సర్జరీ జరూర్‌.. తప్పు చేస్తే తప్పదు దండన | KCR On New Municipal Act In Assembly | Sakshi
Sakshi News home page

సర్జరీ జరూర్‌.. తప్పు చేస్తే తప్పదు దండన

Published Sat, Jul 20 2019 1:13 AM | Last Updated on Sat, Jul 20 2019 5:15 AM

KCR On New Municipal Act In Assembly - Sakshi

ఈ రోజున్న పరిస్థితుల్లో అక్రమాలను అరికట్టాలంటే ట్యాబ్లెట్‌తోనో, టానిక్‌తోనో సాధ్యమయ్యేలా లేదు. శస్త్రచికిత్స అవసరముంది. అందుకే కొత్త మున్సిపల్‌ చట్టాన్ని కఠినంగా తెస్తున్నం. ఇందులో ప్రతి వాక్యం నేను రాయించిందే. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరి బాధ్యతను వారు నిర్వర్తించాల్సిందే. లేకుంటే వారి ఉద్యోగాలు పోతాయ్‌. ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకోవాల్సిందే.

నియంత్రణ కోసమే.. 
ఇంట్లో తల్లి పిల్లలను అనురాగంతో గారాబంగా పెంచుతది. అదే తల్లి చికాకు కలిగిస్తే చెంప మీద చెల్లుమని కొడ్తది. పద్దతి ప్రకారం ఉండాలని కొడ్తది. ప్రభుత్వం కూడా అట్లనే.

ఉద్యోగం ఊడుద్ది.. 
వార్డులో మొక్కలను సంరక్షించే బాధ్యత ఆ వార్డు కౌన్సిలర్‌ది. ప్రతివార్డుకు ఒక మున్సిపల్‌ ఆఫీసర్‌ను నియమిస్తారు. 85 శాతం మొక్కలు బతకపోతే కౌన్సిలర్‌ పదవి, ఇన్‌చార్జీ అధికారి ఉద్యోగం పోతది.

రియల్‌ అడ్మినిస్ట్రేషన్‌ 
ఆర్నెల్ల నుంచి వరుసగా ఎన్నికలొచ్చాయి. ఆగస్టు ఐదో పదో 15 తారీఖుకు మునిసిపల్‌ ఎన్నికలు అయిపోతయి. 15 నుంచి రియల్‌ టైం అడ్మినిస్ట్రేషన్‌ చూపిస్తం. అద్భుతమైన పరిపాలన సంస్కరణలు తీసుకొస్తం. 

ఒక్కరితో కాదు.. 
ఒక కేసీఆరో ఒక మున్సిపల్‌ మంత్రో ఎమ్మెల్యేనో పనిచేస్తే కాదు. ఏ ఊరి సర్పంచ్‌ ఆ ఊర్లో పనిచేయాలి. బహుముఖంగా పనిచేయాలి. కాని ఏకముఖంగా ఒక వ్యక్తి పనిచేస్తే జరిగే పనికాదు. 

25 రెట్లు జరిమానా.. 
స్వీయ ధ్రువీకరణ ద్వారా ఆస్తి పన్నుల మదింపు విధానం పెట్టినం. మున్సిపల్‌ సిబ్బంది ఏ ఇంటి కొలతలు స్వీకరించరు. ఏ ఇంటి యజమాని స్వయంగా తన ఇళ్లు ఇన్ని చదరపు గజాలుందని స్వీయ ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటది. తప్పుడు ధ్రువీకరణ ఇస్తే 25 రేట్లు జరిమానా వేస్తం.  

సాక్షి, హైదరాబాద్‌ : ‘ఈ రోజున్న పరిస్థితుల్లో అక్రమాలను అరికట్టాలంటే ట్యాబ్లెట్‌తోనో, టానిక్‌తోనో సాధ్యమయ్యేలా లేదు. శస్త్రచికిత్స అవసరముంది. అందుకే కొత్త మున్సిపల్‌ చట్టంలో కఠినమైన నిబంధనలు తెస్తున్నాం. కొంత కాఠిన్యం ఉంటేకాని పనులు జరగవు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పూర్తి అవగాహనతో పూర్తి స్పష్టతతో లక్ష్యాలు నిర్దేశిం చుకుని స్పష్టమైన గమ్యాన్ని ఆశించి ఈ చట్టాన్ని పెడుతున్నా. ఇందులో ప్రతి వాక్యం నేను రాయిం చిందే. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరి బాధ్యతను వారు నిర్వర్తించాల్సిందే. లేకుంటే వారి ఉద్యోగాలు పోతాయ్‌. ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాల్సిందే’అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ‘పారదర్శకత తేవడం, మున్సిపల్‌ వ్యవస్థను అనినీతి రహితం చేయడమే కొత్త మున్సిపల్‌ చట్టం పరమార్థం. ఈ రోజు మున్సిపాలిటీల్లో ఎలాంటి పరిస్థితి నెలకొని ఉందో, ప్రజలు పడుతున్న ఇబ్బందులేంటో మనందరికీ తెలుసు’అని ఆయన అన్నారు. కొత్త మున్సిపల్‌ చట్టం ఉద్దేశ్యాలు, లక్ష్యాలను వివరిస్తూ శుక్రవారం రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశంలో ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు.

పదవులు, ఉద్యోగాలు గల్లంతే!
‘పట్టణాల్లో, గ్రామాల్లో పచ్చదనం పెరిగి తీరాలి. మొక్కలు పెంచమని ఇప్పటి వరకు గడ్డాలు పట్టి బతిమాలినం. ఇక బతిమాలం. పంచాయతీరాజ్‌ చట్టంలో బలమైన నిబంధనలు పెట్టినం. కొత్త పంచాయతీ కార్యదర్శులకు మొత్తం జీతం కాకుండా రూ.15 వేలే జీతం పెట్టినం. మూడేళ్లు ఆయన గ్రామంలో బాగా చేసి, 85% పచ్చదనం తీసుకొస్తే ఆయన పర్మినెంట్‌ అవుతడు. లేకుండా ఇంటికిపోతడు. పచ్చదనం, పారిశుద్ధ్యం సర్పంచ్‌ బాధ్యత కూడా. విస్మరిస్తే ప్రభుత్వం ఒప్పుకోదు. పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం సర్పంచ్‌గారి పదవి పోతది. ఇప్పుడు చెట్లు ఎలా పెరగవో మేమూ చూస్తం. ఇక చెట్లు పెరుగుతయి. లేకుంటే ఆయన (పంచాయతీ సెక్రటరీ) ఉద్యోగం పోతది. ఈయన (సర్పంచ్‌) పదవి పోతది’అని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. సర్పంచ్‌ను కలెక్టర్లు సస్పెండ్‌ చేస్తే మంత్రి స్టే ఇచ్చే విధానాన్ని తొలగించామన్నారు.

పాలనలో సాంకేతిక పరిజ్ఞానం వీలైనంత ఎక్కువగా వినియోగించడం, సేవలకు నిర్ణీత గడువు పెట్టుకోవడం, తప్పుడు ధ్రువీకరణ ఇచ్చినవారి మీద భారీగా జరిమానాలు విధించడం వంటివి కొత్త చట్టంతో జరుగుతాయన్నారు. ‘మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి ఒక్కరూ ఈ చట్టాన్ని చదువుకోవాలి. ఇష్టం లేకుంటే పోటీ చేయొద్దు’అని సీఎం సూచించారు. ‘ఇంట్లో తల్లి పిల్లలను అనురాగంతో గారాబంగా పెంచుతది. తినకపోతే చందమామను చూపించి ఇంకో ముద్ద తినిపిస్తది. అదే తల్లి ఎక్కువ చికాకు కలిగిస్తే చెంప మీద చెల్లుమని కొడ్తది. ఆ పిల్లగాడికి దెబ్బతగలాలని కొట్టదు. నియంత్రణలో, పద్దతిప్రకారం ఉండాలని కొడ్తది. ప్రభుత్వం కూడా అట్లనే’అని కేసీఆర్‌ ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని తెలిపారు. రాష్ట్రంలో ఒక్క మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ కార్యాలయం, ప్రభుత్వ శాఖలు, కొన్ని జిల్లాల కలెక్టర్లు, హెచ్‌ఓడీ కార్యాలయాలు కరెంట్‌ బిల్లులు కట్టట్లేదని, ఇకపై కరెంటు బిల్లు, నీటి బిల్లులను నెలనెలా కట్టాలన్నారు. లేదంటే సంబంధిత మున్సిపల్‌ కమిషనర్‌ ఉద్యోగం ఊడడం ఖాయమన్నారు.

కౌన్సిలర్‌దే బాధ్యత!
‘జిల్లా కలెక్టర్‌ చైర్మెన్‌గా పచ్చదనం కమిటీలు ఏర్పాటు చేస్తున్నం డీఎఫ్‌ఓ, మున్సిపల్‌ కమిషనర్, చైర్‌పర్సన్‌లతో ఉండే ఈ కమిటీ ఏ వార్డులో ఎన్ని మొక్కలు పెట్టాలో నిర్ణయిస్తది. ఆ వార్డులో మొక్కలను సంరక్షించే బాధ్యత ఆ వార్డు కౌన్సిలర్‌ది. ప్రతివార్డుకు ఒక మున్సిపల్‌ ఆఫీసర్‌ను నియమిస్తారు. 85% మొక్కలు బతక్కపోతే కౌన్సిలర్‌ పదవి, ఇన్‌చార్జీ అధికారి ఉద్యోగం పోవడం ఖాయం. సస్పెన్షన్‌ కాదు.. సర్వీస్‌ నుంచి తొలగిస్తాం. 60ఏళ్ల అనుభవం ఏం చెబుతోంది. అడవులు ఎందుకు తరిగిపోయాయి? మనమందరం చూస్తుండగానే అడవులు మాయమవుతున్నాయి. మూడేళ్లలో తెలంగాణలో అద్భుతం జరిగిపోతది. అందుకే ఈ కఠిన నిబంధనలు తెచ్చినం. సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కూడా దీనికి అతీతం కాదు. ఎవరికి వారు స్వయ నియంత్రణపెట్టుకుని నా వార్డు కోసం, నా పట్టణం కోసం నా ప్రజల కోసం పనిచేయాలనుకుని పని చేయకపోతే ఈ దేశం బాగుపడదు. ఓ కేసీఆరో, ఓ మున్సిపల్‌ మంత్రో, ఓ ఎమ్మెల్యేనో పనిచేస్తే కాదు. ఏ ఊరి సర్పంచ్‌ ఆ ఊర్లో పనిచేయాలి. ఏ వార్డు కౌన్సిలర్‌ ఆ వార్డులో పనిచేయాలి’అని కేసీఆర్‌ తెలిపారు.

పేదల ఇళ్లకు అనుమతి అవసరం లేదు 
పట్టణ నిరుపేదలకు సీఎం కేసీఆర్‌ శుభవార్త వినిపించారు. 75 చదరపు గజాల వరకు నిర్మిత స్థలంలో జీ+1 (గ్రౌండ్‌ ఫ్లోర్‌+ఒకటో అంతస్తు) ఇంటి నిర్మాణానికి అనుమతి అవసరం లేదని ప్రకటించారు. దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు.. ఒక్క రూపాయి రుసుం చెల్లించి మున్సిపాలిటీలో ఇంటిని నమోదు చేసుకోవాలని, దీంతో గ్యాస్‌ కనెక్షన్, రేషన్‌కార్డు, ఇంటి నంబర్, నల్లా కనెక్షన్‌ వంటి సదుపాయాలు సులువుగా పొందవచ్చునన్నారు. మున్సిపల్‌ రికార్డుల్లో ఇల్లు నమోదై ఉంటే వీరికి లబ్ధి చేకూర్చడంæ.. ప్రభుత్వ యంత్రాంగానికి, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సులువవుతుందన్నారు. వీరి నుంచి ఏడాదికి రూ.100 ఆస్తి పన్ను మాత్రమే వసూలు చేస్తామన్నారు. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సీహెచ్‌ మల్లారెడ్డిల సూచన మేరకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు.

స్థానిక సంస్థలకు నిధుల వరద
పంచాయతీరాజ్‌ సంస్థలకు తరహాలోనే పురపాలికలకు సైతం రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేటాయించనున్నామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసులకు మేరకు కేంద్రం నుంచి గ్రామాలకు రూ.1,600 కోట్ల నిధులు వస్తుండగా, సమాన మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వ నిధులు సైతం రూ.1,600 కోట్లు కేటాయించాలని పంచాయతీరాజ్‌ చట్టంలో నిబంధనలు పొందుపర్చామన్నారు. అదే తరహాలో జీహెచ్‌ఎంసీతో కలిసి రాష్ట్రంలోని పురపాలికలకు కేంద్రం నుంచి రూ.1,030 కోట్లు నిధులు వస్తుండగా, అంతే మొత్తంలో రూ.1,030 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించేలా మున్సిపాలిటీ చట్టంలో నిబంధనలు పొందుపరిచామన్నారు. ఒక ఏడాది పూర్తి స్థాయిలో నిధులు కేటాయించని పక్షంలో వచ్చే ఏడాది బకాయిల రూపంలో చెల్లించేలా పకడ్బందీగా కొత్త చట్టం రూపొందించామన్నారు. కేంద్ర, రాష్ట్ర నిధులు కలిపి ఏటా గ్రామాలకు రూ.3,200 కోట్లు, పట్టణాలకు రూ.2,060 కోట్లు వస్తాయన్నారు. ఈ నిధుల ఖర్చుపై త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. 500 జనాభా ఉండే చిన్న గ్రామ పంచాయతీకి రూ.5లక్షలకు తగ్గకుండా నిధులొస్తాయని, పెద్ద గ్రామ పంచాయతీలకు కోట్లలో వస్తాయని సీఎం వెల్లడించారు. ఏటా రూ.3వేల కోట్ల జాతీయ ఉపాధి హమీ పథకం నిధులు ఖర్చు చేసే అధికారం పంచాయతీరాజ్‌ సంస్థల ప్రజాప్రతినిధులకు మాత్రమే ఇచ్చామన్నారు.

నిరంతరం ఉత్తమస్థితి కోసం తపన
‘అత్యుత్తమ స్థితి కోసం తపన (క్వెస్ట్‌ ఫర్‌ ఎక్సలెన్సీ), సంస్కరణలు నిరంతర ప్రక్రియలు. సమస్యలు అనంతమైనవి. మానవజాతి భూగోళంపై ఉన్నంత కాలం మానవ సంబంధ సమస్యలుంటాయి. అత్యుత్తమ స్థితి కోసం తపన కొనసాగుతుంది. తపనతో అత్యుత్తమ స్థితిని చేరుకుంటాం. ఆ తర్వాత మరో తపన ఉంటది. మరో అత్యుత్తమ స్థితి ఉంటది. తపనకు అంతు ఉండదు. అత్యుత్తమ స్థితి ఓ చోట ఆగదు. అమెరికా లాంటి దేశంలో, అభివృద్ధి బాగా జరిగిన యూరోప్‌ దేశాల్లో కూడా సమస్యలున్నయి. 30 ఏళ్ల కిందటి చట్టం ఇప్పుడు సరిపోకపోవచ్చు. సమకాలిన పరిస్థితికి అనుగుణంగా మార్పులు చేయాల్సిన అవసరముంటది. ఆ సోయితోనే – క్వెస్ట్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌– దిశగా పురపాలికలు పనిచేయాలని కోరుతూ ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది’అని సీఎం స్పష్టం చేశారు. 

స్థానిక సంస్థలకు అధికారిలిస్తే ఏం జరిగింది?
ఉద్దేశపూర్వకంగానే కలెక్టర్లకు విశేషాధికారాలు కల్పించాం. కొందరికి అభ్యంతరాలుండవచ్చు. కచ్చితంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో కఠినంగా ఉండాల్సిన అవసరముంది. ప్రభుత్వం జిల్లాకు వెళ్లినప్పుడు కేంద్ర బిందువు జిల్లా కలెక్టరేట్‌. కలెక్టరేట్‌ పవర్‌ఫుల్‌గా ఉండాల్సిందే. స్థానిక సంస్థల అధికారాలను హరించడమేనని కొందరు కొత్త భాష్యాలు చెబుతున్నరు. ఇప్పటివరకు అధికారాలిచ్చినం. ఏం జరిగింది అధ్యక్షా?’అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నంచారు. నగర శివార్లలోని నిజాంపేట్‌ గ్రామ పంచాయతీలో అరాచకాలు జరిగాయని, ఇప్పుడు కనీసం ఫైర్‌ ఇంజన్లు కూడా తిరిగే పరిస్థితి అక్కడ లేదని ఉదాహరణగా చెప్పారు. వరదలొస్తే నిజాంపేటలో సహాయక చర్యలు చేపట్టలేని భయంకర పరిస్థితి ఉందన్నారు. అక్కడున్న ప్రజలకు భద్రత లేదన్నారు. గతంలో దీన్ని మున్సిపాలిటీగా మారిస్తే వెంటనే స్టే తెచ్చుకునేవారన్నారు. శాసనసభలో చట్టం ద్వారా ఇప్పుడు నిజాంపేట్‌ను మున్సిపాలిటీ చేశామన్నారు. హైదరాబాద్‌ వంటి భారీ పట్టణం చుట్టూ పక్కల విచ్చలవిడిగా అభివృద్ధి జరగకూడదని, నియంత్రణతో జరగాలన్నారు. కఠినంగా ఉంటేనే నియంత్రణ సాధ్యమన్నారు.

అన్ని మున్సిపాలిటీలకు సమాన హోదా
కొత్త చట్టం రాకతో రాష్ట్రంలో 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లుంటాయని కేసీఆర్‌ తెలిపారు. నగర పంచాయతీలు ఉండవన్నారు. మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్‌లు, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఆథారిటీ సంస్థలు మాత్రమే ఉంటాయన్నారు. అన్నీ మున్సిపాలిటీలకు సమాన హోదా, నిధులు ఇవ్వడం జరుగుతుందని, అన్నింటికీ ఒకటే చట్టం ఉంటుందన్నారు. కలెక్టర్లకు బాధ్యతతోపాటు విశేషాధికారాలు కల్పించామన్నారు. కలెక్టర్లకు నిధులతో పాటు శక్తివంతమైన అధికారాలిచ్చామన్నారు.

ఎన్నికల కమిషన్‌ అధికారాల్లో జోక్యం చేసుకోం
‘ఎన్నికల తేదీని నిర్ణయించే అధికారాన్ని ప్రభుత్వం దగ్గర పెట్టుకుంది. ఎన్నికల సంఘానికి స్వయంప్రతిపత్తి ఉంది. దీన్ని గౌరవించి ఎన్నికల నిర్వహణలో జోక్యం చేసుకోం. కేవలం తేదీ వరకు మాత్రమే కలగజేసుకుంటం. ప్రభుత్వం పరిపాలన యంత్రాంగం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. వరదలు, కరువులు, ప్రకృతి వైపరీత్యాలు, పండగలు, పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల తేదీల వరకు మాత్రమే ప్రభుత్వం చెప్తది. మిగతా విషయాల్లో సర్కారు జోక్యం ఉండదు’అని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

జాప్యమైతే అనుమతి వచ్చినట్లే
‘పౌరులకు స్నేహపూర్వక పట్టణ విధానమిది. పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. అనుమతుల కోసం మున్సిపల్‌ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరముండదు. 500 చదరపు మీటర్ల çస్థలం, 10 మీటర్ల ఎత్తు వరకు నిర్మించే కట్టడాల అనుమతి కోసం మున్సిపల్‌ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. వేధింపులుండవు, మానవ ప్రమేయముండదు. పూర్తిగా ఆన్‌లైన్‌లో అనుమతులిస్తారు. నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లయితే ఆన్‌లైన్‌లో అనుమతి ఆయన ఇంటికే వెళ్తుంది. దీనికి నిర్ణీత కాలపరితి పెడుతున్నాం. ఆలోగా అనుమతి రాకపోతే అనుమతి వచ్చినట్లే భావించి నిర్మాణం ప్రారంభించుకోవచ్చు’అని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

అక్రమ కట్టడాలు ప్రారంభిస్తే కూల్చివేతే!
‘తప్పు చేయకూడదన్న భయం తేవడం కోసం అక్రమ కట్టడాలకు భారీ జరిమానాలు పెట్టాం. అక్రమ కట్టడం నిర్మించడం ప్రారంభిస్తే నోటిసులు ఇవ్వకుండా తక్షణమే కూల్చివేస్తామని చట్టంలో పెట్టాం. ఎంత ఖర్చు పెట్టారో చూడం. అక్రమ కట్టడాలపై చాలా సందర్భాల్లో హైకోర్టు చేసిన వాఖ్యాలతో ప్రభుత్వం తప్పు లేకపోయినా తలదించుకోవాల్సి వచ్చింది. బీఆర్‌ఎస్‌పై హైకోర్టు చేసిన వాఖ్యాలతో తలకొట్టేసుకున్నంత పనైంది. అక్రమ కట్టడాలను రాష్ట్రంలో ఎట్టి పరిస్థితిలో అనుమతించం. తప్పు చేస్తే లాభపడతాం అనే ఉద్దేశం నుంచి తప్పు చేస్తే ఇబ్బందులు తప్పవనే భయం ప్రజల్లో రావాలి’అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

స్వీయ ధ్రువీకరణతో ఆస్తి పన్నుల మదింపు
‘స్వీయ ధ్రువీకరణ ద్వారా ఆస్తి పన్నుల మధింపు విధానం తీసుకొచ్చాం. మున్సిపల్‌ సిబ్బంది ఏ ఇంటి కొలతలూ స్వీకరించరు. ఏ ఇంటి యజమాని స్వయంగా తన ఇళ్లు ఇన్ని చదరపు గజాలుందని స్వీయ ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటది. అయితే ఎప్పుడైనా కలెక్టర్‌ నేతృత్వంలోని ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం పరిశీలించినపుడు.. తప్పుడు ధ్రువీకరణ ఇచ్చినట్లు తేలితే 25 రెట్లు జరిమానా వేస్తాం. ప్రజలను నమ్మి విశ్వసించి ఈ నిబంధన పెడుతున్నం. లంచాలకు, వేధింపులకు గురికావద్దని ప్రజలకే అధికారాలిస్తున్నాం. అలాంటప్పుడు అధికార దుర్వినియోగం చేయకూడదు. స్వీయ ధ్రువీకరణను ఓ భగవద్గీత పవిత్ర గ్రంథం అనుకోవాలి. పౌర బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి’అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

కలెక్టర్లు సులువుగా పర్యవేక్షించగలరు
పరిపాలన సంస్కరణలో భాగంగా 33 జిల్లాలు చేసుకున్నం. నా లెక్క ప్రకారం ఇంకొక జిల్లా కూడా ఏర్పడాల్సిఉంది. జనాభా తగ్గాలని హైదరాబాద్, సికింద్రాబాద్‌ జిల్లాలు కావాలని నాకుంది. కానీ హైదరాబాద్‌కున్న గొప్పఖ్యాతి, మహత్తును దృష్టిలో ఉంచుకుని నగరాన్ని విడదీయవద్దని అందరూ అనడంతో హైదరాబాద్‌ను అలానే ఉంచాం. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో రెండు, మూడు, నాలుగు మున్సిపాలిటీలు మాత్రమే ఉన్నాయి. కలెక్టర్లు సులువుగా పర్యవేక్షణ చేయగలరు’అని సీఎం తెలిపారు.

ఆగస్టు 15 నుంచి అద్భుత పాలన
‘ఆర్నెల్ల నుంచి వరుసగా ఎన్నికలొస్తున్నాయి. ఆగస్టు ఐదో, పదో, 15 తారీఖునో మున్సిపల్‌ ఎన్నికలు అయిపోతాయి. ఆగస్టు 15 నుంచి రియల్‌ టైం అడ్మినిస్ట్రేషన్‌ చూపిస్తాం. అద్భుతమైన పరిపాలన సంస్కరణలు తీసుకొస్తాం. జిల్లాల్లో పరిపాలన ఎలాగుండాలి? సంక్షేమ కార్యక్రమాలు ఎవరు చూడాలి? ఉన్న ఐఏఎస్‌ అధికారులను ఎలా వాడుకోవాలి అన్న అంశాలపై పరిపాలన సంస్కరణల కమిటీ పనిచేస్తోంది. దేశమంతా మన దగ్గర నేర్చుకునేలా అద్భుతమైన పరిపాలన సంస్కరణలు తీసుకొస్తాం’అని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement