సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీలు, మండల ప్రజాపరిషత్‌లు, జిల్లా ప్రజా పరిషత్‌ల్లో రిజర్వేషన్లకు ఉద్దేశించిన పంచాయతీరాజ్ చట్టం 9, 15, 152, 153, 180, 181 సెక్షన్లను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ సెక్షన్లను రాజ్యాంగ, చట్ట విరుద్ధంగా ప్రకటించి కొట్టివేయాలని కోరుతూ కర్నూలు జిల్లాకు చెందిన బిర్రు ప్రతాప్‌రెడ్డి వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 28న జారీ చేసిన జీవో 176ని కూడా ప్రతాప్‌రెడ్డి సవాలు చేశారు. ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరపనుంది. 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమే కాకుండా కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సైతం విరుద్ధమని ప్రతాప్‌రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యను అడ్డుకోకుంటే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.
తొలుత జనాభా గణన చేపట్టాలి...
పంచాయతీరాజ్ చట్టంలోని 9, 15, 152, 153, 180, 181 సెక్షన్ల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అధికారం ప్రభుత్వానికి ఉన్నా 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లను ఏ ప్రాతిపదికన ఖరారు చేశారో తెలియచేయడం లేదన్నారు. ఎటువంటి శాస్త్రీయ సర్వే చేయకుండానే ప్రభుత్వం ఏకపక్షంగా రిజర్వేషన్లు ఖరారు చేసిందన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం సరికాదన్నారు. ఎస్సీ, ఎస్టీలతో పోలిస్తే బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం తప్పనిసరి కాదని, ఇదే విషయాన్ని రాజ్యాంగ నిబంధనలు చెబుతున్నాయన్నారు. బీసీలకు రిజర్వేషన్ల కల్పన ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. అసాధారణ పరిస్థితుల్లోనే రిజర్వేషన్లు 50% దాటవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం బీసీలకు 34% రిజర్వేషన్లు ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. బీసీలకు వారి జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే తొలుత జనాభా గణన జరగాల్సిన అవసరం ఉందన్నారు.
అత్యవసర విచారణకు నిరాకరణ
ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో విచారించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది మంగళవారం ఉదయం సీజే నేతృత్వంలోని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. దీనికి నిరాకరించిన ధర్మాసనం బుధవారం విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఇదే రీతిలో జీవో 176ని సవాలు చేస్తూ పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి.
ఆ సెక్షన్లు.. రాజ్యాంగ విరుద్ధం
Published Wed, Jan 8 2020 4:36 AM | Last Updated on Wed, Jan 8 2020 4:36 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment