సాక్షి, హైదరాబాద్: పురపాలనలో కలెక్టర్లకు సంపూర్ణ అధికారాలు ఇక సంక్రమిస్తున్నాయి. ఇప్పటికే మున్సిపల్ చట్టంలో వారి అధికారాలను ప్రభుత్వం స్పష్టం చేయగా, ఏ అంశంలో ఎలాంటి అధికారాలున్నాయనే దానిపై మున్సిపల్ శాఖ చట్టంలోని అంశాలను ఉటంకిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మొన్నటివరకు మున్సిపల్ వ్యవహారాల్లో కలెక్టర్ల పాత్ర, జోక్యం నామమాత్రంగానే ఉండగా, ఇక నుంచి పట్టణ పాలనలో వారే కీలకం కానున్నారు. వీరి కనుసన్నల్లోనే బడ్జెట్ తయారీ నుంచి ప్రభుత్వ పథకాల అమలు, విధాన నిర్ణయాలు జరగనున్నాయి. ముఖ్యంగా పట్టణ స్థానిక సంస్థలను తమ నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు పట్టణాభివృద్ధికి చెందిన అన్ని కీలకాంశాల్లోనూ కలెకర్లే సూపర్‌బాస్‌లుగా వ్యవహరించనున్నారు.
భవన నిర్మాణ అనుమతుల నుంచి...
పట్టణ ప్రాంతాల్లో ముఖ్య సమస్యలైన భవన నిర్మాణం, లేఅవుట్ల ఏర్పాటు, అనధికార భవనాల గుర్తింపు, ట్రాఫిక్ నిర్వహణ లాంటి అంశాల్లో టౌన్‌ప్లానింగ్ విభాగం ఇప్పటివరకు కీలకంగా వ్యవహరిస్తోంది. ఇక నుంచి వీటన్నింటిలో కలెక్టర్లు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోనున్నారు. భవన నిర్మాణ అనుమతులకు గాను వారే స్వీయ నిర్ధారిత అఫిడవిట్ ద్వారా నిర్ణయం తీసుకుని, ఆ తర్వాత టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన జరపనున్నారు. గతంలో 500 చదరపు మీటర్ల వైశాల్యం, 10 చదరపు మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉండే భవన నిర్మాణాల కోసం మున్సిపాలిటీతో పాటు ఇరిగేషన్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖలకు కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, ఇప్పుడు సింగిల్‌విండో విధానంలో 21 రోజుల్లో అనుమతులిచ్చే అధికారం కలెక్టర్లకు దఖలు పడుతోంది.
కలెక్టర్లు చైర్మన్లుగా ఉండే కమిటీ ఈ అనుమతుల విధానాన్ని టీఎస్‌ఐపాస్ తరహాలో పరిశీలించనుంది. ఇక, అనధికార భవన నిర్మాణాలపై కలెక్టర్లకు గతంలో స్పష్టమైన అధికారాలు లేకపోగా, ఇక నుంచి వాటిని గుర్తించి కూల్చివేయడం, సదరు యజమానికి పెట్టుబడిలో 25 శాతం జరిమానా విధించే అధికారాన్ని సెక్షన్ 180 ద్వారా కలెక్టర్లకు ఇచ్చారు. వారి నేతృత్వంలో ఏర్పాటయ్యే జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ ఈ అంశాలను పర్యవేక్షించనుంది. పుర పౌరుల నుంచి ఫిర్యాదులు వచ్చిన ఏడు రోజుల్లోపు అనధికార భవన నిర్మాణాలపై చర్యలు తీసుకునే అధికారం సెక్షన్ 174(5) ద్వారా కలెక్టర్లకు దఖలు పరిచారు.
కమిషనర్ల విధులన్నీ పర్యవేక్షించాల్సిందే
పురపాలనకు సంబంధించి మున్సిపల్ కమిషనర్లు నిర్వహించే విధులన్నింటినీ పర్యవేక్షించడంతో పాటు వాటినీ సంపూర్ణంగా కలెక్టర్లే నియంత్రించనున్నారు. మున్సిపాలిటీలు, ఇతర పట్టణ స్థానిక సంస్థల అన్ని విధులను కూడా పర్యవేక్షించడంతోపాటు ప్రతి పట్టణాన్ని మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దే బాధ్యత కలెక్టర్లదే. పాలకవర్గాలు చేసే ప్రతి తీర్మానాన్ని పరిశీలించడం, పాలకవర్గ సభ్యుల ప్రవర్తనను బట్టి వారిని సస్పెండ్ చేయడం, మున్సిపాలిటీల చైర్‌పర్సన్లకు సూచనలు, సలహాలివ్వడం, మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవడం, గతంలో పాలకవర్గాలు చేసిన ఏదైనా చర్యను పునఃసమీక్షించడం, చైర్‌పర్సన్లు, కమిషనర్లను వివరణలు కోరడం, మున్సిపాలిటీలిచ్చిన లైసెన్సులను రద్దు చేయడం. స్క్వాడ్‌ల ఏర్పాటు లాంటి అన్ని అంశాల్లో కలెక్టర్లకు విశేష అధికారాలిచ్చారు. వీటన్నిటినీ మున్సిపల్ చట్టంలోనే పేర్కొన్నప్పటికీ ప్రస్తుత చట్టం ద్వారా ఎలాంటి అధికారాలు సంక్రమించాయనే దానిపై అంశాల వారీ నివేదికను తాజాగా తయారు చేసింది. ఆ అంశాలనే ఇటీవల పురచట్టం–పట్టణ ప్రగతిపై ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పురపాలక శాఖ డైరెక్టర్ సత్యనారాయణ కూడా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment