సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ పార్టీలో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనంపై కాంగ్రెస్ పార్టీ వారే సమాధానపర్చుకోవాలని, వారికి వారే జవాబు చెప్పుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. ఆ విలీనం రాజ్యాంగ నిబంధనలకు లోబడే జరిగిందని స్పష్టంచేశారు. ఈ మధ్యే మూడింట రెండో వంతు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనమయ్యారని, వారు ప్రధానిని సైతం కలిశారని కేసీఆర్ గుర్తు చేశారు. గోవాలో కాంగ్రెస్‌పార్టీ వారే బీజేపీలో విలీనమైపోయారని పేర్కొన్నారు. ‘‘దేశవ్యాప్తంగా మీ పార్టీవారి మీద మీ ఆకర్షణ తగ్గిపోయి, మిమ్మల్ని వదిలిపెట్టి బయటకు వెళ్తే మమ్మల్ని నిందిస్తే ఎలా? మీకు మీరు కంట్రోల్ చేసుకోవాలి తప్ప ఇతరుల మీద పడి ఏడ్వడం కరెక్ట్ కాదు. మీరే కాపాడుకోవాలి. మీకు ఆకర్షణ ఉంటే, మీకు నాయకత్వ పటిమ ఉంటే ఎవరెందుకు పార్టీని వీడతారు’’అని ప్రశ్నించారు. ఏదో క్రైం జరిగినట్టు.. ఏదో రాజ్యాంగ వ్యతిరేక చర్య జరిగినట్టు కాంగ్రెస్ పార్టీ గోల చేస్తోందని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గురువారం శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రయత్నించగా.. సీఎం కేసీఆర్ ఘాటుగా బదులిచ్చారు. భట్టి విక్రమార్క తన ఆక్రోశం చెప్పుకుంటున్నారని, దానికి తాము బాధ్యులం కామని పేర్కొన్నారు. రాజ్యాంగ నిబంధనలకు లోబడి, షెడ్యూల్ 10 ప్రకారం కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనమైందని స్పష్టంచేశారు.
మేం ఎవరినీ చేర్చుకోలేదు
అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరతామని వచ్చినా చేర్చుకోలేదని సీఎం తెలిపారు. ఏ పార్టీ సభ్యుడూ తమ పార్టీలో చేరలేదని వివరించారు. తామే 88 మంది గెలిచామని, ఇద్దరు స్వతంత్రులు వచ్చి చేరారని, నాలుగింట మూడో వంతుకు మించిన మెజార్టీ తమకు అవసరం లేదని, ఆ విషయమే ఆ ఎమ్మెల్యేలకు చెప్పామని వెల్లడించారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం కాంగ్రెస్ పార్టీలో చీలిక వస్తే తానేం చేయగలనని ప్రశ్నించారు. ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉందని, అయినా కాంగ్రెస్‌వారు పదేపదే ప్రస్తావిస్తున్నారు కాబట్టి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తనకు ఉన్నందున స్పందించానని చెప్పారు. ‘‘మీకు అన్యాయం జరిగిన మాట వాస్తవమండి.. మేమేం చేయాలి? కాపాడుకునే శక్తి లేకపోతే.. మీ సభ్యులే వికర్షణకు గురైతే దానికి మేమేం చేయాలి’’అని ప్రశ్నించారు. ఈ దేశంలో ఎవరైనా మూడింట రెండో వంతు పార్టీ చీలిపోయి వస్తే చేర్చుకోరా? విలీనం చేసుకోరా? దాని ప్రకారమే తమరు ఉత్తర్వులిచ్చారు.. బులెటిన్ జారీ చేశారు అని స్పీకర్‌ను ఉద్దేశించి సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దీనికి తమ మీద పడి ఏడ్వడం ఎందుకుని కాంగ్రెస్ పార్టీని నిలదీశారు. దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా ఉంటుందని, ఇందులో ఎవరికీ సందేహం అవసరంలేదని వ్యాఖ్యానించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ దేశానికి రోల్ మోడల్‌గా ఉండాలని, పార్టీ ఫిరాయింపులు సరికాదని భట్టి విక్రమార్క పేర్కొనగా సీఎం ఈ మేరకు బదులిచ్చారు.
బ్యాలెట్‌తో కూడా మేమే గెలిచాం..
‘‘శాసనసభ ఎన్నికలకు ముందు వీళ్లు ఎన్ని చెప్పాలో అన్ని చెప్పారు.. ఇదే శాసనసభలో మాట్లాడారు.. సస్పెండ్ చేయించుకున్నరు.. బాయ్‌కాట్ చేయించుకున్నరు.. గవర్నర్ గారి మీద దాడులు జరిగినయి.. ప్రజల ముందుకు వెళ్లి 3/4 మెజారిటీతో గెలిచి వచ్చినం. ఆ తర్వాత నెల రోజులు ఈవీఎంల గోల్‌మాల్ అని గోలపెట్టారు. బ్యాలెట్‌తో సర్పంచులను గెలిచినం. 32 జిల్లా పరిషత్‌లను బ్యాలెట్‌తో గెలుచుకున్నం. దానికి ఏం చెబుతారు’’అని కాంగ్రెస్ పార్టీని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. 83 శాతం గ్రామ పంచాయతీలు, 92 శాతం మండలాలను గెలిచామని గుర్తుచేశారు.
కాంగ్రెస్ తలోదారి..
టీఆర్‌ఎస్‌లో 12 మంది కాంగ్రెస్ శాసనసభ్యుల విలీనానికి నిరసనగా కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమంలో ఆ పార్టీ నేతల అనైక్యత బయటపడింది. అందరూ ఏకతాటిపై ఉండకుండా తలోతీరుగా వ్యవహరించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ సభ్యులు శ్రీధర్‌బాబు, సీతక్క, పొడెం వీరయ్య నల్ల కండువాలు ధరించి సభకు హాజరయ్యారు. సభలో చర్చ జరుగుతున్న సమయంలో సేవ్ డెమోక్రసీ అని రాసిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిలబడి నిరసన తెలిపారు. వీరితో కలిసే సభలో ప్రవేశించిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చివరి వరుసలోఒంటరిగా కూర్చొని నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. వివిధ బిల్లులపై చర్చ జరుగుతున్న సందర్భంగా టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనంపై మాట్లాడేందుకు భట్టి విక్రమార్క విఫలయత్నం చేశారు.
టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనం అంశం కోర్టు పరిధిలో ఉండడంతో సభలో చర్చించడం సరికాదని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి బదులిచ్చారు. సభా నిబంధనల ప్రకారం అజెండాలోని అంశాలపై మాత్రమే మాట్లాడాలని పేర్కొంటూ.. భట్టి విక్రమార్క మట్లాడేందుకు ప్రయత్నించిన ప్రతిసారి మైక్ కట్ చేశారు. ఎవరు ఏ పార్టీలో గెలిచినా చివరకు టీఆర్‌ఎస్‌లోనే చేరతారని ఈ సందర్భంగా భట్టి విమర్శలు చేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, సీఎల్పీ లీడర్‌గా తాము లేవనెత్తిన అంశాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా, మైక్ ఇవ్వకుండా అణగదొక్కే ప్రయత్పం చేశారని మండిపడ్డారు. న్యాయస్థానం పరిధిలో అంశం ఉందని పేర్కొన్న స్పీకరే విలీనం ఉత్తర్వులు ఎలా జారీచేశారని ప్రశ్నించారు. సభలో తాము గుడ్డిగా కూర్చోలేమన్నారు. సభలో మాట్లాడేందుకు అవకాశం కల్పించడం లేదని, అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నారని, సభను మీరే నడుపుకోవాలని పేర్కొంటూ ముగ్గురు సహచరులతో కలిసి భట్టి వాకౌట్ చేశారు. ఆ సమయంలో సభలోనే ఉన్న మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాత్రం వాకౌట్ చేయకుండా అక్కడే ఉండిపోయారు.
ఉన్నోళ్లను కాపాడుకోండి: ఎర్రబెల్లి
‘‘ఉన్నోళ్లు కూడా పోయేటట్టున్నరు. ఒకరు బయట ఉన్నరు.. ఇంకొకరు దూరంగా కూర్చున్నరు. ఆ ఆరుగురినైనా కాపాడుకొండ్రి’’అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేశారు. సభలో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండో సవరణ బిల్లును ప్రవేశపెట్టి మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలుపుతుండడంతో ఎర్రబెల్లిపై ఈ విధంగా స్పందించారు. కాగా, మండల పరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికలకు అడ్డుగా ఉన్న నిబంధనలను మారుస్తూ పంచాయతీరాజ్ చట్టానికి సవరించడానికి జారీ చేసిన ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లుకు ఈ సందర్భంగా సభ ఆమోదం తెలిపింది.
కొత్త మున్సిపల్ చట్టాల బిల్లును ప్రవేశపెట్టిన కేసీఆర్
కొత్త మున్సిపల్ చట్టాల బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం శాసనసభ ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు లక్ష్యాలు, ఉద్దేశాల గురించి ఆయన శుక్రవారం శాసనసభ, శాసనమండలిలో ప్రసంగించనున్నారు. అనంతరం చర్చ నిర్వహించి బిల్లుకు ఆమోదముద్ర వేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment