సాక్షి, హైదరాబాద్: ‘ఉరి తీయబోయేటప్పుడు కూడా చివరి కోరిక అడుగుతారు. అలాంటిది అక్రమ నిర్మాణమని నోటీసు కూడా ఇవ్వకుండానే ఇంటిని కూల్చేస్తారా? నోటీసు జారీ చేయకుండా కూల్చేసే అధికారాన్ని మున్సిపల్ కమిషనర్లకు కట్టబెడతారా? అధికారంలో ఉన్నామని ఇష్టానుసారంగా చట్టాలు చేస్తామంటే కుదరదు. రాజ్యాంగం నిర్దేశించిన మేరకే ప్రభుత్వ చర్యలు ఉండాలి’ అని ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 174 (4), సెక్షన్ 178 (2) రెండింటినీ కలిపి చట్టాన్ని అన్వయించాలే గాని, ఒక సెక్షన్‌కే పరిమిత మై చర్యలు ఉండకూడదని స్పష్టం చేసింది. నోటీ సు జారీ చేయకుండానే అక్రమ నిర్మాణాలను కూ ల్చేసేలా మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 178 (2)ను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మా సనం సోమవారం విచారించింది. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది.
తెల్లారేసరికి ఇంటి ముందు బుల్డోజర్ ఉంటే ఆ ఇంటి యజమాని పరి స్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని కోర్టు పేర్కొంది. దీనిపై ప్రభుత్వ న్యాయవాది కల్పించుకుని ప్లాన్ ప్రకారం నిర్మాణం చేస్తామని భరోసా ఇచ్చి దాన్ని ఉల్లంఘిస్తే నోటీసు జారీ చేయాల్సిన అవసరం ఏముంటుందన్నారు. కోర్టు స్పందిస్తూ.. ఉరి శిక్ష విధించే కేసులోనైనా నేరస్తుల వాదనలు వినాలని రాజ్యాంగం నిర్దేశిస్తోందని, అలాంటిది అనుమతి పొందిన ప్లాన్‌ను అతిక్రమించి నిర్మిస్తే వాళ్ల వాదన వినేందుకు నోటీసు కూడా ఇవ్వరా అని ప్రశ్నించింది. రోడ్డు పక్కనో, ఫుట్‌పాత్‌లపైనో గుడిసెలను తొలగించేటప్పుడు కూడా అందులో నివాసమున్న వారికి నోటీసులివ్వాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పింది. ‘ఒక ప్లాన్ ప్రకారం ఒక అంతస్తుకు అనుమతి తీసుకుని, రెండో అంతస్తు నిర్మించారనుకుందాం. మున్సిపల్ కమిషనర్‌కు తెలియకుండానే రెండో అంతస్తు నిర్మాణానికి టౌన్ ప్లానింగ్ అధికారి అనుమతిచ్చారని అనుకుందాం. బుల్డోజర్లతో కూల్చేసే అధికారం మున్సిపల్ కమిషనర్లకు ఇవ్వడం ఎంత వరకు చట్టబద్ధత?’అని పేర్కొంది.
సాంకేతిక కారణాల సాకుతో అడ్డుకోవద్దు..
మంజూరు చేసిన ప్లాన్‌ను ఉల్లంఘించి నిర్మాణాలు చేసి వాటి విషయంలోనే ఆ విధమైన చర్యలు ఉంటాయని ప్రభుత్వ న్యాయవాది వివరించారు. చట్టాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు రిట్ పిటిషన్ దాఖలు చేయాలని, పిల్‌ను విచారించడానికి వీల్లేదని పేర్కొన్నారు. దీంతో ధర్మాసనం కల్పించుకుని.. సాంకేతిక కారణాలతో అడ్డుకునే ప్రయత్నాలు చేయొద్దని, ఒక ఇంటి నిర్మాణానికి అనుమతి పొందిన ప్లాన్‌లో మార్పు చేసి నిర్మాణం చేస్తే నోటీసు కూడా ఇవ్వకుండా ఏ చట్టం కింద కూల్చేస్తారని, ప్రభుత్వమూ రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని చీవాట్లు పెట్టింది.
అధికారంలో ఉన్నామని ఏకపక్షంగా అధికారాలను చెలాయిస్తామంటే ఎలాగని ప్రశ్నించింది. అయితే ఇటీవల అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆందోళన వెలిబుచ్చిందని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ గుర్తు చేయగా.. అది నిజమేనని, అయితే ఏకపక్షంగా నోటీసు కూడా ఇవ్వకుండా అక్రమ నిర్మాణాలతోపాటు అనుమతి పొంది.. ప్లాన్ డీవియేట్ అయ్యే నిర్మాణాలను కూడా కూల్చేసే అధికారాలను మున్సిపల్ కమిషనర్లకు ఇస్తారా అని ప్రశ్నించింది. ఈ వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారని, దీన్ని మరో రెండేళ్ల వరకు ఏర్పాటు చేయకపోతే ఇళ్ల నిర్మాణాల వివాదాలను ఎదుర్కొనే వాళ్ల పరిస్థితి ఏం కావాలని నిలదీసింది.
..కూల్చే అధికారం మీకెక్కడిది?
Published Tue, Mar 3 2020 1:49 AM | Last Updated on Tue, Mar 3 2020 1:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment