అసెంబ్లీలో సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తమ విజయం ఖాయమని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తమ అమ్ముల పొదిలో ఉన్న అ్రస్తాలు తీస్తే విపక్షాలు గాలికి కొట్టుకుపోవాల్సిందేనని అన్నారు. ఈసారి ఎన్నికల్లో గతంలో కంటే 7–8 సీట్లు ఎక్కువ వస్తాయని చెప్పారు. అసెంబ్లీలో ఆదివారం ‘రాష్ట్ర ఆవిర్భావం–సాధించిన ప్రగతి’పై జరిగిన చర్చకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై ఆయన మండిపడ్డారు. తనకు పిండం పెడ్తామని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారని, ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పిండం పెడ్తారో చూద్దాం అంటూ సవాల్ విసిరారు.
‘రాహుల్ ఎన్నికల సభలో మోదీపై చేసిన వ్యాఖ్యకు జైలు శిక్ష వేశారు. మరి మీరు ఇక్కడ పిండం పెడ్తామంటూ పిచ్చికూతలు కూస్తున్నారు. మనసుకు బాధేసినా పోలీసులను ఉసిగొల్పకుండా సంయమనం పాటిస్తున్నాం’అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ అంటే ప్రధాని మోదీకి ఎందుకు వ్యతిరేకమో తెలియదని, తల్లిని చంపి పిల్లను బతికించారంటూ వ్యాఖ్యానాలు చేశారని గుర్తుచేశారు. దేశం ప్రగతి పథంలోకి వెళ్లకుండా అడ్డుపడుతున్నారని సీఎం విమర్శించారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
రైతుబంధు మరింత పెంపు..
‘కర్ణాటకలో కాంగ్రెస్ అలవికాని హామీలు ఇచ్చింది. వాటిని అమలు చేయలేక అక్కడి సీఎం ఎస్సీ, ఎస్టీ ఫండ్స్ మళ్లిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లలో ఇచ్చే పెన్షన్ ఎంత?.. తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ.4 వేలు పెన్షన్ ఇస్తారా? మేం అలవికాని హామీలివ్వం. గత ఎన్నికల్లో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ చెబితే.. మేము రూ.లక్ష వరకు చేస్తామని చెప్పాం. మేం 80 సీట్లు గెలిస్తే వాళ్లు 19 సీట్లు గెలిచారు.
రెండేళ్ల నుంచి పెన్షన్ రూ.2 వేలు ఇస్తున్నాం. మొదట వెయ్యి ఆ తర్వాత రూ.2 వేలు ఇచ్చాం. కల్యాణలక్ష్మిలో మొదట రూ.50 వేలు.. ఆ తర్వాత రూ.లక్ష ఇచ్చాం. గొర్ల యూనిట్లకు సైతం రూ.1.75 లక్షలకు పెంచాం. రైతుబంధు ఎకరాకు రూ.4 వేలతో మొదలు పెట్టి రూ.5 వేలకు పెంచాం. దీనిని మరింత పెంచుతాం. రుణమాఫీ అమలుతో కాంగ్రెస్ దిగాలు పడింది. నెల రోజుల్లో రుణమాఫీ సొమ్ము మొత్తం రైతుల ఖాతాల్లో జమ చేస్తాం..’అని కేసీఆర్ చెప్పారు.
కరెంటు గోల్‌మాల్ చేస్తారు..రైతుబంధు రాదు
‘ఉన్న తెలంగాణను ఊడగొట్టింది ముంచింది కాంగ్రెస్ పార్టీయే. ఇదే కాంగ్రెస్ పార్టీ, జవహర్‌లాల్ నెహ్రూయే. చివరకు 1969 ఉద్యమంపై కర్కశంగా వ్యవహరించింది కూడా కాంగ్రెస్సే. 1969లో చెన్నారెడ్డి, విద్యార్థులు, ఉద్యోగుల నాయకత్వంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడితే... చివరకు తెలంగాణ డెమొక్రటిక్‌గా 14 ఎంపీ స్థానాల్లో 11 మంది గెలిచారు. యావత్ తెలంగాణ మా తెలంగాణ మాకు కావాలి అంటే ఆనాడు ఇందిరాగాంధీ నో తెలంగాణ అంటూ నిరాకరించారు.
అలాగే కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వను అని సభలో చెప్పారు. అయినా ఒక్క తెలంగాణ మంత్రి కూడా వ్యతిరేకించలేదు. త్వరలో దామరచర్లలో 4 వేల మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్‌ను రూ.30 వేల కోట్లతో అందుబాటులోకి తీసుకొస్తున్నాం. దీన్ని కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. వాళ్లు కరెంటు కూడా గోల్‌మాల్ చేస్తారు. రైతుబంధు రాదు..’అని సీఎం పేర్కొన్నారు.
చంద్రబాబు పాలనలో రైతులపై కాల్పులు
‘చంద్రబాబు పాలన సమయంలోనూ కాంగ్రెస్ పార్టీ మౌన ప్రేక్షక పాత్ర వహించింది. తెలుగుదేశం హయాంలో తెలంగాణలో పరిస్థితులు మరింత దిగజారాయి. ఆనాడు స్పీకర్ స్థానంలో కూర్చున్న వ్యక్తి.. ప్రణయ్ భాస్కర్ అనే ఎమ్మెల్యే ‘తెలంగాణ’అంటే.. నో నో తెలంగాణ అనే పదం వాడకూడదని రూలింగ్ ఇచ్చిన స్థాయికి దిగజారింది.
ఆ రోజు కూడా కాంగ్రెస్ మౌన ప్రేక్షక పాత్ర పోషించింది. చంద్రబాబు నాయుడు విద్యుత్ సంస్కరణల ముసుగులో విద్యుత్ చార్జీలను పెంచారు. ఒక సంవత్సరం కాదు.. మూడు సంవత్సరాలు 15 శాతం పెరుగుతుందని చెబితే ఆ సమయంలో నేను డిప్యూటీ స్పీకర్‌గా ఉండి లేఖ రాశా. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో ప్రజలు, రైతులు బషీర్‌బాగ్‌లో నిరసన తెలిపేందుకు వస్తే కాల్పులు జరిపారు. పట్టపగలు జరిగిన ఆ కాల్పుల్లో కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు చనిపోయారు..’అని కేసీఆర్ గుర్తు చేశారు.
కేంద్రం తప్పనిసరిగా అవార్డులు ఇవ్వాల్సి వస్తోంది
‘కేంద్రంలో మమ్మల్ని రాసి రంపాన పెట్టే పార్టీ ప్రభుత్వమే ఉంది. అయినా తప్పనిసరిగా మూడు నెలలకోసారి అవార్డులు ప్రకటించాల్సి వస్తోంది. బండి పోతే బండి, గుండు పోతే గుండు ఇస్తా అన్నోడు పత్తా లేకుండా పోయిండు. రైతులు పండించిన పంట మొత్తం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ధరణి రద్దు చేసి ఏం చేస్తారో కాంగ్రెస్ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ బీఆర్‌ఎస్‌ను బీజేపీకి బీ టీమ్ అన్నాడు. సీన్ కట్ చేస్తే ఆయనే వెళ్లి బీజేపీలో జొర్రిండు. మా పార్టీ ఎప్పుడూ లౌకికవాద పార్టీయే. మజ్లిస్– బీఆర్‌ఎస్ భవిష్యత్‌లో కూడా ఫ్రెండ్లీ పార్టీలుగానే ఉంటాయి..’అని కేసీఆర్ స్పష్టం చేశారు.
వీధి నల్లాలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ
‘ప్రపంచమంతా ప్రభావం చూపే హైదరాబాద్ స్థిరాస్తి రంగం పెరుగుతోంది. హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి స్థిరాస్తి కంపెనీలు వస్తున్నాయి. సింగరేణి కార్మికులకు వచ్చే దసరా, దీపావళి సందర్భంగా రూ.వెయ్యి కోట్లు బోనస్ ఇవ్వబోతున్నాం. అప్పుల్లో తెలంగాణ 23వ స్థానంలో ఉంది. పరిమితికి లోబడే అప్పులు చేశాం. నియామక పరీక్షలు దశల వారీగా నిర్వహిస్తున్నాం. గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో వాటిని మార్చేందుకు వీలుకాదు. పల్లెలు, పట్టణాల్లో రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తున్నాం.
వీధి నల్లాలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ. మిషన్ కాకతీయ పుణ్యమే 30 లక్షల బోర్లు నీళ్లు పోస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కాళేశ్వరం నుంచే తుంగతుర్తి, కోదాడ, డోర్నకల్‌కు నీళ్లు వెళ్తున్నాయి. దేశంలోనే అత్యుత్తమ పునరావాసాలు నిర్మించింది తెలంగాణ. కరోనా, నోట్ల రద్దు వంటివి రాకపోయి ఉంటే తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించేది..’అని కేసీఆర్ పేర్కొన్నారు.
7 వేల దరఖాస్తులు పెండింగ్‌లో..
సీఎం సమాధానం తర్వాత ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ అడిగిన ప్రశ్నకు కేసీఆర్ వివరణ ఇచ్చారు. ‘మౌజంలు, ఇమాంలకు ఇప్పటికే నెలకు రూ.10 వేలు ఇస్తున్నాం. అయితే ఇంకా 7 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అందరికీ సోమవారం సాయంత్రంలోగా ఉత్తర్వులు ఇచ్చేస్తాం. ఖబరస్తాన్ కోసం మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో 150 ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 112 ఎకరాల భూమికి సంబంధించి రేపటిలోగా ఉత్తర్వులు ఇస్తాం..’అని ముఖ్యమంత్రి తెలిపారు.
జగన్‌ను అనేక రకాలుగా వేధించారు..
‘రాజశేఖర్‌రెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జగన్‌మోహన్‌రెడ్డిని రాంగ్ హ్యాండిల్ చేసింది. ఆయన్ని అనేక రకాలుగా వేధించి, చివరకు జైల్లో కూడా పెట్టారు. ఆయన సొంత పార్టీ స్థాపించుకున్నారు. ఆ తర్వాత కడప ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక వస్తే ఆయన నాలుగైదు లక్షల బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు.
అనంతరం వచ్చిన ఒకటి రెండు ఎన్నికలను కూడా ఆయన స్వీప్ చేయడంతో ఇక ఆంధ్రాలో మన పని అయిపోయిందనే ఆలోచనకు వచ్చారు. 2014 ఎన్నికల సందర్భంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు ఎదురుగాలి వచ్చింది. ఫలితాలు కూడా అదే విధంగా వచ్చాయి. ఆంధ్రాలో పోయింది. తెలంగాణలోనన్న కనీసం పది సీట్లన్నా రాకపోతాయా అనే ఒత్తిడిలో తెలంగాణ ఇచ్చారే కానీ ప్రేమతో ఇవ్వలేదు..’ అని కేసీఆర్ అన్నారు.
దేశమే ఆశ్చర్యపోయేలా ఉద్యోగులకు పేస్కేల్
‘దేశమే ఆశ్చర్యపోయేలా ఉద్యోగులకు పేస్కేల్ ఇస్తాం. మాకు మానవీయ దృక్పథం ఉంది. ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడాం. త్వరలోనే మధ్యంతర భృతి ఇచ్చి పీఆర్సీని నియమిస్తాం. బ్రహ్మాండంగా జీతాలు పెంచుకుంటాం. రాష్ట్రం ధనికమైతే.. వాళ్లు ధనికులు కావాలి. వారికి నాలుగు రూపాయలు కావాలి. భారత్‌లో అధికంగా వేతనాలు పొందేది తెలంగాణ ఉద్యోగులే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే వీరికి ఎక్కువ జీతాలు ఇస్తున్నాం..’అని సీఎం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment