సాక్షి, హైదరాబాద్: ఇకపై ఇష్టారాజ్యంగా పట్టణ ప్రణాళిక అమలుపరచడం కుదరదు. అయినవారికి అడ్డగోలుగా అనుమతులు మంజూరు చేసే వీలుండదు. అవినీతిపరులకు కొత్తగా రాబోతున్న పురపాలక చట్టం ముకుతాడు వేయనుంది. ఈ చట్టం ప్రకారం కలెక్టర్ సారథ్యంలోని అధికారుల కమిటీకి భవన నిర్మాణ అనుమతులు జారీ చేసే అధికారం రానుంది. ప్రస్తుతం పురపాలికల్లో టౌన్‌ప్లానింగ్ అధికారి (టీపీవో), కమిషనర్ నిర్ణయాధికారం మేరకు అనుమతులు మంజూరవుతున్నాయి. వీటిలో పారదర్శకత లోపిస్తోంది. కాసులు సమర్పిస్తే ఎంతటి అడ్డగోలు నిర్మాణాకైనా అనుమతులు వస్తాయనే విమర్శలున్నాయి. మున్సిపల్ శాఖలో అవినీతి వేళ్లూనుకుందని, ప్రక్షాళన అవసరమని ఇటీవల సీఎం అన్నారు. ఈ నేపథ్యంలో కొత్త పంచాయతీరాజ్ చట్టం తరహాలో నయా పురపాలక చట్టం తీసుకురావాలని నిర్ణయించారు. పట్టణాలు, నగరాల భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా చట్టానికి రూపకల్పన చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోని పట్టణ స్థానిక సంస్థలు, నగరాభివృద్ధి సంస్థల చట్టాలను అధ్యయ నం చేస్తున్నారు. పట్టణీకరణకు అనుగుణంగా మౌలి క సదుపాయాల కల్పనకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు కొత్త చట్టం ద్వారా అధికారాలు, బాధ్యతలు కల్పించే దిశగా చట్టానికి మెరుగులు దిద్దుతున్నారు.
ప్రజా ప్రతినిధులకు బాధ్యత
స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఉత్సవ విగ్రహాలు కాకుండా కొత్త చట్టం ద్వారా పూర్తిస్థాయిలో జవాబుదారీతనం సక్రమించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. విధులు, బాధ్యతలు సక్రమంగా నిర్వహించకుంటే వారిపైనా చర్యలు తీసుకునేలా కొత్త చట్టంలో నిబంధనలు పొందుపరుస్తున్నారు. ఎన్నికల ద్వారా బాధ్యతలు చేపట్టిన పురపాలికల చైర్మన్లు/మేయర్లు, కార్పొరేటర్లు/కౌన్సిలర్లు చట్టానికి లోబడి వ్యవహరించాలి. అంతేకాదు తమ హయాంలో జరిగిన పనులకు ఆ తర్వాత కూడా వారే బాధ్యులుగా ఉండేలా నిబంధనలు ఉండనున్నాయి.
ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం
వివిధ రాష్ట్రాల్లో మనుగడలో ఉన్న మున్సిపల్ చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఈ మేరకు అధికారుల బృందం ఇటీవల గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో పర్యటించి చట్టాలను మదింపు చేసింది. ప్రణాళికబద్ధంగా అభివృద్ధి జరగడంలో టౌన్‌ప్లానింగ్ శాఖదే కీలక భూమిక. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలు మినహాయిస్తే మున్సిపాలిటీల్లో టీపీవోలు, గ్రామీణ ప్రాంతాల్లోనైతే డీటీసీపీ విభాగం లేఅవుట్లు, భవన నిర్మాణ అనుమతులు జారీ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగుల కొరత, పని భారం కారణంగా ఈ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే అనుమతులు మంజూరు చేస్తోంది. దీంతో మాస్టర్ ప్లాన్/బిల్డింగ్ ప్లాన్‌కు విరుద్ధంగా భవనాలు వెలుస్తున్నాయి. కనీస సౌకర్యాలు లేకుండానే లేఅవుట్లు పుట్టుకొస్తున్నాయి. అవినీతికి తెరలేస్తోంది. వీటిని పరిగణనలోకి తీసుకున్న సర్కారు భవిష్యత్తులో పట్టణాలు కాంక్రీట్ జంగిల్‌లా సమస్యాత్మకంగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. పర్యావరణానికి సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని అనుమతులు ఇచ్చే అంశాన్ని కొత్త చట్టంలో జోడిస్తున్నారు.
పన్నులు పీకాల్సిందే!
మున్సిపాలిటీలు సొంతంగా ఆర్థిక వనరులు సమకూర్చుకునేలా కొత్త చట్టంలో ప్రాధాన్యం కల్పిస్తున్నారు. స్థానిక సంస్థలకు రావాల్సిన పన్నులను పకడ్బందీగా వసూలు చేసుకునే అధికారాలు మున్సిపాలిటీలకు సక్రమించనున్నాయి. ఆస్తి, నీటి, లైబ్రరీ పన్నులను 100 శాతం వసూలు చేయడమే గాకుండా.. బకాయిలు రాబట్టడానికి రెవెన్యూ రికవరీ యాక్ట్ వినియోగించుకునే వెసులుబాటును పురపాలికలకు కట్టబెట్టే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. కమిషనర్లకు న్యాయాధికారాలు కల్పించే అంశాన్ని పొందుపరుస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, వ్యతిరేకంగా అక్రమ భవన నిర్మాణాలు, వివిధ రకాల వ్యాపారాల పర్యవేక్షణ, ప్రభుత్వ భూములు, ఆస్తుల పరిరక్షణ, అక్రమార్కులపై చర్యలు తీసుకోవడం న్యాయాధికారాలతోనే సాధ్యమని ప్రభుత్వం భావిస్తోంది. పురపాలక సంఘాల పరిధిలో జరుగుతున్న భూదందాలు, సర్కారీ భూముల ఆక్రమణల్లో కమిషనర్లు ప్రేక్షక పాత్రకే పరిమితం అవుతున్నారు. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లోని భూ వ్యవహారాలను పురపాలికల పరిధిలోకి తెస్తే ఎలా ఉంటుందనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment