సాక్షి, హైదరాబాద్ : కొత్త పురపాలక చట్టంపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న సర్కారు.. ఆలోగా నూతన చట్టాన్ని మనుగడలోకి తేవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొత్త మున్సిపల్ ముసాయిదా చట్టానికి తుదిరూపునిస్తోంది. పురపాలక చట్టాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చే దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం.. పట్టణ ప్రణాళిక విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతోంది. ప్రస్తుతం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ, నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలకు వేర్వేరు చట్టాలు అమలులో ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే టౌన్‌ప్లానింగ్ చట్టాన్ని యథావిధిగా ఉంచాలా లేక మున్సిపల్ చట్టంలో విలీనం చేయాలా అనే అంశంపై మల్లగుల్లాలు పడుతోంది. వాస్తవానికి గ్రామీణ, పట్టణాలను దృష్టిలో ఉంచుకొని టౌన్‌ప్లానింగ్‌కు ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టానికి సవరణలు చేస్తే సరిపోతుందా లేక మున్సిపల్ చట్టంలో విలీనం చేయాలా అనే విషయమై ప్రభుత్వ సలహాదారు, మాజీ సీఎస్ రాజీవ్‌శర్మ నేతృత్వంలోని కమిటీ చర్చించింది. అలాగే ఒకే పురపాలనా వ్యవహారాలను కూడా విభాగాలుగా వర్గీకరించే దిశగా అడుగులు వేస్తోంది.
ఒకట్రెండు రోజుల్లో తుదిరూపు...
జూన్‌లో పురపాలక సంఘాల ఎన్నికలు నిర్వ హించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆలోగా కొత్త చట్టాన్ని తీసుకురావాలని ఆదేశించిన నేపథ్యంలో పట్టణ, పురపాలకశాఖ ఉన్నతాధికారులతో రాజీవ్‌శర్మ, సీఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు సుదీర్ఘంగా చర్చించారు. ఇందులో ప్రధానంగా ప్రస్తుత చట్టంలో మార్పుచేర్పులు లేదా ఒకే చట్టం తీసుకురావడంపై చర్చ జరిగినట్లు తెలిసింది. ముఖ్యంగా మూడు చట్టాల స్థానంలో ఒకే ఏకీకృత చట్టాన్ని తేవాలనే అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం.
పారదర్శకత, అంకితభావం..
పురపాలనలో పారదర్శకతకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బల్దియా వ్యవహారాల్లో భాగంగా మారిన అవినీతిని అరికట్టే దిశగా కొత్త చట్టానికి రూపకల్పన చేస్తోంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనం పెంపొందించేలా చట్టంలో స్పష్టత ఇవ్వనుంది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల అమలులో పురపాలక సంఘాల చైర్మన్లు, నగరపాలక సంస్థల మేయర్లను బాధ్యులను చేయనుంది. గతేడాది ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ చట్టం తరహాలోనే స్థానిక సంస్థల ప్రతినిధులకు విధులు, బాధ్యతలను కట్టబెట్టనుంది. ఒకవేళ విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించినా, నిధుల దుర్వినియోగానికి పాల్పడినా ఉపేక్షించకుండా చట్టానికి పదునుపెడుతోంది. ఈ నేపథ్యంలోనే అవినీతికి చిరునామాగా మారిందని విమర్శలు ఎదుర్కొంటున్న టౌన్‌ప్లానింగ్ విభాగాన్ని పూర్తిస్థాయిలో సంస్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అడ్డగోలు నిర్మాణాలకు అవకాశమివ్వకుండా నిర్దేశిత రోజుల్లో ఇళ్ల పర్మిషన్లు ఇచ్చేలా నిబంధనలు తీసుకురానుంది. ఆలోగా ఉద్దేశపూర్వకంగా అనుమతి ఇవ్వకున్నా ఇచ్చినట్లుగా పరిగణించేలా చట్టంలో వెసులుబాటు కల్పించనుంది. సహేతుక కారణం చూపకుండా నిర్దేశిత గడువులోగా పర్మిషన్ జారీ చేయని అధికారికి జరిమానా విధింపు లేదా సస్పెండ్ చేసేలా చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్ణయించింది. అవినీతిరహిత పాలన అందించడమే కాకుండా పౌర సేవల కల్పనలో పారదర్శకత పాటించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఒకే గొడుగు కిందికి మున్సిపల్ చట్టాలు
Published Tue, May 28 2019 2:33 AM | Last Updated on Tue, May 28 2019 5:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment