సాక్షి, హైదరాబాద్: ‘‘అడవులను రక్షించుకోవాలి. గిరిజనుల హక్కులను కూడా పరిరక్షించాలి. పోడు భూముల వ్యవహారం కూడా తేల్చేయాలి. నేనే బయలుదేరుతా.. అన్ని జిల్లాలకు అన్ని డివిజన్లకు వెళ్తా. నేనొక్కడినే కాదు మొత్తం మంత్రివర్గాన్ని అధికారగణాన్ని, అటవీశాఖ ఉన్నతాధికారులను, సీఎస్, రెవెన్యూ సెక్రటరీని తీసుకెళ్లి ఇది పోడు భూమి.. ఇది మీ పట్టా అని ఇచ్చేస్తం. ఫైనల్ చేస్తం. ఆ తర్వాత ఒక్క అంగుళం కూడా అటవీ భూమి ఆక్రమణ కానివ్వం’’అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
‘‘పొరుగు రాష్ట్రం నుంచి గుత్తికోయలు వచ్చి అడవులను ఇష్టం వచ్చిట్లు నరికేస్తున్నరు. మన గిరిజనులు నష్టపోయే పరిస్థితి. కఠినంగా నియంత్రించాలంటే ఎక్కడ్నో ఓ కాడ భరతవాక్యం పాడాలి. ఆర్‌ఓఎఫ్‌ఆర్ కేంద్రం చట్టం నిబంధనల ప్రకారం హక్కులిస్తం. ఆ పేద గిరిజనులకు కూడా రైతు బం«ధు, రైతు బీమా రావాలి. స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, స్థానిక సంస్థల ప్రతినిధులను తీసుకెళ్లి ఏ తాలుకా కేంద్రంలో సమస్య ఉంటే అక్కడే బహిరంగంగా ప్రజాదర్బార్ నిర్వహించి సమస్య పరిష్కారం చేస్తం’’అని వెల్లడించారు. కొత్త పురపాలక చట్టంపై శుక్రవారం శాసనసభలో ప్రసంగం సందర్భంగా అడవులు తరిగిపోవడంపట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
ఆక్సిజన్ కూడా కొనుక్కుంటామా?
‘‘గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల గడ్డాలు పట్టుకున్నా మొక్కలు పెట్టలేదు. నిర్లక్ష్యం విహిస్తున్నరు. మనం పెంచకపోతే అమెరికా వాడు వచ్చి పెంచడు కదా. ఏ రోజుకైనా మనకు మనమే మేలుకోవాలి. భయంకరమైన ఎండలు రావొద్దంటే, రెండు మూడు డిగ్రీల ఎండను తగ్గించాలన్నా, మన భవిష్యత్ తరాలు గొప్పగా బతకాలన్నా మనమే ఏదైనా చేయాలి. భవిష్యత్ తరాలకు బతకగల సమాజాన్ని ఇవ్వాలి. ఆక్సిజన్ కొనుక్కుంటామా అధ్యక్షా. హైదరాబాద్‌లో ఆక్సిజన్ క్లబ్స్ వస్తున్నయి. సిగ్గు చేటు. బంజారాహిల్స్‌లో నా చిన్నప్పుడు ఫ్యాన్లు కూడా ఉండకపోయేవి. అంత చల్లగా ఉండేది హైదరాబాద్. అటువంటి హైదరాబాద్ నేడు కాంక్రీట్ జంగిలైపోయి ఎయిర్ కండిషన్ లేకుండా బతకలేని పరిస్థితి’’అని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment