సాక్షి, హైదరాబాద్: కొత్త మున్సిపల్ చట్టంపై విపక్ష పార్టీల సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ చట్టం వల్ల బీసీలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని, బీసీల రాజకీయ భవిష్యత్తు మరింత ఆందోళనకరంగా మారుతుందని మండిపడ్డారు. శాసనమండలి సమావేశాల్లో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం మండలిలో మున్సిపల్ చట్టం–2019ను మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెట్టారు. అనంతరం ఈ చట్టంపై జరిగిన చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడారు. పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను భారీగా కుదించారని, దీంతో స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిధ్యం బాగా తగ్గిందన్నారు.
జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటూ నూతన చట్టంపైనే మాట్లాడాలన్నారు. ఈ క్రమంలో జీవన్‌రెడ్డి మండలి నుంచి వాకౌట్ చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మాట్లాడుతూ నూతన చట్టంలో కొన్ని సవరణలు చేయాలని బీజేపీ తరఫున ప్రభుత్వానికి సూచించినా స్పందన లేదన్నారు. పాలనా సౌలభ్యం కోసం రాజధాని చుట్టూ కొత్తగా ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. నూతన మున్సిపల్ చట్టం ఆమోదం తర్వాత మండలి చైర్మన్ సభను నిరవదికంగా వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment