
సాక్షి, హైదరాబాద్: అశాస్త్రీయంగా రూపొందించిన మున్సిపల్ చట్టాన్ని ఆమోదించవద్దని, దానిని వెనక్కి తిప్పి పంపాలని బీజేపీ ప్రతినిధి బృందం గవర్నర్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేసింది. శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కేంద్ర మాజీమంత్రి దత్తాత్రేయ, నేతలు డీకే అరుణ, టి.చంద్రశేఖర్‌రావు, విజయరామారావు, ఎమ్మెల్యే రాజాసింగ్, పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి, రాజేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి తదితరులు గవర్నర్‌ను కలిశారు. చట్టంలో లోపాలను పేర్కొంటూ నివేదికను అందజేశారు. ఈ చట్టం ఎన్ని కల సంఘం అధికారాలను హరించేలా ఉందని, చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్లకు అప్పగించారని, అది సరికాదని, చట్టానికి సవరణలు అవసరమని పేర్కొన్నారు. ఏడు కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంలో శాస్త్రీయత, సరైన ప్రాతిపదిక, విధానం లేదని తెలియజేశారు.
ప్రజల జీవన విధానానికి విఘాతం
కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన అన్ని మున్సిపాలిటీలు నిన్నటి వరకు గ్రామ పంచాయితీలుగానే ఉన్నాయని, అక్కడి రైతులు, కార్మికులు, కూలీలు, కుల వృత్తులు, గ్రామీణ జీవన విధానం ఆయా గ్రామాలలో ఇంకా సజీవంగా ఉన్నాయని బీజేపీ నేతలు తెలిపారు. ఆర్థిక వనరులు, పన్నుల విధానం ఇంకా కుదుటపడలేదని, మున్సిపల్ జీవనవిధానానికి ప్రజలు ఇంకా అలవాటు పడలేదని, అప్పుడే మున్సిపల్ కార్పొరేషన్లుగా మార్చడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని పేర్కొన్నారు. ఆయా గ్రామాలలో ప్రజలు ఇళ్లు నిర్మించుకోవాలంటే ఇక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ తిరుగాల్సి వస్తుందని, ఆస్తి పన్ను, వృత్తిపన్ను, తాగునీటి పన్ను, గృహనిర్మాణ అనుమతి చార్జీలు పెరిగి ప్రజలపై తీవ్ర భారం పడుతుందని వివరించారు.
మున్సిపాలిటీల ఏర్పాటులోనూ శాస్త్రీయత లోపించిదని పేర్కొన్నారు. పాలకవర్గాల కాలపరిమితి ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో రిట్ వేసిందని, దానిపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన కౌంటర్ అఫిడవిట్లో ఎన్నికల ముందు ప్రక్రియకు 141 రోజులు అవసరం ఉంటుందని రాసిందని వివరించింది. అయితే ఎన్నికల ముందు ప్రక్రియను 119 రోజులకు కుదిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. కానీ ఆ ప్రక్రియను హడావిడిగా మూడు వారాలోపే పూర్తి చేస్తూ ఎన్నికలు త్వరగా నిర్వహించాలని ఎన్నికల సంఘంపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని వివరించారు. దీనివల్ల వార్డుల విభజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళ ఓటర్ల గుర్తింపు , వార్డుల వారి ఓటర్ల లిస్టుల తయారీ, రిజర్వేషన్లు అన్నింటి విషయాలలో అవకతవకలు, అక్రమాలు, తప్పులు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment