జీరో అవినీతి! | KCR Review Meeting On Municipal Act | Sakshi
Sakshi News home page

గుణాత్మక పాలనకు త్రివిధానాలు: ముఖ్యమంత్రి కేసీఆర్‌ 

Jul 11 2019 2:05 AM | Updated on Jul 11 2019 8:59 AM

KCR Review Meeting On Municipal Act - Sakshi

అవినీతిని అరికట్టే దిశగా తెలంగాణ నూతన మునిసిపల్‌ చట్టం రావాలి. గ్రామీణ తెలంగాణలో ఎన్నికల్లో పోరాడి గెలిచాం. శాసనసభ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి దీవించారు. అన్ని రకాల సంక్షేమం చేపట్టాం. ఇంకా ప్రజల ఋణం తీర్చుకోవడానికి గుణాత్మకమైన మార్పు తేవాలని  సంకల్పించాం. చేతనైనంత మార్పు తెస్తాం.  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గుణాత్మక పాలన సాధించేందుకు త్రివిధానాలను అనుసరించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులకు సూచించారు. తెలంగాణ రూరల్‌ పాలసీ, తెలంగాణ అర్బన్‌ పాలసీ, తెలంగాణ రెవెన్యూ పాలసీ అనే మూడు పాలసీలను పటిష్టంగా అమలుపరచడం ద్వారా రాష్ట్రంలో గుణాత్మక పాలన అందించగలమన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యల నుంచి ఉపశమనం లభించే రీతిలో రూరల్‌ (గ్రామీణ) విధానం, లంచాలు ఇచ్చే అవసరం ఎంత మాత్రం రాకుండా ఉండే విధంగా రెవెన్యూ విధానం, జీరో స్థాయికి అవినీతి చేరుకునే విధంగా అర్బన్‌ (పట్టణ) విధానం ఉండాలన్నారు.

నూతన మునిసిపల్‌ చట్టం పురోగతి మీద, అందులో చేర్చాల్సిన అంశాల మీద, చట్టంలో ప్రజాప్రతినిధుల బాధ్యతలు ఎలా ఉండాలో అన్న విషయాల మీద ముఖ్యమంత్రి బుధవారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ‘‘రాష్ట్ర సాధనలో స్థిరమైన ప్రయాణం చేశాం. అనుకున్నది సాధించాం. అలాగే అధికారంలోకి వచ్చిన తరువాత పలు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా అమలు చేశాం. అన్నింటికన్నా పెద్ద సమస్యలైన మంచినీటి, సాగునీటి సమస్యలను, కరెంట్‌ సమస్యను అధిగమించాం. ఓట్లే పరమావధిగా కాకుండా అభివృద్ధి, సంక్షేమం పట్ల దృష్టి సారించాం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా గ్రామాల పరిస్థితి బాగుపడాలి అనుకున్నాం. పటిష్టమైన చట్టం తెచ్చాం. గ్రామాల అభివృద్ధి సాగుతోంది. గ్రామాల్లో మూడు నెలల్లో మార్పు చూడబోతున్నాం’’అని అన్నారు. 

అవినీతిని అరికట్టేలా చట్టం... 
‘‘గ్రామీణ తెలంగాణాలో ఎన్నికల్లో పోరాడి గెలిచాం. శాసన సభ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి ప్రజలు దీవించారు. అన్ని రకాల సంక్షేమం చేపట్టాం. ఇంకా వాళ్ల ఋణం తీర్చుకోవడానికి గుణాత్మకమైన మార్పు తేవాలని ప్రభుత్వం సంకల్పించింది. చేతనైనంత మార్పు తెస్తాం. ప్రతి పనికీ ఎవరో ఒకరు పూనుకోవాలి కాబట్టి ఆ పనికి మేం శ్రీకారం చుడుతున్నాం. అవినీతిని అరికట్టే దిశగా తెలంగాణ నూతన మునిసిపల్‌ చట్టం రావాలి. ఈ సారి ప్రజలు ప్రభుత్వం నుంచి ఆశించేది ఉత్తమ విధానాలు, అభ్యాసాలు. ఉత్తమ విధానాలతో ప్రజలు బాగుపడాలి. ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతోనే , ఆ స్ఫూర్తితోనే నూతన మునిసిపల్‌ చట్టం ఉండాలి. ప్రజల అవసరాలను తీర్చేలా, వారి బాగోగులు చూసుకునే రీతిలో, పట్టణాల అభివృద్ధి చక్కగా జరిగే పద్ధతిలో కఠినమైన చట్టం రావాలి.

చట్టం రూపకల్పన ఆషామాషీగా జరగకూడదు’’అని సీఎం కేసీఆర్‌ అన్నారు. నూతన మునిసిపల్‌ చట్టం మీద అవగాహన కలిగించడానికి మునిసిపల్‌ కమిషనర్లకు ఓరియంటేషన్‌ శిక్షణా కార్యక్రమం నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్‌. నర్సింగరావు, మునిసిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్, కామారెడ్డి కలెక్టర్‌ ఎన్‌. సత్యనారాయణ, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌ రావు, మునిసిపల్‌ శాఖ కమిషనర్‌ శ్రీదేవి, సీఎంఓ కార్యదర్శి స్మిత సభర్వాల్, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌ రెడ్డి, మాజీ మునిసిపల్‌ అధికారి డీవీ రావు తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement