సాక్షి, హైదరాబాద్: బత్తిన సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలకు ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాట్లు చేయరాదని ఎక్కడుందో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ బిజినెస్ రూల్ కింద ఖర్చులెలా చేయాలని ఉందో తెలియజేయాలని బాలల హక్కుల సంఘాన్ని నిలదీసింది. అన్ని ప్రభుత్వ శాఖలు చేప ప్రసాదం ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయని, ప్రభుత్వ శాఖలు చేసే ఖర్చుల గురించి ప్రభుత్వం అధికారికంగా వెల్లడించకపోవడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరుతూ ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పి.అచ్యుత్‌రావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని శుక్రవారం హైకోర్టు మరోసారి విచారించింది. ప్రజాధనాన్ని ఖర్చు చేసేప్పుడు వాటి గురించి ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలని, ఖర్చు చేసే అంశంపై జవాబుదారీతనం ఉండాలని పిటిషనర్ తరఫు న్యాయవాది సి.దామోదర్‌రెడ్డి వాదించారు.
ప్రభుత్వం ఏ బిజినెస్ రూల్ ప్రకారం ఖర్చు చేయాలో తెలియజేయాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం ప్రశ్నించింది. పెద్ద సంఖ్యలో జనం వస్తున్నప్పుడు వారికి మంచినీరు, అత్యవసర వైద్యం, విద్యుత్, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు కల్పిస్తే తప్పేంటని అడిగింది. ఆ విధమైన ఏర్పాట్లు చేయడానికి అభ్యంతరం లేదని, అయితే అందుకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చుల గురించే తమకున్న అభ్యంతరమని, ప్రభుత్వం ఎలాంటి కేటాయింపులు చేయకుండానే ఖర్చు చేస్తోందని న్యాయవాది బదులిచ్చారు. ఈ విషయంపై గతంలో లోకాయుక్త ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పగానే ధర్మాసనం కల్పించుకుని.. లోకాయుక్త సిఫార్సు మాత్రమే చేస్తుందని, ఆ సిఫార్సులను కచ్చితంగా అమలు చేయాలని ఏమీ లేదని చెప్పింది.
ప్రజావసరాల కోసం పోలీస్, మత్స్య, విద్యుత్, రెవెన్యూ వంటి శాఖల సేవల్ని ఉపయోగించుకోకపోతే, రేపు ఏదైనా జరగరానిది జరిగితే కోర్టులకు వచ్చి ప్రభుత్వ వైఫల్యం చెందిందని వ్యాజ్యాలు వేసే అవకాశాలు ఉంటాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విచారణ మూడు వారాలకు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఇక íసిటీ పోలీస్ కమిషనర్ దాఖలు చేసిన అఫిడవిట్‌లో చేప మందుపై గతంలో దాఖలైన కోర్టు కేసుల తర్వాతే చేప ప్రసాదం పేరుతో బత్తిన సోదరులు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. దీనిని 1845 నుంచి ఇస్తున్నారని, దాని ఫార్ములా గోప్యంగానే ఉంచుతున్నారని, ఆస్తమా తగ్గుతుందనే నమ్మకంతో భారీ సంఖ్యలో వచ్చే వారి కోసం పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. పిటిషనర్ అచ్యుత్‌రావుపై 2017లో హైదరాబాద్ పాతబస్తీలోని టప్పాచాబుత్రా పోలీస్‌స్టేషన్‌లో బాలల పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే కేసు ఉందన్నారు.
ఆ ఏర్పాట్లకు ప్రభుత్వం ఎందుకు ఖర్చు చేయొద్దు?
Published Sat, Jun 8 2019 3:00 AM | Last Updated on Sat, Jun 8 2019 3:00 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment