బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
అందుకు రిజర్వ్ బ్యాంక్ గణాంకాలే సాక్ష్యం ∙రాష్ట్రంలో బలమైన ఆర్థిక వ్యవస్థ రూపొందించారు
నీటిపారుదల, వ్యవసాయం, మహిళా సాధికారత, వైద్యవిద్య వంటి రంగాల్లో టాప్
భవిష్యత్ తరాల కోసం ఆలోచించే నేత కేసీఆర్..
‘ఎక్స్’లో ఆర్‌బీఐ తాజా నివేదికను పోస్ట్ చేసిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల పాలనలో తెలంగాణ సీఎంగా కేసీఆర్ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపారని, అందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన గణాంకాలే సాక్ష్యాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆర్‌బీఐ విడుదల చేసిన నివేదికను చూస్తే తెలంగాణ సాధించిన ప్రగతి కళ్లకు కడుతుందని, కేసీఆర్ ఈ రాష్ట్రానికి ఏం చేశారన్న మాటలకు ఆర్‌బీఐ లెక్కలే సమాధానమని అన్నారు. ఈ మేరకు ఆయన ఆర్‌బీఐ నివేదికను ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తూ, వివరాలు వెల్లడించారు. బలమైన ఆర్థిక వ్యవస్థను రూపొందించడంతో పాటు నీటిపారుదల, వ్యవసాయం, అభివృద్ధి, పన్ను వసూళ్లు, మహిళా సాధికారత, వైద్యవిద్య మొదలైన రంగాల్లో టాప్‌గా నిలిపినట్లు వివరించారు.
2022–2023 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ తలసరి ఆదాయం (ఎన్‌ఎస్‌డీపీ) రూ. 3.08 లక్షలకు చేరిందని, దేశంలోని అన్ని ప్రధాన రాష్ట్రాలను తలదన్ని తెలంగాణ ముందుందని తెలిపారు. తెలంగాణలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)లలో 40 శాతం వాటా మహిళలదేనని, జాతీయ సగటు 20 శాతంతో పోల్చితే రెట్టింపుతో మహిళా సాధికారతలోనూ మనమే ముందున్నామన్నారు. వైద్యవిద్య విషయంలో తెలంగాణలో ప్రతి 4,460 మందికి సగటున ఒక ఎంబీబీఎస్ సీటు అందుబాటులో ఉందని, దేశంలో సగటున 12,851 మంది విద్యార్థులకు ఒక సీటు మాత్రమే అందుబాటులో ఉందని తెలిపారు.
పన్ను వసూళ్లలోనూ ఆదర్శంగా నిలిచామని, 2021–22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ తలసరి ఎస్‌జీఎస్‌టీ పన్ను వసూళ్లు రూ. 7,665గా ఉందని, దేశ సగటు రూ. 4,461 మాత్రమేనని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పాలిత ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి ప్రగతిని చూపించే దమ్ముందా అని కేటీఆర్ సవాల్ విసిరారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే తెలంగాణ వచ్చి పోతున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఈ గణాంకాలు చూసి పరిపాలన నేర్చుకోవాలని హితవు పలికారు. ఒక రాజకీయ నాయకుడు తరువాతి ఎన్నికల్లో గెలవటం కోసం మాత్రమే ఆలోచిస్తాడని, కానీ కేసీఆర్ లాంటి రాజనీతిజ్ఞుడు మాత్రమే తరువాత తరం కోసం ఆలోచిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు.
ఆరు గ్యారంటీలు ఇవే: కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలపై బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘ఇది బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తుంచుకోండి. ఆరు గ్యారంటీలైన ఇన్వర్టర్లు, చార్జింగ్ బల్బులు, టార్చ్ లైట్లు, కాండిళ్లు, జనరేటర్లు, పవర్ బ్యాంకులు సమకూర్చుకుని నిలువ చేసుకో వాలని నా సహ తెలంగాణ పౌరులను కోరుతున్నా’అని కేటీఆర్ పేర్కొన్నారు.
‘మోదీ చెప్తున్న ప్రకారం అదానీ, అంబానీ వ్యాన్ల కొద్దీ నోట్ల కట్టలను స్కాంగ్రెస్ (కాంగ్రెస్)కు పంపుతుంటే ఆయన ప్రియమైన భాగస్వాములు ఈడీ, ఐటీ, సీబీఐ ఎందుకు మౌనంగా ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు అనేది విఫలమైందని మోదీ అంగీకరిస్తున్నట్లేనా’అని కేటీఆర్ మరో పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment