ఓ తపస్సు లా పనిచేస్తున్నాం. రాష్ట్రంలో సంపదను సృష్టించి పేదలందరికీ పంచాలన్నదే మా ఆలోచన. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన అప్పుల అసలు, వడ్డీల కింద రూ.26,374 కోట్లు తిరిగి చెల్లించాం.
రైతుబంధు కింద రూ.5,575 కోట్లు, ఆరీ్టసీకి రూ.1,120 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సబ్సిడీల కోసం రూ.3,924 కోట్లు, గృహజ్యోతి కోసం రూ.200 కోట్లు, గ్యాస్ సబ్సిడీ కోసం రూ.80 కోట్లు, బియ్యం సబ్సిడీల కింద రూ.1,147 కోట్లు, రైతు బీమా ప్రీమియం కోసం రూ.734 కోట్లు చెల్లించాం. ఉద్యోగుల వేతనాలు, విద్యార్థులకు డైట్ చార్జీలు, మధ్యాహ్న భోజన పథకం అమలు, అంగన్‌వాడీలు, హోంగార్డులకు వేతనాలు, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు... ఇలా మొత్తం రూ.66,507 కోట్లు ఖర్చు పెట్టాం. దీనిపై ఎవరితోనైనా, ఎక్కడైనా చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం..’అని భట్టి సవాల్ చేశారు.
విద్యుత్‌కు అంతరాయమే తప్ప కోతల్లేవు
‘విద్యుత్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించి పనిచేస్తున్నాం. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా 15,673 మెగావాట్ల పీక్ డిమాండ్ వచ్చినా చిన్న కోత లేకుండా నిరంతర విద్యుత్ ఇస్తున్నాం. ఎప్పుడైనా ఎక్కడైనా కరెంటు పోతే అది అంతరాయం మాత్రమే. నిర్వహణ పనుల కోసం ఆపేస్తున్నదే తప్ప కోత కాదు. 2031–32 సంవత్సరం వరకు 29 వేల నుంచి 30వేల మెగావాట్ల వరకు పీక్ డిమాండ్ వచ్చినా అందుకు తగిన కార్యాచరణ మా వద్ద ఉంది..’అని డిప్యూటీ సీఎం తెలిపారు.
తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు
‘గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నా తాగునీటికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. రాష్ట్రంలో ఎ క్కడా నీటి సమస్య రానివ్వబోం. త్వరితగతి న పూర్తయ్యే సాగునీటి ప్రాజెక్టులకు నిధు లు కేటాయిస్తాం. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజె క్టు నిర్మిస్తాం. రైతు రుణమాఫీ తప్పకుండా చేస్తాం. ఎన్నికల తర్వాత దీనిపై స్పష్టమైన ప్ర కటన ఉంటుంది..’అని భట్టి తెలిపారు.
10 లక్షల కోట్లు ప్రభుత్వ అకౌంట్లలోకి రాలేదు
గత పదేళ్లలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల కోట్లు వచ్చాయన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను భట్టి ఖండించారు. ‘కేంద్రం నుంచి రూ.10 లక్షల కోట్లు వచ్చాయని ఒక పెద్దమనిషి చెపుతున్నాడు. రూ.10 లక్షల కోట్ల మాట అటుంచితే తెలంగాణపై బీజేపీకి కనీస ప్రేమ ఉన్నా లక్ష కోట్ల రూపాయల నష్టం జరిగేది కాదు. నాడు చేవెళ్ల–ప్రాణహిత ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర కోల్పోయే 3 వేల ఎకరాల భూమి విషయంలో వారిని ఒప్పించి పరిహారం ఇచ్చి ఉంటే నేడు కాళేశ్వరం ప్రాజెక్టే వచ్చేది కాదు. కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటా కింద వచ్చింది రూ.3,70,235 కోట్లు మాత్రమే. మరి ఆయన చెపుతున్నట్టు మిగిలినవి ఎక్కడ ఇచ్చారో తెలియదు. ప్రభుత్వ అకౌంట్లలోకి అయితే రాలేదు. బీజేపీ ఇచ్చిన రూ.10 లక్షల కోట్లు, బీఆర్‌ఎస్ చేసిన రూ.7 లక్షల కోట్ల అప్పు ఏమయ్యాయో, ఆ రెండు పారీ్టలు ఏం సాధించాయో?’వారే సమాధానం చెప్పాలి..’అని భట్టి వ్యాఖ్యానించారు.
మా ప్రభుత్వం ఐదేళ్లూ ఉంటుంది
మాజీ సీఎం కేసీఆర్ గురువారం చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ..‘ప్రభుత్వాన్ని అస్థిరత పాలు చేసే ప్రయత్నాలు తెలంగాణ సమాజానికే నష్టం కలిగిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం చాలా బలంగా ఉంది. తలకిందులుగా తపస్సు చేసినా, ఎన్ని పిల్లేరు గంతులు వేసినా మా ప్రభుత్వానికి వచ్చే ఢోకా లేదు. ఐదేళ్ల పాటు నిశి్చంతగా ఉంటుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుంది..’అని డిప్యూటీ సీఎం చెప్పారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు విరాహత్ అలీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment