
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న శాసనసభ భవనాలు సరిపోతున్నాయో లేదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ శాసనసభ్యుల సంఖ్య 119 మాత్రమే కాబట్టి (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 294 మంది ఉండేవారు) ఇప్పుడున్న భవనం ఎందుకు సరిపోవడం లేదో వివరించాలని సూచించింది. ఇప్పటి అసెంబ్లీ భవనం సరిపోతున్నప్పుడు కొత్త భవన నిర్మాణం అవసరం ఎందుకో కూడా తెలియజేయాలని పేర్కొంది. ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చి రాష్ట్ర చట్టసభల భవన సముదాయాన్ని నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై బుధవారం కూడా హైకోర్టులో వాదనలు కొనసాగాయి.
కొత్తగా అసెంబ్లీ భవనాలు నిర్మించాలనే నిర్ణయానికి అనుగుణంగా ప్లాన్ రూపకల్పన చేశారో లేదో, డిజైన్ రూపొందించిందీ లేనిదీ కూడా గురువారం జరిగే విచారణ సమయంలో తెలియజేయాలని స్పష్టంచేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చేందుకు హెచ్‌ఎండీఏ అనుమతి తీసుకున్నారో లేదో కూడా చెప్పాలని కోరింది. హుడా చట్టం ప్రకారం ఎర్రమంజిల్ భవనాన్ని వారసత్వ భవనాల జాబితా నుంచి తొలగించినా హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లో ఆ నిబంధన కొనసాగుతున్నందున కూల్చివేత విషయమై అనుమతి పొందిందీ లేనిదీ వివరించాలని ఆదేశించింది.
అమల్లో ఉండేది కొత్త చట్టమే: ఏఏజీ
పాత చట్టం ప్రకారం ఎర్రమంజిల్ భవనాన్ని వారసత్వ భవనాల జాబితా నుంచి తొలగించినందున ఇప్పుడు కొత్త చట్టమే అమల్లో ఉంటుందని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) జె.రామచంద్రరావు వివరించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వస్తుందనేది ఆశాజనక విషయమని, ఆ ఆలయం జాబితాలో చేరిన తర్వాతే రక్షణ లభిస్తుందని పేర్కొంది.
ఇక్కడ కూడా హుడా చట్టం కింద వారసత్వ భవనం కాదని చెబుతున్న ప్రభుత్వం.. హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం దాని రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే అవుతుందని వ్యాఖ్యానించింది. అయితే, ఒక చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో మరో చట్టాన్ని రూపొందించినప్పుడు కొత్త చట్టమే అమల్లో ఉంటుందని, ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని అదనపు ఏజీ రామచంద్రరావు బదులిచ్చారు. 1960, 2017 చట్టాలు, 13వ నిబంధనలోని విషయాలన్నీ ఒకే అంశానికి చెందినవని, దీనిపై మీమాంస లేదని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రస్తుత అసెంబ్లీ భవనం సరిపోతోందో లేదో, హెచ్‌ఎండీఏ చట్టం ప్రకారం కొత్త అసెంబ్లీ భవన నిర్మాణానికి అనుమతి తీసుకున్నారో లేదో గురువారం చెప్పాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment