సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రజల కోణంలో నుంచి ఆలోచించి ముఖ్యమంత్రి కేసీఆర్.. పరిపాలనా సౌలభ్యం కోసం 33 జిల్లాలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. శుక్రవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మున్సిపల్ చట్టం, పట్టణ ప్రగతిపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో అధికారులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్ల ప్రాంతం జిల్లా కేంద్రంగా ఏర్పడుతుందని ఎప్పుడూ అనుకోలేదని.. చిన్న కార్యాలయం అక్కడ ఏర్పాటు చేయాలన్నా యుద్ధం చేయాల్సివచ్చేందన్నారు. నాలుగేళ్లలో ఎన్నో పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చామని పేర్కొన్నారు. గతంలో కలెక్టర్లకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌తో పెద్దగా సంబంధాలు ఉండేవి కావని.. సీఎం కేసీఆర్ నిర్ణయం పరిస్థితిని సమూలంగా మార్చిందని చెప్పారు.
ప్రజలు గొంతెమ్మ కోరికలేమి కోరడం లేదు..
ప్రతిపౌరుడు కోరుకునేలా రోడ్లు, మౌలిక సదుపాయాలు అందించాలన్నారు. సీఎం కేసీఆర్ కోరుకునే విధంగా పచ్చదనాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడే విధంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రజలకు ప్రణాళికబద్ధమైన ప్రగతిని అందించాలన్నారు. ప్రజలు అసాధారణమైన గొంతెమ్మ కోరికలేమి కోరడంలేదని.. వ్యవస్థీకృత పట్టణాలను కోరుకుంటున్నారని తెలిపారు. దీర్ఘకాలిక అభివృద్ధి కనిపించేవిధంగా పట్టణాల రూపురేఖలను మార్చాలన్నారు. ప్రజా ప్రతినిధులను పదవి నుంచి తొలగించే అసాధారణ బాధ్యతను సీఎం కేసీఆర్ మున్సిపల్ చట్టం ద్వారా కల్పించారని వెల్లడించారు.
టీఎస్ ఐ పాస్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు..
టౌన్ ప్లానింగ్ విషయంలో సీరియస్ గా ఉండాలని.. అత్యుత్తమ పట్టణాలను రూపొందించాలని సూచించారు. టీఎస్ ఐ పాస్ గురించి ఎక్కడికి వెళ్లినా గొప్పగా మాట్లాడుకుంటున్నారని.. టీఎస్ బీ పాస్‌ను ఏప్రిల్ 2 నుంచి అమలు చేస్తామని పేర్కొన్నారు. మార్చి నెలలో టీఎస్ బీ పాస్ లో ఉన్న అన్ని లోటు పాట్లను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. టీఎస్ బీ పాస్ పై అన్ని స్థాయిల అధికారులకు, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పైసా లంచం లేకుండా ఇంటి అనుమతులు ఇవ్వాలని..75 గజాల లోపు ఇంటి నిర్మాణానికి ఎలాంటి అనుమతి అవసరం లేదని పేర్కొన్నారు. టీఎస్ బీ పాస్, మీ సేవాతో పాటు మరో కొత్త యాప్‌ను తీసుకువస్తున్నామని చెప్పారు. ఈ మూడు ప్రక్రియల ద్వారా లేదా నేరుగా మున్సిపల్ అధికారులకు కలవడం ద్వారా ఇంటి నిర్మాణ అనుమతి లభిస్తుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment