![Harish Rao Comments On New Municipal Act - Sakshi](/styles/webp/s3/article_images/2020/03/2/hh.jpg.webp?itok=1HIkA4zf)
సాక్షి, మెదక్: కొత్త మున్సిపల్ చట్టం ప్రజల చేతుల్లో బ్రహ్మాస్త్రమని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. దీనిపై అందరూ అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం ఆయన పర్యటించారు. అనంతరం స్థానిక పిల్లల పార్కులో ఏర్పాటు చేసిన సభలో హరీశ్ మాట్లాడారు. ప్రజలకు పారదర్శక పాలన అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ కొత్త మున్సిపల్ చట్టం తోపాటు పంచాయతీ రాజ్ చట్టాన్ని తెచ్చారన్నారు. ప్రస్తుతం కొత్త చట్టం అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు.
పట్టణాల్లో 75 గజాల లోపు స్థలంలో ఇల్లు నిర్మించేందుకు ఒక రూపాయి చెల్లించి అనుమతి తీసుకోవాలన్నారు. ఇంటికి నల్లా కనెక్షన్ కావాలన్నా ఒక్క రూపాయి చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. 75 గజాల నుంచి 250 గజాల స్థలంలో ఇల్లు నిర్మించే వారు సొంత డిక్లరేషన్ ఇస్తే అనుమతి ఇస్తారన్నారు. ఎవరికీ లంచం ఇవ్వొద్దని ప్రజలకు సూచించారు. కొత్త చట్టంతో ప్రజా ప్రతినిధులు, అధికారుల్లో జవాబుదారీతనం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
మున్సిపాలిటీల్లోని వార్డుల్లో హరితహారం కింద నాటిన మొక్కల్లో 85 శాతం బతికే విధంగా కౌన్సిలర్లు కృషి చేయాలని, అలా అయితేనే వారి పదవులు ఉంటాయని లేకపోతే ఊడుతాయని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ అక్షరాస్యత కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించారని చెప్పారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment