సాక్షి, హైదరాబాద్ : కొత్త మున్సిపల్ చట్టంలో కీలక ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఉద్యోగుల సర్వీసు రూల్స్‌కు సంబంధించి ప్రస్తుతం విడివిడిగా ఉన్న నిబంధనలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేవాలని భావిస్తోంది. ఇప్పటివరకు అర్బన్ అథారిటీలు, జీహెచ్‌ఎంసీ, నగరపాలక సంస్థల్లోకి మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు బదిలీపై వచ్చే అవకాశం ఉండేది కాదు. కానీ ప్రతిపాదిత చట్టం ప్రకారం రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జీహెచ్‌ఎంసీ, పట్టణాభివృద్ధి సంస్థలు... ఏవైనా ఒకటే సర్వీసు రూల్స్ ద్వారా ఏ ఉద్యోగి ఎక్కడికైనా బదిలీపై వెళ్లే సౌలభ్యాన్ని కల్పించనుంది. ఈ క్రమంలో జోనల్, మల్టీజోనల్ మౌలిక సూత్రాలకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోనుంది. దీన్ని ‘తెలంగాణ మున్సిపల్ సర్వీసెస్’గా నిర్వచిస్తూ కొత్త చట్టంలో పొందుపర్చనుంది. ఈ మేరకు రూపొందించిన ముసాయిదా మున్సిపల్ చట్టం–2019 బుధవారం కేబినెట్ ముందుకు రానుంది. రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన అనంతరం ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి ఆమోదముద్ర పడనుంది.
అభివృద్ధి కోసం సలహాలు...
పౌరసేవల్లో పారదర్శకత..అధికారుల్లో జవాబుదారితనం.. ప్రజాప్రతినిధుల్లో అంకితభావం.. స్థూలంగా ఇదీ కొత్త పురపాలకచట్ట నిర్వచనం. ఇల్లు కట్టినా.. కూల్చినా, పుట్టినా.. గిట్టినా అమ్యామ్యాలు సమర్పించుకుంటే తప్ప ధ్రువపత్రాలు చేతికందని పరిస్థితి నగర/పురపాలికల్లో నెలకొంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి, పురపాలనను గాడిలో పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన పురచట్టాన్ని తేవాలని నిర్ణయించడం తెలిసిందే. పురపాలనలో అధికారులతోపాటు ప్రజాప్రతినిధులకు భాగస్వామ్యం కల్పిస్తున్న ఈ చట్టంలో మరో ముఖ్య సంస్కరణను కూడా ప్రవేశపెట్టనున్నారు. మున్సిపాలిటీల అభివృద్ధిలో ఆయా పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలనూ భాగస్వామ్యులను చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రతి మున్సిపాలిటీకి ఓ అభివృద్ధి సలహా కమిటీని ఏర్పాటు చేయాలని చట్టంలో ప్రతిపాదిస్తున్నారు. ఈ కమిటీలో పట్టణాల్లోని ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఔత్సాహికులకు అవకాశం కల్పించి వారి సలహాలను కూడా స్వీకరించనున్నారు. అయితే ఈ కమిటీలు కేవలం సలహాలే ఇస్తాయని, వాటి అమలు నిర్ణయం మాత్రం మున్సిపల్ పాలకవర్గమే తీసుకుంటుందని, తద్వారా రెండు పవర్‌సెంటర్లు ఏర్పడకుండా చట్టంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం.
సుపరిపాలనకు పెద్దపీట...
కొత్త చట్టంలో సుపరిపాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. సిటిజన్ చార్టర్‌కు ప్రాధాన్యతనిస్తూ ఆన్‌లైన్‌లోనే ప్రజల దరికి సేవలను చేర్చాలని నిర్ణయించింది. మ్యాన్యువల్ సేవలకు చరమగీతం పాడి అన్నింటినీ ఆన్‌లైన్‌లో పొందేలా చర్యలు తీసుకుంటోంది. బిల్డింగ్ పర్మిషన్‌ల జారీలో ఏమాత్రం జాప్యం జరిగినా సదరు అధికారిపై చర్యలు చేపట్టేలా కొత్త నిబంధనను తీసుకురానుంది. అన్నీ సవ్యంగా ఉన్నా నిర్ణీత వ్యవధిలో అనుమతులు జారీ చేయకపోతే దాన్ని అనుమతి ఇచ్చినట్లుగా పరిగణించనుంది. అలాగే అనుమతి ఇవ్వకుండా సతాయించిన అధికారికి జరిమానా విధించనుంది. మరోవైపు పౌరుల్లోనూ జవాబుదారీతనం పెంపొందించేందుకు పకడ్బందీగా వ్యవహరించనుంది. ముఖ్యంగా శానిటేషన్ విషయంలో అడ్డగోలుగా వ్యవహరిస్తే కొరడా ఝళిపించనుంది. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తే భారీగా ఫైన్‌లు వేయనుంది. అలాగే అనధికారికంగా వ్యాపారాలు చేసినా, అక్రమ నిర్మాణాలు చేపట్టినా పెనాల్టీలు బాదనుంది. పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేకంగా వార్డులవారీగా ప్రణాళికలు రూపొందించనుంది. చెత్త సేకరణ, డంపింగ్ ముఖ్యంగా ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్)కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ చట్టంలో నిబంధనలు తయారు చేసింది. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, స్వచ్ఛభారత్‌లో భాగంగా కార్పొరేషన్లు, మేజర్ మున్సిపాలిటీలు బోర్డులు ఏర్పాటు చేసి పర్యవేక్షించనున్నాయి. చిన్న మున్సిపాలిటీలను క్లస్టర్లుగా ఏర్పాటు చేసి వాటిలోనూ ఇదే తరహా బోర్డులను ఏర్పాటు చేయనున్నారు.
పాలనాధికారులకే పగ్గాలు!
ఇక నుంచి మున్సిపాలిటీలపై జిల్లా కలెక్టర్లు శీతకన్ను వేస్తే కుదరదు. విధిగా తమ పరిధిలోని పురపాలికలను పక్షం రోజులకోసారి సందర్శించాల్సిందే. పాలకవర్గాలకు గౌరవం ఇస్తునే.. వారి నిర్ణయాలను మదింపు చేసే బాధ్యత కలెక్టర్లకు కొత్త చట్టం కట్టబెడుతోంది. బడ్జెట్ కేటాయింపుల్లోనూ అభివృద్ధి అసమానతలకు తావివ్వకుండా అన్ని వార్డులను సమదృష్టితో చూడాల్సి ఉంటుంది. బడ్జెట్‌లో 30 శాతం నిధులను పట్టణ ప్రధానావసరాలకు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రతి మున్సిపాలిటీలో వైకుంఠ ధామాలు, కబేళాల నిర్మాణాన్ని తప్పనిసరి చేయనుంది. ప్రస్తుత చట్టాలను సవరిస్తూ కొత్త చట్టాలకు రాష్ట్ర ప్రభుత్వం తుదిరూపునిచ్చింది. వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న చట్టాలను అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ.. ముఖ్యమైన చాప్టర్లను కొత్త చట్టంలో పొందుపరిచింది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ), నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలకు వేర్వేరుగా చట్టాలను తేనుంది. కాగా, కొత్తగా అర్బన్ పాలసీపై కసరత్తు చేస్తున్న సర్కారు.. పట్టణాల్లో టౌన్‌షిప్‌లను ప్రోత్సహించేందుకు ప్రత్యేక టౌన్‌షిప్ పాలసీని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment