ముస్లింలకు రిజర్వేషన్లు సాధ్యమేనా?
► రాష్ట్ర ప్రభుత్వానికి దత్తాత్రేయ ప్రశ్న
► మత ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం
► కార్మికుల సామాజిక భద్రతకు ప్రాధాన్యమని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ చేస్తున్న ఆలోచన ఎంత వరకు సాధ్యమని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ప్రశ్నించారు. ఓటు బ్యాంకు కోసం ఆచరణ సాధ్యం కాని అంశాలను ప్రస్తావించడం సరైంది కాదన్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్ల కల్పన అనేది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఈ విషయంలో గత ప్రభుత్వాలు భంగపాటుకు గురయ్యాయని, కేసీఆర్ ప్రభుత్వం వాటి నుంచి గుణపాఠం నేర్చుకోవాలని హితవు పలికారు. శనివారం బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ముస్లింలు, మైనారిటీల అభివృద్ధి జరగాలంటే విద్య, ఉపాధికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే విపక్షాలకు 7, 8 సీట్లు కూడా రావని, అందులో బీజేపీకి ఒకటే సీటు వస్తుందని సర్వేలో తేలిందన్న సీఎం వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఆ సర్వేను స్వాగతిస్తున్నామని దత్తాత్రేయ అన్నారు.
బీజేపీ పటిష్టమైన, కార్యకర్తల పార్టీ అని, దాన్ని మరింత బలోపేతం చేసి ఇలాంటి ఊహాగానాలను పటాపంచలు చేస్తామన్నారు. రాజకీయాల్లో 2 నుంచి 200 సీట్లకు పెరగడం, 200 సీట్లు నుంచి 2 సీట్లకు పడిపోవడం సాధ్యమేనని తెలిపారు. సచివాలయం కూల్చివేతపై స్పందిస్తూ కేసీఆర్ కొత్త ఆలోచనలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయని, అవి ఎప్పుడు సాకారం అవుతాయో వివరణ ఇవ్వాల్సి ఉందన్నారు. అభివృద్ధి సూచికలుగా ఉన్న విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రైతులు, కార్మికులు, బడుగుల విద్య, వైద్యంపై దృష్టి కేంద్రీకరించాలని పేర్కొన్నారు. రాష్ట్ర అక్రిడేటెడ్ జర్నలిస్టులకు సీజీహెచ్‌ఎస్ పథకం కింద వైద్య సేవలు అందించే విషయంపై త్వరలోనే ఢిల్లీలో అధికారులతో చర్చిస్తామని హామీ ఇచ్చారు.
ఆ 9.8 లక్షల ఖాతాలు పునరుద్ధరిస్తాం
కార్మికులకు సామాజిక భద్రతను కల్పిం చేందుకు కేంద్రం అత్యంత ప్రాధాన్యమిస్తోందని దత్తాత్రేయ చెప్పారు. గతంలో యూపీఏ ప్రభుత్వం 9.8 లక్షల మంది కార్మికుల కొనసాగని ఖాతాలు (ఇన్ ఆపరేటివ్ అకౌంట్స్) నిలిపేసిందని, ఈ అకౌంట్‌లలో రూ.42 వేల కోట్ల మొత్తం డబ్బు ఉందని తెలిపారు. తమ ప్రభుత్వం ఈ ఖా తాలను పునరుద్ధరిస్తుందని, ఆ కార్మికులకు 8.58 శాతం చొప్పున వడ్డీ ఇచ్చేలా.. వారికి దీపావళి కానుక కింద నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇది కార్మికుల కష్టార్జితమని చెప్పారు. సెం ట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ హోదాలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈఎస్‌ఐసీ వైద్య సేవల్లో గుణాత్మక మార్పులు తీసుకొస్తున్నట్లు, అసంఘటిత రంగ కార్మికులను కూడా ఇందులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 4.7 కోట్ల మంది భవన నిర్మాణ కార్మికులకు ఈఎస్‌ఐసీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.