పోస్టర్‌ను విడుదల చేస్తున్న ఠాక్రే, రేవంత్, చిత్రంలో సంపత్, మహేశ్ కుమార్ గౌడ్, అజహరుద్దీన్, పొంగులేటి, అంజన్ కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, మధుయాష్కీ, భట్టి, బలరాం నాయక్, పొన్నం, రాజయ్య, సీతక్క
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎన్నికల ప్రచార నగారా మోగించింది. ‘తిరగబడదాం...తరిమికొడదాం’అనే నినాదంతో పోరాటాలే లక్ష్యంగా కార్యాచరణను ప్రకటించింది. బీఆర్‌ఎస్–బీజేపీ రెండూ తోడు దొంగలని, కలిసే అవినీతి–అక్రమాలకు పాల్పడుతున్నాయంటూ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. బీఆర్‌ఎస్ తొమ్మిదేళ్ల పాలన వైఫల్యాలను ఎత్తిచూపుతామని వెల్లడించింది. ఈ మేరకు బీఆర్‌ఎస్, బీజేపీలపై రూపొందించిన కరపత్రాలు, పోస్టర్లను విడుదల చేస్తూ.. కార్యక్రమాల షెడ్యూల్‌ను ప్రకటించింది.
శనివారం హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోదీ, కేసీఆర్‌ల చిత్రాలతో ‘తోడు దొంగలు’పేరుతో రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆ పోస్టర్‌లో బీఆర్‌ఎస్, బీజేపీలపై 15 అంశాలతో కూడిన ప్రజా చార్జిషిట్‌ను నమోదు చేశారు. అనంతరం మధుయాష్కీ పార్టీ కార్యాచరణను ప్రకటించారు.
చార్జిషిట్‌ను ఇంటింటికీ చేరుస్తాం
ప్రచార కార్యక్రమంలో భాగంగా నెల రోజుల్లో రాష్ట్రంలోని 75 లక్షల కుటుంబాలకు తమ చార్జిషీట్‌ను చేరుస్తామని మధుయాష్కీ గౌడ్ వెల్లడించారు. ప్రజలను మమేకం చేస్తూ ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళతామని.. 12వేల పంచాయతీల్లో గ్రామ సభలు, 3 వేల డివిజన్ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇంటింటికీ వెళ్లిన సందర్భంగా పోస్టర్‌కార్డుపై ప్రజల సంతకాలు తీసుకుని, బీఆర్‌ఎస్, బీజేపీల వైఫల్యాలపై ప్రజల ఆమోదం తీసుకుంటామని చెప్పారు. ఈ పోరాటంలో తమతో కలసి వచ్చేందుకు ప్రజలు 7661899899 ఫోన్ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరారు.
కాగా.. నియంతలను మించి కేసీఆర్ ప్రజలపై దాడులు చేస్తున్నారని, ఆయనపై ప్రతి గ్రామానికి వెళ్లి చార్జిషిట్ వేయాలని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్, చిన్నారెడ్డి, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, సురేశ్ షెట్కార్, మల్లురవి, రాజయ్య, షబ్బీర్‌అలీ, సీతక్క తదితరులు పాల్గొన్నారు.
ప్రజాకోర్టు.. కేసీఆర్‌పై అభియోగాలు..
ప్రచార కార్యక్రమాన్ని ప్రకటించిన అనంతరం Vటీపీసీసీ ప్రచార కమిటీ ఆధ్వర్యంలో ప్రజాకోర్టు నిర్వహించారు. దీనికి కంచె ఐలయ్య జడ్జిగా వ్యవహరించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత కటౌట్లను బోనులో దోషులుగా నిలబెట్టి వారిపై పీసీసీ నేతలు అభియోగాలు నమోదు చేశారు. చార్జిషిట్‌లోని అంశాలను వాదనలుగా వినిపించారు. న్యాయమూర్తిగా వ్యవహరించిన కంచె ఐలయ్య వారి వాదనలు విన్నారు. సమాజంలో అన్ని వర్గాలను మోసం చేయడంతోపాటు వాగ్దానాలను నిలబెట్టుకోకుండా ప్రజలను వంచించిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టాలని, ఓట్లు వేయకుండా తిరస్కరించాలని తీర్పునిచ్చారు.
బీఆర్‌ఎస్ దోపిడీపై పోరాటమే: భట్టి
తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరకుండా తొమ్మిదేళ్లుగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం అడ్డగోడగా నిలిచిందని.. దిక్కుతోచని స్థితిలో తెలంగాణ సమాజం విలవిల్లాడుతోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ ఇచి్చన పారీ్టగా కాంగ్రెస్ మరోసారి నడుం బిగించిందని.. బీఆర్‌ఎస్ అవినీతి, దోపిడీకి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తామని ప్రకటించారు. ‘‘ప్రభుత్వంపై అభియోగాల నమోదుతోపాటు ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. పోరాడుదాం, తిరగబడదాం, తరిమికొడదాం, రాష్ట్రాన్ని నిలబెడదాం..’’ అని కాంగ్రెస్ శ్రేణులకు భట్టి పిలుపునిచ్చారు.
ఆకాంక్షలను కాలరాసిన కేసీఆర్: రేవంత్
ఉద్యమకారుల ఆకాంక్షలను రాజకీయ ఇంధనంగా మార్చుకుని గద్దెనెక్కిన కేసీఆర్.. తర్వాత ఆ ఆకాంక్షలను కాలరాశాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరఫున ప్రజాకోర్టు ఏర్పాటు చేస్తున్నామని.. రాజులు, నియంతలను మరిపించే విధంగా ప్రజలపై దాషీ్టకాలకు పాల్పడుతున్న కేసీఆర్, ఆయన కుటుంబంపై చార్జిషిట్ వేస్తున్నామని చెప్పారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం అనేవి రాష్ట్రంలో భూతద్దం వేసి వెతికినా కనిపించడం లేదన్నారు. కాళోజీ స్ఫూర్తితో బీఆర్‌ఎస్‌ను తెలంగాణ పొలిమేరలు దాటేవరకు తరిమికొడతామన్నారు.
కాంగ్రెస్ ప్రజా చార్జిషిట్‌లోని అంశాలివీ..
భ్రష్ట జుమ్లా పార్టీ (బీజేపీ)
- తెలంగాణకు ద్రోహం– ఆంధ్రతో స్నేహం
- కాళేశ్వరంలో అవినీతి–కేసీఆర్‌తో లాలూచీ
- ప్రాజెక్టులు కట్టలే–జాతీయ హోదా దక్కలే
- నీళ్లు, నిధుల్లో అన్యాయం–యువతకు ఇవ్వలే ఉద్యోగం
- రైతులపై అప్పుల భారం–పేదలపై ధరల భారం
- ప్రభుత్వ ఆస్తులు అమ్ముడు–ప్రజల సొమ్ము దోచుడు
బీజేపీ రిష్తేదార్ సమితి (బీఆర్‌ఎస్)
- కల్వకుంట్ల కుటుంబం–కావేవీ అక్రమాలకు అనర్హం
- కాళేశ్వరంతో చోరీ–ఖజానా ఖాళీ
- కచరా సర్కార్–కర్షకుల ఖూనీకోర్
- అబద్ధాలు చెప్పిండు–అధికారంలోకి వచ్చిండు
- కారు వారసులు–భూబకాసురులు
- దళిత గిరిజనులకు అవమానం–దక్కలేదు గౌరవం
- ఇంటికి ఉద్యోగం రాలే–యువత భవిత మారలే
- అటకెక్కిన ఉచిత విద్య–పడకేసిన ఆరోగ్యం
- ఆడబిడ్డలపై దాడులు–అయినా ఫామ్‌హౌజ్ వదలరు
- బడ్జెట్‌లో కోతలు–సంక్షేమానికి వాతలు
(ఈ అంశాలను పోస్టర్‌లో పేర్కొనడంతోపాటు బైబై మోదీ, బైబై కేసీఆర్ అనే నినాదాలను చేర్చారు)
Comments
Please login to add a commentAdd a comment