అసెంబ్లీ భవనాలపై వివాదం
అసెంబ్లీ భవనాలపై వివాదం
Published Sat, Jun 7 2014 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 8:24 AM
కొలిక్కిరాని కేటాయింపులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలకు భవనాల కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వుల అమలులో వివాదాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఇరు రాష్ట్రాల అసెంబ్లీ కార్యదర్శులు రాజసదారం, సత్యనారాయణల మధ్య సమన్వయం కుదరకపోవడంతో అసెంబ్లీలో గదుల కేటాయింపు, వాటిలో మరమ్మతులు, సదుపాయాల కల్పన వంటివి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. పాత అసెంబ్లీ భవనాన్ని ఆంధ్రప్రదేశ్‌కు, కొత్త అసెంబ్లీ భవనాన్ని తెలంగాణకు కేటాయించారు. అయితే పాత అసెంబ్లీ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శికి ఇప్పటివరకు అప్పగించకపోవడంతో అక్కడ ఏర్పాట్లు ఆగిపోయాయి.
పైగా పాతభవనంలోనే తెలంగాణ డిప్యూటీ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయాలున్నాయి. వాటిని ఖాళీచేస్తేకాని ఆంధ్రప్రదేశ్ నేతలకు, కార్యదర్శికి గదులు సమకూరే అవకాశం లేదు. దాంతోపాటు రెండు అసెంబ్లీ సమావేశ మందిరాల మధ్య రెండువైపుల మంత్రుల చాంబర్ లుగా ఉన్న రెండు అంతస్థుల భవనాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మంత్రులకు చేరొకవైపు కేటాయించాల్సి ఉంది. అయితే దీనిపై రెండు అసెంబ్లీల కార్యదర్శుల మధ్య వివాదం నెలకొంది. ఇటీవల స్పీకర్ మనోహర్ సమక్షంలో దీనిపై చర్చలు జరగ్గా ఎవరికి ఎటువైపు కేటాయించాలన్నది కొలిక్కిరాలేదు. దీంతో స్పీకర్ లాటరీ వేయాల్సి వచ్చింది.
ఇలా ఒకవైపు భవనాన్ని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. దాన్ని ఆ రాష్ట్ర కార్యదర్శికి అప్పగిస్తూ తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి లిఖితపూర్వక లేఖను ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు అలాంటి ఉత్తర్వు తమకు రాకపోవడంతో ఏపీ అసెంబ్లీ కార్యదర్శి దానిపై ఉన్నతాధికారులకు మొరపెట్టుకోవాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగే పాతభవనంలో ఉన్న తెలంగాణ కార్యదర్శి కార్యాలయం గదులు తనకు అప్పగిస్తే తమకు విధుల నిర్వహణకు వెసులుబాటుగా ఉంటుందని ఏపీ అసెంబ్లీ కార్యదర్శి అధికారులకు వివరించారు.
తెలంగాణ అసెంబ్లీ భవనానికి సమీపంలో పాత అసెంబ్లీ భవనంలోనే ఉన్న డిప్యూటీ స్పీకర్ కార్యాలయ గదులను ఆ రాష్ట్ర కార్యదర్శికి కేటాయిస్తామన్నా అందుకు ఆయన నుంచి స్పందన లేదని ఏపీ అసెంబ్లీ సిబ్బంది వాపోతున్నారు. భవనాలను తమకు అప్పగించకపోవడంతో వివిధ శాసనసభాపక్ష కార్యాలయాలకు, మంత్రుల చాంబర్ల ఏర్పాటుకు కూడా వీలు కలగడం లేదని చెబుతున్నారు.
Advertisement
Advertisement